తెలుగుటైమ్స్ .నెట్ రేటింగ్ 2.5/5
బ్యానర్ : శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర
తారాగణం: అఖిల్ అక్కినేని, నిధిఅగర్వాల్, జయప్రకాశ్, రావు రమేష్, నాగబాబు,
విద్యుల్లేఖారామన్, ప్రియదర్శి, హైపర్ అది, అజయ్, సుబ్బరాజు తదితరులు
సంగీతం: ఎస్.ఎస్.తమన్, సినిమాటోగ్రఫీ : జార్జ్ సి.విలియమ్స్
ఎడిటింగ్ : నవీన్ నూలి, ఆర్ట్: అవినాష్ కొల్ల
నిర్మాత: బి.వి.ఎస్.ఎన్.ప్రసాద్
కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: వెంకీ అట్లూరి
విడుదల తేదీ: 25.01.2019
'మనం'లో చిన్న పాత్రలో తళుక్కున మెరిసిన అఖిల్ అక్కినేని, హీరోగా తొలి చిత్ర్రం 'అఖిల్' సినిమాతో అక్కినేని అభిమానులను తీవ్రంగా నిరాశపరిచిన అఖిల్ అక్కినేని, రెండో సినిమా 'హలో'తో కాస్త పరవాలేదనిపించుకున్నాడు. అయితే తన మీద ఉన్న అంచనాలను మాత్రం అందుకోలేకపోయాడు. దీంతో మూడో సినిమాగా తన వయసుకు తగ్గ రొమాంటిక్ ఎంటర్టైనర్తో 'మిస్టర్ మజ్ను' గా ఈ రోజు ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. 'తొలిప్రేమ' సినిమాతో సూపర్ హిట్ అందుకున్న వెంకీ అట్లూరి, అఖిల్‌ను ప్లేబాయ్‌గా చూపించాడు. మరి ఈ ఎమోషనల్ లవ్‌స్టోరితో అయినా అఖిల్ సక్సెస్ అందుకున్నాడా..? దర్శకుడు వెంకీ అట్లూరి మరో విజయాన్ని తన ఖాతాలో వేసుకున్నాడా.. అన్నది సమీక్షలో చూద్దాం.
కథ:
విక్రమ్ కృష్ణ అలియాస్ విక్కి(అఖిల్ అక్కినేని) ప్లే బోయ్.. లండన్‌లో ఎమ్మెసీ పూర్తి చేసే పనిలో ఉంటాడు. అతనికి చదువుకంటే అమ్మాయిలను పడగొట్టడంలో ఆసక్తి ఎక్కువగా ఉంటుంది. అందరి అమ్మాయిలతో జల్సా చేసే అతని గురించి తెలుసుకుని నిక్కి( నిధి అగర్వాల్) అతనంటే ఓ పాటి కోపాన్ని పెంచుకుంటుంది. కారణం అబ్భాయిలంటే శ్రీ రామ చంద్రుల్లా ఉండాలనుకోవడమే. అయితే ఇండియాకు రాగానే అతనికొక షాకింగ్ న్యూస్ తెలుస్తుంది. తన బాబాయ్ కూతురు అంటే తన చెల్లెలు పెళ్లి చేసుకోబోయే వ్యక్తి చెల్లెలే నిక్కి అని. దాంతో ఆమెతో సత్ప్రవర్ధన తో మసులుతాడు. ఆమెతో స్నేహంగా ఉంటాడు. అయితే జరిగే పరిణామాల దృష్ట్యా విక్కి ప్లే బోయ్ అయినా.. అమ్మాయిల విషయంలో ఎలా ఉన్నా విక్కీ వ్యక్తిత్వం నచ్చి నిఖిత అలియాస్ నిక్కీ (నిధి అగర్వాల్) అతడిని ఇష్టపడుతుంది. కానీ నిక్కీ ప్రేమను అర్థం చేసుకోలేని విక్కీ ఆమెను దూరం చేసుకుంటాడు. ఫ్యామిలీకి అతనిచ్చే ప్రాముఖ్యత తెలుసుకుని అతనితో ప్రేమలో పడుతుంది. కానీ విక్కి ఆమె ప్రేమను విక్కి కాదంటాడు. అయితే ఇద్దరూ కలిసి రెండు నెలలు ప్రేమించుకుందామని.. నచ్చితేనే లైఫ్‌లోనే కంటిన్యూ అవుతామని అంటుంది. అందుకు విక్కి కూడా ఒప్పుకుంటాడు. అయితే తన పట్ల నిక్కీ కున్న అభిప్రాయం చూసి తప్పుగా అర్థం చేసుకుని ఆమె ప్రేమను కాదంటాడు. ఆమె లండన్ వెళ్లిపోయిన తర్వాత ఆమెను నిజంగానే తాను లవ్ చేస్తున్నానని తెలుసుకుని ఆమె ప్రేమ కోసం లండన్ వెళతాడు. అక్కడ నిక్కిని కలుసుకున్నాడా? తన ప్రేమను సక్సెస్ చేసుకున్నాడా? అనేది మిగతా కథ.
ఆర్టిస్ట్స్ పెర్ఫార్మన్స్:
అఖిల్ తన వయసుకు తగ్గ పాత్రలో ఆకట్టుకున్నాడు. ముఖ్యంగా ఫస్ట్ హాఫ్‌లో ప్లేబాయ్ తరహా పాత్రలో పర్ఫెక్ట్గా సూట్ అయ్యాడు. లుక్స్ పరంగా మన్మథుడిగా, నటనా పరంగా మజ్నుని గుర్తు చేశాడు. యాక్షన్ సీన్స్, డాన్స్‌లతోనూ ఆకట్టుకున్నాడు. నటన పరంగా ఎమోషనల్ సీన్స్‌లో కాస్త ఇబ్బంది పడినట్టుగా అనిపిస్తుంది. నిఖిత పాత్రలో మంగళూరు అమ్మాయి నిధి అగర్వాల్ పరవాలేదు తన అందంతో పాటు అభినయంతోనూ ఆకట్టుకోడానికి ప్రయత్నించింది. తెర మీద చాలా పాత్రలు కనిపించినా ఎవరికి పెద్దగా స్కోప్ లేదు. సితార, పవిత్ర లోకేష్, నాగబాబు, జయప్రకాష్, రావూ రమేష్ ఫ్యామిలీ ఎమోషన్స్‌తో ఆకట్టుకోగా సుబ్బారాజు, ప్రియదర్శి, హైపర్ ఆది కామెడీతో మెప్పించే ప్రయత్నం చేశారు.
సాంకేతిక వర్గం పని తీరు:
తొలిప్రేమ సినిమాతో మంచి దర్శకుడిగా పేరుతెచ్చుకున్న వెంకీ అట్లూరి.. అఖిల్ కోసం రొటీన్ లవ్ స్టోరినే తీసుకున్నాడు. అయితే ఫ్యామిలీ ఎమోషన్స్‌తో పాటు కామెడీతో ఆకట్టుకునే ప్రయత్నం చేశాడు. కానీ రెండో ప్రయత్నంలో వెంకీ అనుకున్న స్థాయిలో మెప్పించలేకపోయాడు. ఫస్ట్ హాఫ్ ఎంటర్టైన్మెంట్, ఎమోషనల్ సీన్స్‌తో బాగానే నడిపించినా.. సెకండ్ హాఫ్ సాగదీసిన ఫీలింగ్ కలుగుతుంది. కథనం కూడా ప్రేక్షకుడి ఊహకు తగ్గట్టుగా సాగుతూ ఇబ్బంది పెడుతుంది. ముఖ్యంగా క్లైమాక్స్ అంత కన్విన్సింగ్‌గా అనిపించదు. రచయితగా మాత్రం వెంకీ తన మార్క్ చూపించాడు. కొన్ని డైలాగ్స్ గుర్తుండిపోయేలా ఉన్నాయి. జార్జ్ సీ విలియమ్స్ సినిమాటోగ్రఫి సినిమాకు మేజర్ ప్లస్ పాయింట్. హీరో హీరోయిన్లతో పాటు లండన్ అందాలను కూడా చాలా బాగా చూపించాడు. తమన్ అందించిన పాటలు, నేపథ్య సంగీతం బాగున్నాయి. ఎడిటింగ్, భోగవల్లి ప్రసాద్ గారి నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్టుగా రిచ్ గా ఉన్నాయి.
