రివ్యూ : మరో ఆత్మ కథ 'రాజు గారి గది 2'
Telangana Tourism
Vasavi Group

రివ్యూ : మరో ఆత్మ కథ 'రాజు గారి గది 2'

13-10-2017

రివ్యూ : మరో ఆత్మ కథ 'రాజు గారి గది 2'

తెలుగుటైమ్స్.నెట్ రేటింగ్ 2.75/5

బ్యానర్ :పి వి పి సినిమా, ఓక్ ఎంటర్టైన్మెంట్స్, మ్యాటినీ  ఎంటర్టైన్మెంట్స్,
నటి నటులు : నాగార్జున అక్కినేని, సమంత రుత్ ప్రభు, శీరత్ కపూర్, అశ్విన్ బాబు, వెన్నెల కిషోర్, షకలక శంకర్, ప్రవీణ్, నరేష్, అవినాష్ తది తరులు.....
సినిమాటోగ్రఫీ :ఆర్. దివాకరన్, మ్యూజిక్ : యస్ .తమన్,
కథ: రంజిత్ శంకర్, ఒరిజినల్ మూవీ 'ప్రీతమ్'(2016)
మాటలు : అబ్బూరి రవి,
నిర్మాతలు : ప్రసాద్ వి.పొట్లూరి, నిరంజన్ రెడ్డి,
స్క్రీన్ ప్లే, దర్శకత్వం : ఓంకార్,

విడుదల తేదీ :13.10.2017


బుల్లి తెర షోస్ లో మంచి పేరు తెచ్చుకుని  ‘రాజుగారి గది’ తో సంచలన విజయం అందుకున్న దర్శకుడు ఓంకార్, ఈసారి ‘రాజుగారి గది-2’ తో ప్రేక్షకుల ముందుకొచ్చారు. నాగార్జున తొలిసారిగా ఓ హారర్ అండ్  థ్రిల్లర్ మూవీ చేయడం....  సమంత లాంటి టాప్ హీరోయిన్  నటించడం పి వి పి లాంటి భారీ సంస్థ లో  ఈ సినిమా నిర్మించడం,  చిత్రంపై ప్రేక్షకుల్లో మంచి క్రేజ్ నెలకొంది. ఇన్ని అంచనాల నడుమ ఈ రోజే విడుదలైన ఈ చిత్రం ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం…

కథ:

అశ్విన్, ప్రవీణ్, కిశోర్ లు సొంతంగా ఒక రిసార్ట్ కొని బిజినెస్ స్టార్ట్ చేసి జీవితంలో పైకెదగాలని అనుకుంటుంటారు. కానీ అంతలోనే ఆ రిసార్ట్స్ లో అమృత (సమంత) అనే ఆత్మ ఉందనే నిజం వాళ్ళ ముగ్గురికీ అనుభవంలోకి వస్తుంది. అలా దెయ్యం వలన ఇబ్బందులు పడుతున్న వాళ్ళు ఆ కష్టం నుండి బయటపడటానికి రుద్ర(నాగార్జున) అనే మెంటలిస్టును ఆశ్రయిస్తారు.

కేవలం కళ్ళు చూసి మనసులో ఏముందో చెప్పగల రుద్ర వాళ్ళ కష్టం తీర్చడానికి రిసార్ట్స్ కు వచ్చి తన పరిశోధన ప్రారంభిస్తాడు. ఆ పరిశోధనలో రుద్ర తెలుసుకున్న నిజాలేంటి, అసలు అమృత ఎవరు, ఆత్మగా మారిన ఆమె ఆ రిసార్ట్స్ లోనే ఎందుకుంది, చివరికి రుద్ర ఆ సమస్యను ఎలా పరిష్కరించాడు అనేదే మిగతా  సినిమా కథ.

ఆర్టిస్ట్స్ పెర్ఫార్మన్స్ :

చంద్ర ముఖి లో రజని కాంత్ పాత్రలాంటిదే అక్కినేని నాగార్జున చేసిన మెంటలిస్ట్ పాత్ర . నాగార్జున కొత్త కోడలు  సమంత కథలో ఉన్న రెండు కీలక పాత్రల్ని చేయడమే సినిమాకి ప్రధాన బలంగా నిలిచింది. మెంటలిస్ట్ పాత్రలో నాగార్జున నటన, లుక్, యాటిట్యూడ్ బాగా  ఆకట్టుకున్నాయి. ఆయన కనిపిస్తున్నంతసేపు కాస్త ఉత్సాహంగానే అనిపిస్తుంటుంది. అలాగే ఆత్మగా సమంత పెర్ఫార్మెన్స్ కూడా బాగుంది. తనని బాధపెట్టిన వాళ్ళపై పగ తీర్చుకోవాలనుకునే ఆత్మగా ఆమె నటన అదుర్స్ అనేలా ఉంది. ఇక నాగ్, సమంతలు కలిసి కనబడే క్లైమాక్స్ సన్నివేశంలో ఎమోషన్ బాగా వర్కవుట్ అయింది. మంచి టైమింగ్ తో, హావభావాలతో హెల్తీ కామెడీని పండించగల వెన్నెల కిశోర్, షకలక శంకర్ వంటి నటుల్ని కొద్దిగా మాత్ర్రమే వాడుకుని చాలా వరకు బలవంతపు కామెడీకి పరిమితం చేయడం కూడా ఈ చిత్రం లోని  కాస్త డ్రాబ్యాక్.

