రివ్యూ : భార్య భర్తల భావోద్వేగాల ప్రయాణం లో ఓ 'మజిలీ'

రివ్యూ : భార్య భర్తల భావోద్వేగాల ప్రయాణం లో ఓ 'మజిలీ'

05-04-2019

రివ్యూ : భార్య భర్తల భావోద్వేగాల ప్రయాణం లో ఓ 'మజిలీ'

తెలుగుటైమ్స్ .నెట్ రేటింగ్ : 3/5

బ్యానర్ : షైనీ స్క్రీన్స్ 
నటీనటులు : నాగచైతన్య, సమంత, దివ్యాంశ కౌషిక్‌, రావూ రమేష్‌, పోసాని కృష్ణ మురళి, సుబ్బరాజు తదితరులు నటించారు.

కూర్పు : ప్రవీణ్ పూడి, సినిమాటోగ్రఫీ : విష్ణు శర్మ
పాటలు : భాస్కర బట్ల, చైతన్య ప్రసాద్, రాంబాబు గోశాల, వనమాలి, శివ నిర్వాణ
సంగీతం : గోపి సుందర్‌, నేపథ్య సంగీతం : తమన్‌
నిర్మాత : సాహు గారపాటి, హరీష్ పెద్ది
కథ,  స్క్రీన్ ప్లే, దర్శకత్వం : శివా నిర్వాణ

విడుదల తేదీ : 05.04.2019

నాగ చైతన్య ఇటీవల కాలంలో ఆశించిన స్థాయిలో  హిట్స్  లేకుండా పోయాయి.  మాస్‌ యాక్షన్‌ జానర్లో తెరకెక్కించిన సినిమాలన్ని వరుసగా ఫ్లాప్‌ కావటంతో మరోసారి తనకు మంచి పట్టున్న రొమాంటిక్‌ డ్రామానే ఎంచుకున్నాడు చైతూ. అంతేకాదు తన రియల్‌ లైఫ్‌ పార్టనర్‌తో కలిసి రీల్‌ లైఫ్‌లో మరో సక్సెస్‌ కొట్టేందుకు ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. నిన్నుకోరి సినిమాతో దర్శకుడిగా సక్సెస్‌ ఫుల్‌ ఎంట్రీ ఇచ్చిన శివా నిర్వాణ దర్శకత్వంలో చైతూ, సమంత జంటగా తెరకెక్కిన సినిమా మజిలీ. మరి ఈ సినిమా అయినా చైతూ కెరీర్‌ను సక్సెస్‌ ట్రాక్‌ పైకి  ఎక్కించిందా..? లేదా అన్నది సమీక్షలో చూద్దాం.

కథ:

పూర్ణ (నాగచైతన్య) ఐటీఐ చదువుతూ ఎలాగైన రైల్వేస్‌ టీమ్‌లో క్రికెటర్‌గా స్థానం సంపాదించాలని ప్రాక్టీస్‌ చేస్తుంటాడు. ఓ గొడవ కారణంగా పరిచయం అయిన అన్షు (దివ్యాంశ కౌశిక్‌)తో పూర్ణ ప్రేమలో పడతాడు. కానీ పెద్దలు వారి ప్రేమకు అడ్డు చెప్తారు. అన్షును తన పేరెంట్స్ పూర్ణకు దూరంగా తీసుకెళ్లిపోతారు. అన్షు దూరమైందన్న బాధలో పూర్ణ కెరీర్‌ను కూడా వదిలేసి తాగుబోతులా తయారవుతాడు. కుటుంబ పరిస్థితుల కారణంగా ఇలాంటి వ్యక్తి జీవితంలోకి భర్తే ప్రాణం గా ప్రేమించే శ్రావణి (సమంత) వస్తోంది. పూర్ణ ఎలా ఉన్నా ఏమి చేసినా గుడ్డిగా భర్తేకే సపోర్ట్ చేస్తూ ఉంటుంది. ఆ తరువాత జరిగే కొన్ని నాటకీయ పరిణామాల మధ్య వాళ్ళ జీవితంలోకి మీరా అనే పాప వస్తోంది. ఆ పాప కారణంగా వాళ్ళ జీవితాలు ఎలా మారాయి. డిప్రెషన్ లో ఉన్న పూర్ణ ఎలా మారాడు ? శ్రావణి అంటే ఎలాంటి ఫీలింగ్ లేని పూర్ణ ఆమెను భార్యగా ఎలా చూసాడు ? ఈ క్రమంలో వీరిద్దరి బంధం ఎలా కొనసాగింది? అసలు పూర్ణ అలా మారడానికి గల అమ్మాయి ఎవరు ? ఎందుకు వాళ్లు ఇద్దరూ విడి పోయారు ? పూర్ణ చివరకి మారాడా ? లేదా ? లాంటి విషయాలు తెలియాలంటే ఈ సినిమాను వెండి తెర పై చూడాల్సిందే.

