రివ్యూ : ఫామిలీ ఎంటర్టైనర్ గా 'రారండోయ్ వేడుక చూద్దాం'
Telangana Tourism
Vasavi Group

రివ్యూ : ఫామిలీ ఎంటర్టైనర్ గా 'రారండోయ్ వేడుక చూద్దాం'

26-05-2017

రివ్యూ : ఫామిలీ ఎంటర్టైనర్ గా  'రారండోయ్ వేడుక చూద్దాం'

తెలుగుటైమ్స్ .నెట్ రేటింగ్ 3.25/5   

బ్యానర్ : అన్నపూర్ణ స్టూడియోస్, 
నటీనటులు : నాగ చైతన్య, రకుల్ ప్రీత్ సింగ్, జగపతి బాబు, సంపత్ రాజు,కౌసల్య, వెన్నెల కిశోర్, తదితరులు...

సంగీతం : దేవి శ్రీ ప్రసాద్, సినిమాటోగ్రఫీ : యస్.వి .విశ్వేశ్వర్,

ఎడిటింగ్ : గౌతమ్ రాజు, స్క్రీన్ ప్లే : సత్యానంద్,

నిర్మాత : నాగార్జున అక్కినేని

దర్శకత్వం : కళ్యాణ్ కృష్ణ కురసాల

విడుదల తేదీ :26.05.2017

 

‘ప్రేమమ్, సాహసం శ్వాసగా సాగిపో’ చిత్రాలు తర్వాత  అక్కినేని నాగ చైతన్య,  ‘సోగ్గాడే చిన్ని నాయనా’ వంటి బ్లాక్ బస్టర్ తర్వాత కళ్యాణ్ కృష్ణ ల కాంబినేషన్ లో అన్నపూర్ణ స్టూడియోస్ పతాకం పై కింగ్ నాగార్జున నిర్మించిన ఈ చిత్రం 'రారండోయ్ వేడుక చూద్దాం'   రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్ గా నటించిన ఈ చిత్రం మంచి టైటిల్, సకుటుంబంగా చూడాల్సిన సినిమాగా  మరింత పబ్లిసిటీ చేయడంతో    ఈ సినిమా  పై ప్రేక్షకుల్లో భారీ క్రేజ్ నెలకొన్నాయి. ఇన్ని అంచనాల మధ్య ఈరోజే విడుదలైన ఈ చిత్రం ప్రేక్షకుల్ని ఎంతవరకు మెప్పించిందో సమీక్ష లో ఇప్పుడు చూద్దాం…

కథ :

