రివ్యూ :'స్పైడర్' ది సూపర్ యాక్షన్ థ్రిల్లర్

రివ్యూ :'స్పైడర్' ది సూపర్ యాక్షన్ థ్రిల్లర్

27-09-2017

రివ్యూ :'స్పైడర్' ది సూపర్ యాక్షన్ థ్రిల్లర్

తెలుగుటైమ్స్.నెట్ రేటింగ్ 3/5

బ్యానర్ : ఎన్ వి ఆర్ సినిమా
డిస్త్రిబ్యూటెడ్ బై :రిలయన్స్ ఎంటర్టైన్మెంట్, లైకా ప్రొడక్షన్స్ (తమిళ్ నాడు)
నటి నటులు : మహేష్, రకుల్ ప్రీత్ సింగ్, యస్ జె సూర్య, భరత్, ప్రియదర్శన్  పుల్లికొండ, ఆర్ జె బాలాజీ, షాయాజీ షిండే, నాగినీడు తది తరులు....
సినిమాటోగ్రఫీ : సంతోష్ శివన్, ఎడిటింగ్ :ఏ. శ్రీకర్ ప్రసాద్
మ్యూజిక్ : హర్రీస్  జైరాజ్, పాటలు : రామజోగయ్య శాస్ట్రీ, హర్రీస్ జైరాజ్
నిర్మాతలు : ఎన్ వి ప్రసాద్, 'ఠాగూర్' మధు, మంజుల స్వరూప్
కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం : ఏ ఆర్ మురుగదాస్

విడుదల తేదీ : 27.09.2017

సూపర్‌స్టార్‌ మహేష్‌ హీరోగా, రకుల్‌ ప్రీత్‌ సింగ్  హీరోయిన్‌గా, తమిళ్ దర్శకుడు యస్ జె సూర్య ప్రతినాయకుడిగా, ఎ.ఆర్‌.మురుగదాస్‌ దర్శకత్వంలో రూపొందిన యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌ 'స్పైడర్‌'. ఠాగూర్‌ మధు సమర్పణలో ఎన్‌.వి.ఆర్‌. సినిమా ఎల్‌ఎల్‌పి పతాకంపై ఎన్‌.వి.ప్రసాద్‌ నిర్మించారు. ఈ చిత్రం పై ఫస్ట్ లుక్, టీజర్ విడుదల అయినప్పటినుండి భారీ అంచనాలు నెలకొంది. తొలిసారి మహేష్ తమిళ్ చిత్రం చేయడం, అదీ తమిళ్ అగ్ర దర్శకుడు ఏ ఆర్ మురుగ దాస్ డైరెక్షన్ లో చేయడం ఇలా ఎన్నో సెన్సేషన్స్ క్రియేట్ సొంతం చేసుకున్న 'స్పైడర్‌' ఓ పక్క జేమ్స్ బాండ్ చిత్రమని, కాదు సైన్స్ ఫిక్షన్ అని, రకరకాలుగా వుహించుకున్నారు. ఈ సస్పెన్సు కి ఈ రోజు తెర తొలిగింది ఇది ఏ కోవకు చెందినది సమీక్షలో తెలుసుకుందాం.

కథ :