ఆర్టిస్ట్స్ ల పెర్ఫార్మన్స్:

ఇక సినిమాలో క్రికెటర్ గా,  అదే విధంగా  ఏ పని చెయ్యని భర్తగా నటించిన చైతు చక్కని నటనను కనబరిచాడు. గత తన సినిమాల్లో కంటే ఈ సినిమాలో పరిణతి సాదిస్తున్నాడు. ఈ సినిమాలో రెండు విభిన్న కోణాలున్న పాత్రలో చాలా బాగా నటించాడు.  ఇటు యంగ్ క్యారెక్టర్ లో తన శైలి నటనతో ఆకట్టుకోవడంతో పాటు.. అటు పెళ్లి అయిన తరువాత తాగుబోతు భర్తగా చాలా బాగా నటించాడు. ముఖ్యంగా ఎమోషనల్ సన్నివేశాల్లో సెటిల్డ్ పెర్ఫార్మెన్స్ తో తన పాత్రకి పూర్తి న్యాయం చేశాడు. మెయిన్ గా సెకెండ్ హాఫ్ లో సమంతతో సాగే సన్నివేశాలు అలాగే క్లైమాక్స్ లో సమంతకి తన ప్రేమ గురించే చెప్పే సందర్భంలో కానీ చైతు నటన సినిమాకే హైలెట్ గా నిలుస్తోంది. అలాగే నాగ చైతన్యకి దివ్యంశ కౌశిక్ కి మధ్య కెమిస్ట్రీ కూడా బాగా అలరిస్తుంది. ఇక కథానాయకులుగా నటించిన సమంత, దివ్యంశ కౌశిక్ తమ పాత్రల్లో చాలా చక్కగా నటించారు. దివ్యంశ కౌశిక్ తన స్క్రీన్ ప్రెజెన్స్ తో పాటుగా తన నటనతోనూ ఆకట్టుకుంది. ఇక సమంత కొన్ని ఎమోషనల్ సీన్స్ లో ఆ పెయిన్ అర్ధమయ్యేలా కేవలం తన కళ్లల్లో ఆమె పలికించిన హావభావాలు మెచ్చుకోదగినవి. చైతుకు తండ్రి పాత్రలో నటించిన రావు రమేష్ తన నాచ్యురల్ నతనతో ఆకట్టుకోగా.. ఎప్పటిలాగే తన శైలి పాత్రలో కనిపించిన పోసాని కూడా బాగా చేసారు. వీళ్లు తమ కామెడీ టైమింగ్ తో మ్యానరిజమ్స్ తో అక్కడక్కడ బాగానే నవ్వించారు. ఇక మిగిలిన నటీనటులు కూడా తమ పాత్ర పరిధి మేరకు బాగా నటించారు.

సాంకేతిక వర్గం పనితీరు :

నిన్నుకోరి సినిమాతో దర్శకుడిగా పరిచయం అయిన శివా నిర్వాణ మరోసారి ఎమోషనల్‌ డ్రామానే ఎంచుకున్నాడు. ఎలాంటి కమర్షియల్‌ హంగులకు పోకుండా తను అనుకున్న కథను రియలిస్టిక్‌గా చెప్పే ప్రయత్నం చేశాడు. కథనం నిన్నుకోరి తరహాలోనే అనిపించినా ప్రేక్షకుడిని కట్టి పడేయటంలో దర్శకుడు మరోసారి సక్సెస్‌ అయ్యాడు. భార్య భర్తలకు సంబంధించి మంచి పాయింట్ తీసుకున్నారు. అయితే సినిమాలో కొన్ని సీక్వెన్స్ కాస్త  స్లోగా నడిపారు. విష్ణు శర్మ సినిమాటోగ్రఫీ బాగుంది. సినిమాలో క్రికెట్ దృశ్యాలతో పాటు ఓ కాలనీలో జరుగుతున్న కథకు అనుగుణంగా ఆయన విజువల్స్ ను చాలా అందంగా చూపించారు.

ఇక సంగీత దర్శకుడు గోపి సుందర్ అందించిన పాటల్లో రెండు పాటలు ఆకట్టుకుంటాయి.  తమన్ అందించిన నేపధ్య సంగీతం బాగుంది. ముఖ్యంగా సమంత , చైతుల మధ్య వచ్చే సన్నివేశాల్లో ఆయన అందించిన నేపధ్య సంగీతం చాలా బాగా ఆకట్టుకుంది. ప్రవీణ్ పూడి ఎడిటింగ్ బాగుంది. నిర్మాతలు పాటించిన ప్రొడక్షన్ వాల్యూస్ కూడా చాలా బాగున్నాయి.

విశ్లేష‌ణ‌ :

సమంత, నాగ చైతన్య జంటగా శివ నిర్వాణ దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రం ఎమోషనల్ గా సాగుతూ ఆకట్టుకుంది. దర్శకుడు శివ నిర్వాణ భార్య భర్తలకు సంబంధించి మంచి కథను తీసుకుని మంచి ఎమోషనల్ సన్నివేశాలతో బాగానే ఆకట్టుకున్నాడు. ముఖ్యంగా భర్తే ప్రాణం అని నమ్మే ఒక మంచి భార్య పాత్రను అలాగే ప్రేమలో ఫెయిల్ అయిన ఒక భగ్న ప్రేమికుడి జీవితంలోని సంఘటనలను ఆయన బాగా రాసుకున్నాడు. అయితే స్క్రీన్ ప్లే ని మాత్రం ఆ స్థాయిలో ఆకట్టుకునే విధంగా మలచలేకపోయారు. సినిమాలో కొన్ని సీక్వెన్స్ ను బాగా స్లోగా నడపడం సినిమాకి పెద్ద మైనస్ పాయింట్ గా నిలుస్తోంది. ఇక చైతు, సమంత తమ నటనతో సినిమాని మరో లెవల్ కి తీసుకు వెళ్లారు. ముఖ్యంగా వారిద్దరీ కెమిస్ట్రీ చాలా బాగా ఆకట్టుకుంది. మొత్తం మీద ఈ చిత్రం ఫ్యామిలీ ఆడియన్స్ ను బాగా మెప్పిస్తోంది. అలాగే మిగిలిన అన్నివర్గాల ప్రేక్షకులని కూడా బాగానే అలరిస్తుందని చెప్పొచ్చు.