చిత్రాంగద సినిమా రివ్యూ
APEDB

చిత్రాంగద సినిమా రివ్యూ

11-03-2017

చిత్రాంగద సినిమా రివ్యూ

నిర్మాణ సంస్థ: శ్రీ విఘ్నేష్ కార్తీక్ సినిమా అండ్ క్రియేటివ్ డ్రావిడన్స్
తారాగ‌ణం: అంజ‌లి, సింధుతులాని, దీప‌క్‌, రాజా ర‌వీంద్ర‌, జ‌య‌ప్ర‌కాష్‌, స‌ప్త‌గిరి, జ‌బ‌ర్‌ద‌స్త్ సుధీర్‌, ర‌క్ష‌, సాక్షిగులాటి త‌దిత‌రులు
సంగీతం: సెల్వ‌గ‌ణేష్‌, స్వామినాథ‌న్‌, కూర్పు: ప్ర‌వీణ్ పూడి
ఛాయాగ్ర‌హ‌ణం: బాల్ రెడ్డి, జేమ్స్ క్వాన్‌, నిర్మాతలు: గంగపట్నం శ్రీధర్, రెహమాన్

కథ-స్క్రీన్‌ప్లే-మాటలు-దర్శకత్వం:అశోక్.జి


క‌థ:

చిత్ర(అంజ‌లి) త‌ను చ‌దివిన కాలేజ్‌లోనే సైకాల‌జీ ప్రొఫెస‌ర్‌గా జాయిన్ అవుతుంది. అంజ‌లి హాస్ట‌ల్‌లో ఉండి అమ్మాయిల‌కు టీచింగ్ చేస్తుంటుంది. అయితే అంజ‌లి ఉండే హాస్ట‌ల్లో దెయ్యం తిరుగుతుంద‌ని చాలా మంది అమ్మాయిలు హాస్ట‌లు విడిచి వెళ్ళిపోతారు. అయితే ఆ దెయ్యం ఎవ‌రో కాదు, అంజ‌లినే అని తెలుస్తుంది. అమ్మాయి అయినా, అమ్మాయిల‌పై కోరిక‌తో ఉండే అంజ‌లి ప్ర‌వ‌ర్త‌న చూసి అంద‌రూ ఆశ్చ‌ర్య‌పోతారు.

అంజ‌లి ప్ర‌వ‌ర్త‌న‌ను మార్చ‌డానికి సైక్రియాటిస్ట్ నీల‌కంఠ‌(జ‌య‌ప్ర‌కాష్‌) ప్ర‌య‌త్నిస్తాడు. అప్పుడు నీల‌కంఠ‌కు ఓ విష‌యం తెలుస్తుంది. ఎవ‌రో ఒకావిడ‌, ఒక వ్య‌క్తిని చెరువులో చంపేసింద‌ని, ఆ హ‌త్య త‌న క‌ల‌లోకి వ‌స్తుంద‌ని చిత్ర చెబుతుంది. అయితే చిత్ర చెప్పేదంతా పిచ్చిగా అంద‌రూ అనుకుంటారు. అయితే త‌న క‌ల నిజం అని నిరూపించ‌డానికి చిత్ర అమెరికా బ‌య‌లుదేరుతుంది. అమెరికాలో చిత్ర‌కు ఎదురయ్యే ప‌రిస్థితులేంటి? అస‌లు చిత్ర‌కు వ‌చ్చే క‌ల నిజ‌మా..కాదా? అస‌లు ర‌వివ‌ర్మ ఎవ‌రు? ర‌వివ‌ర్మ‌కు, చిత్ర‌కు రిలేష‌న్ ఏంటి? అనే విష‌యాలు తెలుసుకోవాలంటే సినిమా చూడాల్సిందే...

విశ్లేష‌ణ:

టైటిల్ పాత్రధారిగా అంజ‌లి త‌న పాత్ర‌కు న్యాయం చేసింది. లేడీగా ఉంటూనే దెయ్యం ప‌ట్టిన‌ప్పుడు మ‌గ‌రాయుడిలా న‌టించే విధానం, అంజ‌లి న‌ట‌న మెప్పిస్తాయి. అమెరికాలో మంచులో అంజ‌లి క‌మిట్‌మెంట్‌తో చేసిన న‌ట‌న, సింధుతులాని, దీప‌క్‌, ర‌క్ష‌, సాక్షిగులాటి, రాజా రవీంద్ర‌, జ‌య‌ప్ర‌కాష్ స‌హా న‌టీన‌టులంద‌రూ వారి వారి పాత్ర‌ల‌కు న్యాయం చేశారు. అలాగే సినిమాలో కామెడి కోసం క్రియేట్ చేసిన స‌ప్త‌గిరి, జ‌బ‌ర్ ద‌స్త్ సుధీర్ కామెడి ఓ మోస్తారుగా ప‌రావాలేద‌నిపిస్తుంది. స‌ప్త‌గిరి రొటీన్ కామెడిగా అనిపిస్తుంది.ఇక దీప‌క్ పాత్ర‌, సింధుతులాని పాత్ర‌ల్లో కూడా ఎమోష‌న్స్ ఎక్క‌డా క‌న‌ప‌డ‌వు. నెగ‌టివ్ షేడ్ ఉన్న పాత్ర‌లో దీప‌క్ న‌ట‌న బాగానే ఉంది.

ఇక సాంకేతికంగా చూస్తే..ద‌ర్శ‌క‌డు అశోక్ పూర్వ‌జ‌న్మ‌లు అనే కాన్సెప్ట్‌కు ప్ర‌తీకారం అనే ఎలిమెంట్‌ను యాడ్ చేసి సినిమాను తెర‌కెక్కించాడు.

అనుకున్న పాయింట్ బాగానే ఉన్నా, ఎగ్జిక్యూష‌న్‌లో ఎక్క‌డో తేడా కొట్టేసిన‌ట్టు క‌న‌ప‌డుతుంది. సినిమా ఫ‌స్టాఫ్ చూసేట‌ప్పుడు ఇంట‌ర్వెల్ ఎప్పుడు వ‌స్తుందా అనేలా ఎదురుచూడాల్సి వ‌స్తుంది. సెల్వ‌గ‌ణేష్‌, స్వామినాథ‌న్ సంగీతం అందించిన ఈ సినిమాలో ట్యూన్స్ మెప్పించ‌వు. ఇక బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ కూడా అంతంత మాత్రంగానే ఉంది. బాల్ రెడ్డి, జేమ్స్ క్వాన్ సినిమాటోగ్ర‌ఫీ బావుంది. అశోక్ రాసిన డైలాగ్స్ రెండు, మూడు చోట్ల మెప్పిస్తాయి. సినిమా నిడివి ఇంకాస్తా త‌గ్గించి ఉంటే బావుండేది. నిర్మాణ విలువ‌లు బావున్నాయి. మొత్తం మీద హ‌ర్ర‌ర్ సినిమాల‌ను ఇష్ట‌ప‌డే ప్రేక్ష‌కులు ఓసారి సినిమాను చూడొచ్చు అంతే