ఓ హత్య జరిగినా, ఏదైనా  ప్రమాదం జరిగినా ఆ తరువాత పోలీస్ కేసులని కోర్ట్ లని వాదాలు ప్రతివాదాలతో కాలం వెళ్లబుచ్చి చివరాఖరికి జైలు శిక్ష విధించడం ఇదీ ప్రస్తుతం మన వ్యవస్థ, అలా కాకుండా ప్రస్తుతమున్న కంప్యూటర్ పరిజ్ఞానంతో అంతర్జాలంతో ప్రజల సహకారంతో నేరాలు ముందుగానే ఎలా అరికట్టవచ్చునో తెలియచేసే కాదాంశంతో వచ్చిన చిత్రమే 'స్పైడర్' పోలీస్‌ డిపార్ట్‌మెంట్‌ ఉన్నత పదవికి సరిపోయే అన్నిఅర్హతలు వున్నా శివ (మహేష్) అంతర్జాల పరిజ్ఞానంతో సరికొత్త సాఫ్ట్‌వేర్‌  ఉపయోగించి,  ఇంటెలిజెన్స్ బ్యూరో కార్యాలయంలో ఫోన్ టాపింగ్ ఆఫీసర్ గా పని చేస్తుంటాడు.  ...మైనస్ ఫోర్త్ ఫ్లోర్ లో ఏర్పాటు చేసుకున్న ఈ ల్యాబ్ ద్వారా సిటీ లో జరుగుతున్న నేరాలను ముందుగానే అరికడుతుంటాడు శివ, అదే సమయంలో బాల్యం నుండి హత్యలకు అలవాటు పడి విపరీతమైన తన ప్రమాదకరమైన మానసిక స్థితితో వున్నా భైరవుడుకి (యస్ జె సూర్య) శవం చుట్టూ ఏడ్చే జనాన్ని చూసి పైశాచిక ఆనందాన్ని పొందే శాడిస్టు. భైరవుడు వాడి తమ్ముడు (భరత్) ఇద్దరు అమ్మాయిలను హత్య చేసిన ఉదంతంలో శివ ద్రుష్టి లో పడతాడు. అక్కడినుండి భైరవుడు వేట మొదలవుతుంది. అలా తన దృష్టిలో పడ్డ భైరవుడ్ని శివ ఎలా ఎదుర్కున్నాడు ? అసలు భైరవుడి మానసిక స్థితి ఎలాంటిది ? ఎందుకలా తయారైంది ? వరుసగా మనుషుల్ని ఎందుకు చంపుతుంటాడు? ఎలా చంపుతుంటాడు? చివరికి అతన్ని శివ ఎలా ఆపాడు ? అనేదే మిగతా  కథ..

ఆర్టిస్ట్ పెర్ఫార్మన్స్:

మహేష్  రెగ్యులర్ స్టార్ హీరోలా కాకుండా కథకు ప్రాధాన్యమిచ్చి సినిమా చేయడం చాలా బాగుంది. సినిమా మొత్తంలో ఒక ఇంటెలిజెంట్ పాత్రలానే కదులుతూ, నటనతో, డైలాగ్స్ తో, ఫైట్స్ తో, డాన్స్ స్టెప్స్ తో ఆకట్టుకుని సినిమాకు తన వంతు కృషి చేయాల్సిందంతా చేశాడు. ఎస్.జె. సూర్య భిన్నమైన సైకిక్ పాత్రకు తన నటనతో ప్రాణం పోశాడు. ఈమధ్య కాలంలో వచ్చిన విలన్ పాత్రల్లో ఇదే గొప్పదని చెప్పొచ్చు. హీరోయిన్ పాత్రకు  ప్రాముఖ్యత లేకపోయినా, కేవలం గ్లామర్ కోసం రకుల్ ప్రీత్ ని పెట్టినట్లువుంది. మిగతా నటులు తమ పాత్రల మేర నటించారు.

సాంకేతిక వర్గం పని తీరు :

సినిమాకు ప్రధాన ప్లస్ పాయింట్ దర్శకుడు మురుగదాస్ ఎంచుకున్న కథాంశం. మనిషిలో కొంత స్థాయిలో మాత్రమే ఉండే పైశాచికత్వం స్థాయిని మించి పెరిగిపోతే ఆ మనిషి మృగంలా ఎలా మారతాడు, ఏం చేస్తాడు, అతను సమాజానికి ప్రమాదంలా ఎలా పరిణమిస్తాడు అనే అంశాలని చాలా బాగా చూపించారాయన. సినిమా చూస్తున్నంత సేపు దర్శకుడు ఎంచుకున్న కథాంశం బాగుందనే ఆలోచన స్ఫురణకు వస్తూనే ఉంటుంది. మంచి కథతో పాటే మురుగదాస్ ఇచ్చిన ప్రస్తుత సమాజానికి అవసరమైన మంచి సందేశం కూడా వాస్తవానికి దగ్గరగా ఉండి ఆకట్టుకుంది. ఇక ఆయన కథను చెప్పిన తీరు కూడా ఆకట్టుకుంది.