కింగ్ నాగార్జున వాయిస్ ఓవర్ తో సినిమా కథ మొదలవుతుంది ఆంధ్ర లోని ఓ గ్రామం లో ఉమ్మడి  కుటుంబ సభ్యుల మధ్య అల్లారు ముద్దుగా పెరిగిన అమ్మాయి భ్రమరాంబ (రకుల్ ప్రీత్ సింగ్).  భ్రమరాంబ అంటే ఆమె తండ్రి ఆది (సంపత్) కి పంచ ప్రాణాలు.  ఆమె సంతోషం  కోసం ఏమైనా చేస్తాడు.ఆ ఇంటిలో  ఎంతో అల్లారుముద్దుగా మహారాణి లా  ఉండే భ్రమరాంభకు దైవభక్తి కూడా ఎక్కువే.  తన కజిన్ (వెన్నెల కిషోర్)  భ్రమరాంబ వరుసకు అక్క అయినా అమ్మాయితో జరిగిన పెళ్లి వేడుకలో  తొలిచూపులోనే  ప్రేమిస్తాడు శివ (నాగ చైతన్య). పెళ్లి జరిగిన వెంటనే శివ వైజాగ్ తిరిగి వచ్చి  తన తండ్రి (జగపతి బాబు) బిజినెస్ వ్యవహారాలు చూసుకుంటాడు. కానీ ప్రతి క్షణం అంతని కళ్ళముందు  పెళ్లి వేడుక లో భ్రమరాంబ తాను గడిపిన క్షణాలు గురుతుకొస్తుంటాయి. ఎలాగైనా ఆమెను చూడాలని ప్లాన్ చేస్తాడు. ఇంతలో భ్రమరాంబ చదువు కోసమని   వైజాగ్ కు వస్తుంది. కాలేజీ లో సీనియర్స్ ప్రవర్తన కి భయపడి శివ కు ఫోన్ చేస్తుంది.  ఫోన్ చేయగానే  శివ ఎగిరిగంతు వేస్తాడు. ఆ విధం గా వైజాగ్ లో భ్రమరాంభకి  తోడుగా  ఉంటాడు. నిరంతరం భ్రమరాంభతో గడపడానికి ఇష్టపడే శివ, నిజమైన ప్రేమను మనసులో పెట్టుకుని కేవలం  స్నేహం   మాత్రమే  అని  అబద్ధం ఆడతాడు.    భ్రమరాంబ ను ప్రేమిస్తూ శివ ఎందుకు ఆలా అనాల్సి వచ్చింది. తీరా ఇరువురు ప్రేమించుకున్న భ్రమరాంబ  తండ్రి పెళ్ళికి ఎందుకు  ఒప్పుకోడు. అసలు భ్రమరాంబ తండ్రికి, శివ తండ్రికి మధ్య ఉన్న పగేమిటి ? ఈ పగల మధ్య శివ, భ్రమరాంభల ప్రేమ చిగురించింది? చివరికి వారిద్దరూ ఎలా కలిశారు ? అనేదే ఈ సినిమా కథ.

ఆర్టిస్ట్స్ పెర్ఫార్మన్స్ :

తన ప్రేమను, తనలోని భాధను హీరోయిన్ తో  చెప్పే ఎపిసోడ్లో నాగ చైతన్య నటన అద్భుతం. ఆ సన్నివేశం లో  చెప్పిన డైలాగులు చాలా రియలిస్టిక్ గా, ఎంజాయ్ చేసే విధంగా కొత్తగా  ఉన్నాయి. నాగచైతన్యకు, జగపతి బాబుకు మధ్య తండ్రీ కొడుకుల ఫ్రెండ్లీ నేచర్ బాగుంది. అమాయకత్వం, పెంకితనం, మంచితనం, తింగరితనం వంటి అన్ని లక్షణాలు కలగలిసిన భ్రమరాంబ క్యారెక్టర్ లో  రకుల్ ప్రీత్ సింగ్ సరిగ్గా సరిపోయింది.  సాంప్రదాయబద్దంగా కనిపిస్తూ తన ఎనర్జిటిక్ పెర్ఫార్మెన్స్ తో బాగా ఆకట్టుకుంది. సంపత్ కు, రకుల్ ప్రీత్ సింగ్ ల నడుమ తండ్రి కూతుళ్ళ అనుబంధం చక్కగా వుంది . ఇక సినిమా మధ్య మధ్యలో వచ్చే వెన్నెల కిశోర్ కామెడీ కొన్ని నవ్వుల్ని పంచగా, తొలుత పెళ్లి సందడి లో కామెడీ ఆర్టిస్టులతో చేసిన సీన్స్ అంతగా నవ్వు తెప్పించలేదు.

సాంకేతిక వర్గం:

ఇక రచయిత, దర్శకుడు అయిన కళ్యాణ్ కృష్ణ కురసాల మొదటి సినిమాతో చేసినంత మ్యాజిక్ ఈ చిత్రం లో  చేయలేకపోయారు.  సూపర్ హిట్ కుటుంభ కథ  చిత్రాల సన్నివేశాలే మనకు కనపడతాయి.  రొటీన్ ఫ్యామిలీ డ్రామాను ఎంచుకున్నప్పటికీ  హీరోయిన్ భ్రమరాంబ పాత్రను చాలా బాగా డిజైన్ చేశారు. హీరో హీరోయిన్ మధ్య  కొన్ని ఎమోషనల్ సన్ని వేశాల్ని రూపొందించడం  లో సక్సెస్ అయ్యాడు. సినిమా కథ  కథనాలు కూడా ‘నిన్నేపెళ్లాడుతా, పండగ చేస్కో’ వంటి సినిమాల్ని తలపించాయి. కొత్త  కథనం, టేకింగ్ విషయయంలో మాత్రం పెద్దగా రాణించలేదు. దేవిశ్రీ ప్రసాద్ పాటలు వినడానికి బాగున్నా వాటిని అందంగా తెరకెక్కించడంలో కళ్యాణ్ కృష్ణ పూర్తి స్థాయిలో విజయం సాధించలేదు. రిలీజ్ కు ముందు ఆడియో విని పిక్చరైజేషన్ మీద పెట్టుకున్న ఆశలు కళ్యాణ్ కృష్ణ పేలవమైన టేకింగ్ తో చాలా వరకు గల్లంతయ్యాయి. కెమెరా పనితనం కలర్ ఫుల్ గా బాగుంది. ఎడిటింగ్ విషయానికొస్తే మొదటి భాగంలో ఇంకొన్ని సన్నివేశాల్ని ట్రిమ్ చేసి ఉంటే బాగుండేది. అన్నపూర్ణ స్టూడియోస్ పాటించిన నిర్మాణ విలువలు చాలా గొప్ప స్థాయిలో ఉన్నాయి. 

విశ్లేషణ :

సినిమా ఆరంభం మాంచి సందడిగా  బాగానే ఉన్నా కూడా పోను పోను సినిమా చాలా నెమ్మదిగా తయారైంది. ఎంతసేపటికి సినిమా అసలు కథలోకి వెళ్లకపోవడంతో నత్త నడకన సాగుతున్నట్టు అనిపించడంతో పాటు అవసరానికి మించిన పాత్రల్ని పరిచయం చేయడం జరిగింది. పృథ్వి, రఘుబాబు, పోసాని, తాగుబోతు రమేష్, సప్తగిరి వంటి మంచి హాస్యం పండించగల నటులతో  పూర్తిస్థాయిలో  కాకుండా అరకొరగా వాడుకుని వదిలేయడంతో నిరుత్సాహం కలిగిస్తుంది. ఇక ఇంటర్వెల్ ట్విస్ట్ చూసి సెకండ్ హాఫ్ లో  ఆ పాయింట్ చుట్టూ కొత్తదనమున్న మంచి డ్రామా ఏదైనా ఉంటుందేమో అని ఊహిస్తే అది కూడా కాస్త సాధారణంగానే ఉంది. చిత్ర క్లైమాక్స్ కూడా మోటార్ బైక్స్  ఫైట్ తో సులభంగా, రొటీన్ గానే ముగిసిపోయింది.  చిత్రం కుటుంబ ప్రేక్షకులకు నచ్చేదిగానే ఉన్నా భారీ స్థాయి అంచనాలు పెట్టుకున్న అక్కినేని అభిమానుల్ని మాత్రం పూర్తి స్థాయిలో మెప్పించలేదు. రకుల్ ప్రీత్ పాత్ర చిత్రీకరణ, హీరో హీరోయిన్ల ఎమోషనల్ లవ్ ట్రాక్, కొన్ని పాటలు, డైలాగులు, సెకండాఫ్ ఈ సినిమాలో ప్లస్ పాయింట్స్ కాగా నిదానంగా సాగే మొదటి అర్ధ భాగం పెద్దగా కొత్తదనమేమీ కనిపించని రొటీన్ కథా కథనాలు ఇందులో నిరుత్సాహపరిచే అంశాలు. ఒక్కమాటలో చెప్పాలంటే పెద్ద పెద్ద అంచనాలు, ఆశలు పెట్టుకోకుండా సరదాగా ఫ్యామిలీతో చూసే వాళ్ళకి ఈ చిత్రం నచ్చుతుంది.