విశ్లేషణ:
ఆధ్యంతం సినిమా చూస్తుంటే కథలో ఏ మాత్రం కొత్తదనం కనపడదు. ప్రేమ కథల్లో హీరో, హీరోయిన్ మధ్య ప్రేమ ఉండటం .. మధ్య బ్రేకప్ కావడం.. మళ్లీ కలుసుకోవడం అనే తరహలోనే ఉంటుంది. అయితే సన్నివేశాలను దర్శకుడు ఎంత కొత్తగా తెరకెక్కించాడనే దాన్ని బట్టి సినిమా ఆకట్టుకునే అంశం. ఈ విషయం లో దర్శకుడు వెంకీ అట్లూరి పెద్దగా సక్సెస్ కాలేదు. ఎందుకంటే కొన్నిసన్నివేశాలను చాలా చక్కగా చూపించినా, కథనంలో మాత్రం కొత్తదనం కనపడనీయలేదు. ముఖ్యంగా ఫస్టాఫ్‌లో హీరోను ప్లేబోయ్‌గా ఎలివేట్ చేసే తీరు.. హీరో, హీరోయిన్ మధ్య ప్రేమ పుట్టించే ఎమోషనల్ సన్నివేశాలు బావున్నాయి. అయితే ఈ సన్నివేశాలు సినిమాటిక్‌గా కావాలనే అతికించినట్టుగా వున్నాయి. ఎందుకంటే ఆ సన్నివేశాలు హీరోక్యారెక్టరైజేషన్ను ఎలివేట్ చేసిన తదుపరి ఆ సీన్‌కు కనెక్టింగ్ సన్నివేశాలు కనపడవు.
ఇక హీరో, హీరోయిన్ మధ్య లవ్ ట్రాక్‌లో హీరోయిన్, హీరో వెనుకపడటం.. అతను దాని గురించి ఇబ్బంది పడటం. తన ఇబ్బందిని స్నేహితుడికి చెబుతుంటే తెలుసుకుని ఆమె హార్ట్ బ్రేక్ కావడం ఒరకు ఓకే. కానీ సెకండాఫ్ మరీ రొటీన్ అనిపిస్తుంది. సుబ్బరాజు క్యారెక్టర్ ఈ మాత్రం బాలేదు. అయితే అతని కొడుకు హవభావాలను కార్టూన్ రూపంలో చెప్పిన క్రమం.. హైపర్ అది పైరసీ సీడీలను తయారు చేసే వ్యక్తిగా కనపడ్డా.. అతను సన్నివేశాల పరంగా వచ్చే కామెడీ ట్రాక్ బాగానే ఉంది. చివర్లో హీరో మారిపోయి .. హీరోయిన్ ఫ్యామిలీకి విషయాలను చెప్పేసి వెళ్లిపోవడం.. హీరో కోసం హీరోయిన్ ఎయిర్పోర్ట్ వెళ్లడం ఎన్ని సినిమాల్లో చూడలేదు. సినిమా ఆద్యంతం ఆకట్టుకోకపోయినా కొన్ని సన్నివేశాల పరంగా, కొన్ని డైలాగ్స్ పరంగా సినిమా మెప్పిస్తుంది.