ముఖ్యంగా ఫస్టాఫ్‌లో విలన్ పాత్రను ఎస్టాబ్లిష్ చేయడం, అతనెందుకు అలా తయారయ్యాడు, అతని ప్రవర్తన ఎలా ఉంటుంది అనే విషయాల్ని కాస్త సాగదీసాడు. స్పైడర్’ కు మంచి కథని దానికి కావాల్సిన ముఖ్యమైన రెండు భాషలకు సరిపడేలా హీరోగా మహేష్ ను, విలన్ పాత్ర కి  ఎస్.జె.సూర్యని, ఎంచుకొని ఫస్టాఫ్, సెకండాఫ్ ఆరంభం వరకు సినిమాను ఆకట్టుకునే విధంగా నడిపారు కానీ ఆ తర్వాత భాగాన్నే కొంచెం వీక్ గా తీశారు. సినిమాటోగ్రాఫర్ సంతోష్ శివన్ పనితనం ప్రతి ఫ్రేమ్ లో కనబడింది. క్యాప్చర్ చేయడానికి కష్టమైన యాక్షన్ సన్నివేశాల్ని చాలా స్పష్టంగా కళ్ళ ముందు ఉంచారాయన. అలాగే స్టంట్ మాస్టర్ పీటర్ హెయిన్ రూపొందించిన యాక్షన్ సన్నివేశాలు సినిమాలోని మేజర్ హైలెట్స్ లో ఒకటిగా నిలిచాయి. కీలక సన్నివేశాల్లోని విజువల్ ఎఫెక్ట్స్ ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ తో గొప్పగా ఉన్నాయి. హారిశ్ జైరాజ్ పాటలు బాగున్నాయి. సరికొత్త తరహా బ్యాక్ గ్రౌండ్ స్కోర్ తో అలరించారు. శేఖర్ ప్రసాద్ ఎడిటింగ్ బాగుంది. నిర్మాతలు పాటించిన నిర్మాణ విలువలు చాలా గొప్ప స్థాయిలో ఉన్నాయి.

విశ్లేషణ :

మహేష్ ను మొదటిసారి తమిళ ప్రేక్షకులకు పరిచయం చేస్తుండటం వలన భారీ హంగామా లేకుండా కొంచెం ఈజీగానే పరిచయం చేస్తే రిసీవింగ్ పాజిటివ్ గా ఉంటుందనే ఉద్దేశ్యంతో మురుగదాస్ మహేష్ ను ఒక బలమైన పాత్రలా, నటుడిలా మాత్రమే చూపించి ఉండొచ్చు. దర్శకుడు మురుగదాస్ ఎంచుకున్న కథ, రాసుకున్న కథనం, ప్రతినాయకుడి పాత్ర, అందులో ఎస్.జె. సూర్య నటన, మహేష్ పెర్ఫార్మెన్స్, ఫస్టాఫ్ కథనం,  సినిమాలోని సోషల్ మెసేజ్ ఇందులో ఆకట్టుకునే అంశాలు కాగా సెకండాఫ్ లో తీవ్రత లోపించడం, ఇది మహేష్ అభిమానులకు కాస్త నిరుత్సాహాన్ని కలిగించే అంశం. మహేష్ నుండి భిన్నత్వాన్ని కోరుకునే ప్రేక్షకులకు మాత్రం నచ్చుతుంది.