తెలుగుటైమ్స్ .నెట్ రేటింగ్ : 3/5
లైకా ప్రొడక్షన్స్, ఎన్.వి.ఆర్. సినిమా
నటీనటులు: రజనీకాంత్, అక్షయ్‌కుమార్, అమీ జాక్సన్, అనంత్ మహదేవన్, ఆదిల్ హుస్సేన్ తదితరులు
సంగీతం: ఎ.ఆర్.రెహమాన్, సినిమాటోగ్రఫీ: నిరవ్ షా, ఎడిటింగ్: ఆంటోని
నిర్మాత: సుభాస్కరన్
రచన, దర్శకత్వం: శంకర్
విడుదల తేదీ: 29.11.2018
గ్రాఫిక్స్ చూడాలి అంటే హాలీవుడ్ సినిమానే చూడాలి. హాలీవుడ్ సినిమాల్లో విజువల్ ఎఫెక్ట్స్ అద్భుతంగా ఉంటాయి. హాలివుడ్ స్థాయిలో సినిమాలు తియ్యడం మనవాళ్ళ వల్ల కాదు. అంత బడ్జెట్లో సినిమా తీసే నిర్మాతలు కూడా మనకు లేరు... ఇలాంటి మాటలకు ఇప్పుడు కాలం చెల్లింది. అలాంటి భారీ సినిమాలు మనమూ సినిమాలు చెయ్యగలం అని 'బాహుబలి' నిరూపించింది. హాలీవుడ్ స్థాయి విజువల్ ఎఫెక్ట్స్‌తో సినిమాలు తియ్యడం మాకూ సాధ్యమేనని రజనీకాంత్, శంకర్ల లేటెస్ట్ మూవీ '2.0' ప్రూవ్ చేసింది. 'రోబో' చిత్రానికి సీక్వెల్‌గా రూపొందిన ఈ సినిమా గురువారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ఈ సినిమాలో శంకర్ చూపించిన అద్భుతాలేంటి? నాలుగు సంవత్సరాలు కష్టపడి చేసిన ఈ సినిమా ఆడియన్స్‌కి ఎలాంటి అనుభూతిని కలిగించింది? అనే విషయాలు సమీక్షలోకి వెళ్ళి తెలుసుకుందాం.
కథ:
మితి మీరిన టెక్నాలజీ వల్ల భవిష్యత్తులో మానవజాతికి ముప్పు తప్పదని తెలియజెప్పే సినిమా ఇది. భూమి మీద ఉన్న ప్రతి ప్రాణికీ జీవించే హక్కు ఉంది. కొన్ని జీవాలు అంతరించి పోవడం వల్ల మానవజాతి మనుగడకు ప్రమాదం ఏర్పడే అవకాశం ఉందని చెప్పే సినిమా ఇది. కథ విషయానికి వస్తే హఠాత్తుగా నగరంలోని ప్రజల చేతుల్లోని సెల్ ఫోన్లన్నీ మాయమవుతూ ఉంటాయి. అలా కొన్ని లక్షల సెల్ ఫోన్లు గాల్లో కలిసిపోతాయి. సెల్ఫోన్లు ఏమయ్యాయి? దీని వెనుక ఉన్నదెవరు? అనే విషయాలు కనుక్కోవడానికి ప్రభుత్వం డా.వశీకర్ను సంప్రదిస్తుంది. సెల్‌ఫోన్స్ ఎక్కడ ఉన్నాయనే విషయాన్ని అతను, అతని అస్టిటెంట్ వెన్నెల(అమీ జాక్సన్) కనుక్కుంటారు. లక్షల సంఖ్యలో ఉన్న సెల్ఫోన్లు ఒక్కసారిగా పెద్ద పక్షిలా మారిపోతుంది. వారిద్దరిపై దాడి చేస్తుంది. అంతకుముందు సిటీలోని మొబైల్ డీలర్, మినిస్టర్ సెల్ఫోన్ల వరద వల్ల చనిపోతారు. అప్పుడు రంగంలోకి దిగిన డా.వశీకర్ ఒకప్పుడు కోర్టు నిషేధించిన రోబో 'చిట్టి'ని యాక్టివేట్ చెయ్యాలంటాడు. దానికి మొదట ఒప్పుకోని మినిస్టర్ చివరికి చిట్టిని ప్రవేశపెట్టమంటాడు. అలా చిట్టి 2.0గా రంగంలోకి దిగుతుంది. దాని సాయంతో సెల్ఫోన్ల మిస్టరీని ఛేదించేందుకు డా.వశీకర్ సిద్ధమవుతాడు. అసలు సెల్ఫోన్లు ఎందుకు మాయమవుతున్నాయి? దాని వెనుక ఉన్న శక్తి ఏమిటి? దాన్ని డా.వశీకర్, చిట్టి ఎలా ఎదుర్కొన్నారు? అనేది మిగతా కథ.