సాంకేతిక వర్గం పనితీరు:

దర్శకుడు ఓంకార్ ఒక హర్రర్, థ్రిల్లర్ కు కావాల్సిన కథ, కథనాలను సంతృప్తికర స్థాయిలో అల్లుకోలేదనే అనాలి. ఎమోషనల్ గా బాగున్న కథకు కదిలించే హర్రర్ సన్నివేశాలని జోడించి, కొద్దిగా ఎగ్జైట్మెంట్ ఉన్న కథనాన్ని జోడించి ఉంటే ప్రేక్షకుడికి ఇంకాస్త బెటర్ గా ఎంజాయ్ చేయడానికి అవకాశం దొరికేది. కానీ ప్రధానంగా  నాగార్జున, సమంతల పాత్రల్ని మాత్రం బాగానే డిజైన్ చేసి ఎలివేట్ చేశారాయన. రచయిత అబ్బూరి రవి మాటలు బాగున్నాయి. సంగీత దర్శకుడు థమన్ చేసిన బ్యాక్ గ్రౌండ్ సినిమాకు బాగా సహాయపడింది. దివాకరన్ సినిమాటోగ్రఫీ ఆహ్లాదకరంగా అనిపించింది. ఇక విజువల్ ఎఫెక్ట్స్ అయితే అంత గొప్ప స్థాయిలో లేవు. ఎడిటింగ్ ద్వారా ఫస్టాఫ్లోని కొన్ని అనవసరమైన కామెడీ సీన్లను తొలగించి ఉండాల్సింది. నిర్మాణ సంస్థలు పివిపి, మ్యాటనీ ఎంటర్టైన్మెంట్స్ కలిసి పాటించిన నిర్మాణ విలువలు గొప్ప స్థాయిలో ఉన్నాయి.

విశ్లేషణ:

దర్శకుడు ఓంకార్ ‘రాజుగారి గది-2’ ని మొదటి భాగం ‘రాజుగారి గది’ ని తీసిన స్థాయిలో తీయకపోయినా ఎమోషనల్ గా, ఓ సెంటిమెంటుగా మనసును కదిలించే విధంగా అయితే తీశారు. దానికి తోడు అయన ఇంకొద్దిగా బలంగా ఉన్న కథనాన్ని, హర్రర్ కంటెంట్ ను అందించి ఉంటే బాగుండేది. సినిమాలో సరైన కథ, కథనాలు లేకపోవడమే పెద్ద మైనస్. ఫస్టాఫ్ ఆరంభమైన 45 నిముషాలకు కూడా అసలు కథను ఓపెన్ చేయకుండా, నాగార్జున పాత్రను ప్రవేశపెట్టకుండా వెన్నెల కిశోర్, ప్రవీణ్ లపై చాలాసేపు ఒకే తరహా కామెడీని నడిపి టైమ్ పాస్ చేయడంతో బోర్ కొట్టింది. అలాగే అసలు పాత్ర సమంతను కూడా ఇంటర్వెల్ వరకు రివీల్ చేయకుండా ప్రాముఖ్యతలేని శీరత్ కపూర్ కి పాత్రకి మాటి మాటికీ ఎలివేషన్ ఇవ్వడంతో సినిమాను రన్ టైమ్ కోసమే లాగుతున్నారని స్పష్టంగా అర్థమైపోయింది. భావోద్వేగపూరితమైన సినిమా ఆఖరు 20 నిముషాలు, సమంత, నాగ్ ల పాత్రలు, వారి నటన ఇందులో ఆకట్టుకునే అంశాలు కాగా పేలవమైన టేకింగ్, పెద్దగా ఆకట్టుకోని ఫస్టాఫ్, కొన్ని బలవంతపు కామెడీ సన్నివేశాలు మైనస్ పాయింట్స్ గా ఉన్నాయి. మొత్తం మీద చెప్పాలంటే ఈ చిత్రం ప్రేక్షకుల్ని పెద్దగా మెప్పించక పోయిన నిరుత్సహ పెట్టదు.