నటీనటులు:
డా.వశీకర్‌గా, చిట్టిగా రజనీకాంత్ పెర్ఫార్మెన్స్ అందర్నీ ఆకట్టుకుంటుంది. ముఖ్యంగా చిట్టి చేసే విన్యాసాల్లో ఆయన నటన అద్భుతమనే చెప్పాలి. రోబో వెన్నెలగా అమీ జాక్సన్‌కి కథలో చాలా ప్రాధాన్యం ఉంది. ఆ క్యారెక్టర్‌కి అమీ పూర్తి న్యాయం చేసింది. పక్షిరాజుగా అక్షయ్‌కుమార్ నటన గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. ఓల్డ్ పర్సన్‌గా అక్షయ్ నటన ప్రతి ఒక్కరినీ అలరిస్తుంది. అలాగే వివిధ గెటప్స్‌లో అతని పెర్ఫార్మెన్స్ మెప్పిస్తుంది. ముఖ్యంగా ఈ నలుగురి చుట్టూనే సినిమా అంతా రన్ అవుతూ ఉంటుంది. అయితే ఆడియన్స్‌కి ఎక్కడా బోర్ అనిపించదు.
సాంకేతిక వర్గం:
నిరవ్‌షా ఫోటోగ్రఫీ ఒక వండర్ అనే చెప్పాలి. ప్రతి షాట్, ప్రతి సీన్ ఎంతో రిచ్‌గా హాలీవుడ్ రేంజ్ సినిమాలా కనిపించడానికి నిరవ్ ఫోటోగ్రఫీ కూడా ఒక కారణం. ఎ.ఆర్.రెహమాన్ సంగీతం కూడా సినిమాకి బాగా ప్లస్ అయింది. సినిమాలో ఉన్నది మూడు పాటలే అయినా వాటిని అద్భుతంగా కంపోజ్ చేశాడు రెహమాన్. ఇక తన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్‌తో సినిమాని ఒక రేంజ్‌కి తీసుకెళ్ళాడు. ప్రపంచ స్థాయిలో ఒక విజువల్ వండర్‌గా నిలబడిన '2.0' చిత్రాన్ని నిర్మించిన లైకా ప్రొడక్షన్స్‌ని అభినందించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. శంకర్ మీద నమ్మకంతో దాదాపు 600 కోట్లు ఖర్చుపెట్టి అత్యున్నత సాంకేతిక విలువలతో ఈ చిత్రాన్ని నిర్మించడం మామూలు విషయం కాదు. ఇక డైరెక్టర్ శంకర్ గురించి చెప్పాలంటే తన ప్రతి సినిమాలోనూ ఒక మెసేజ్ ఉంటూనే ప్రేక్షకుల్ని ఆకట్టుకునేందుకు మంచి ఎంటర్టైన్మెంట్, పాటలు, యాక్షన్ సీక్వెన్స్‌లు ఉండేలా తగిన జాగ్రత్తలు తీసుకునే శంకర్ ఈ సినిమా విషయంలో అవన్నీ కాస్త పక్కన పెట్టి కేవలం విజువల్ ఎఫెక్ట్స్‌పైనే తన దృష్టిని సారించాడు. సినిమా టైటిల్స్ నుంచే మనల్ని విజువల్‌గా థ్రిల్ చేస్తుందీ సినిమా. ఒక్కసారిగా సెల్ ఫోన్స్ మాయమవడం, సెల్ఫోన్లు ఓ వరదలా రోడ్డుపై పరుగులు పెట్టడం, ఒక రూమ్ అంతా సెల్ ఫోన్స్‌తో నిండిపోవడం, సోల్జర్స్‌పై సెల్‌ఫోన్స్ దాడి చేయడం, భారీ ఆకారంలోకి మారిన చిట్టి, పక్షిరాజ్ ఫైట్ సీన్... ఇలా ఒకటేమిటి సినిమా అంతా విజువల్ వండర్స్‌తో నింపేసాడు శంకర్. వీటన్నింటివల్ల శంకర్ గత చిత్రాల్లో మాదిరిగా మధురమైన పాటలు, కామెడీ సీన్స్, ఎమోషనల్ సీన్స్ ఈ సినిమాలో కరవయయ్యాయి. అవన్నీ లేకపోయినా సినిమా ప్రారంభం నుంచి చివరి వరకు ఎక్కడా బోర్ అనేది లేకుండా చాలా ఇంటెలిజెంట్‌గా నడిపించాడు.
విశ్లేషణ:
విజువల్‌గా వండర్ అనిపించే సినిమాలు చూడాలంటే హాలీవుడ్ సినిమాలనే ప్రిఫర్ చేసే మనం ఇకపై ఇండియన్ సినిమాలను కూడా నిస్సంకోచంగా చూడొచ్చని శంకర్ నిరూపించాడు. ఇది అన్నివర్గాల ప్రేక్షకుల్ని ఆకట్టుకునే సినిమా అయినప్పటికీ సినిమాలోని చాలా సీన్స్ పిల్లలు బాగా ఎంజాయ్ చేసేలా అనిపిస్తాయి. ఫైనల్‌గా చెప్పాలంటే రజనీకాంత్, శంకర్, లైకా ప్రొడక్షన్స్ నాలుగేళ్ళ కృషికి తగిన ఫలితం లభించింది. వారు పడ్డ శ్రమ వృధా అవ్వలేదు. రజనీకాంత్, శంకర్ కాంబినేషన్లో వచ్చిన మరో బ్లాక్‌బస్టర్ మూవీ '2.0'.