రివ్యూ : బోరింగ్ 'బాలకృష్ణుడు'

రివ్యూ : బోరింగ్ 'బాలకృష్ణుడు'

25-11-2017

రివ్యూ : బోరింగ్ 'బాలకృష్ణుడు'

తెలుగుటైమ్స్.నెట్ రేటింగ్ 2.5/5

బ్యానెర్లు:  శరశ్చంద్రికా  విషనరీ  మోషన్  పిక్చర్స్ & మాయ బజార్  మూవీస్,
నటీనటులు : నారా రోహిత్, రెజినా, రమ్య కృష్ణన్, కోట శ్రీనివాస రావు, అజయ్, ఆదిత్య మీనన్, వెన్నెల  కిషోర్,ఆత్మ పాట్రిక్, ప్రిథ్వి రాజ్, రఘు కారుమంచి, రఘు బాబు, శ్రీనివాస్ రెడ్డి, రవి వర్మ, అవంతిక వందనపు తది తరులు...

కథ,మాటలు : రాజా కొలుసు, సినిమాటోగ్రఫీ: విజయ్  సి . కుమార్,
ఎడిటర్: కోటగిరి  వెంకటేశ్వరరావు, సంగీతం : మణిశర్మ,
నిర్మాత : బి.మహేంద్ర బాబు, ముసునూరు వంశీ, శ్రీవినోద్ నందమూరి,
దర్శకత్వం : పవన్ మల్లెల,

విడుదల తేదీ:24.11.2017

కొత్త కాన్సెప్ట్స్ తో ఎప్పటికపుడు కొత్తదనం ప్రదర్శించే  హీరో నారా రోహిత్ ఈసారి ‘బాలకృష్ణుడు’ గా పక్క మాస్ మసాలా  కమర్షియల్ సినిమా రూపంలో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. పవన్ మల్లెల దర్శకత్వం వహించిన ఈ సినిమా ఈరోజే ప్రేక్షకుల ముందుకొచ్చింది. మరి ఈ సినిమా ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం..

కథ:

పాత కక్షల వల్ల భానుమతిదేవి (రమ్యకృష్ణ), ప్రతాప్ రెడ్డి (అజయ్) ల మధ్య వివాదం ఉంటుంది. అయితే భానుమతిదేవి మేనకోడలు ఆద్య (రెజినా)ను చంపేసి భానుమతిదేవి మీద పగ తీర్చుకోవాలని చూస్తాడు ప్రతాప్ రెడ్డి. అయితే ఆద్యకు తెలియకుండానే తనకు రక్షణగా బాలు (నారా రోహిత్)ను పెడుతుంది. ఇక ఆద్యకు ఎలాంటి ఆపద రానివ్వకుండా చూస్తున్న బాలుకి అనుకోకుండా సమస్య ఎదురవుతుంది. అయితే ఆ సమస్య నుండి బాలు ఎలా బయట పడ్డాడు..? ప్రతాప్ రెడ్డి నుండి ఆద్యను ఎలా కాపాడాడు అన్నది అసలు కథ.

ఆర్టిస్ట్స్ పెర్ఫార్మన్స్:

నారా రోహిత్ కెరియర్ లో మొదటిసారి ఓ పక్కా కమర్షియల్ సినిమా చేశాడని చెప్పాలి. తనకంటూ ఓ సెపరేట్ ఇమేజ్ కోసం ప్రయత్నించిన నారా రోహిత్ బాలకృష్ణుడులో స్లిం లుక్ లో అలరించాడు. ఇక బాలు పాత్ర తనకు పర్ఫెక్ట్ గా కుదిరింది. ఆద్యగా రెజినా అందాలతో యూత్ ఆడియెన్స్ పండుగ చేసుకోవడం ఖాయం. ఇక రమ్యకృష్ణ పాత్ర ఉన్నంతవరకు బాగుంది. అజయ్ కూడా తన రెగ్యులర్ పాత్రే కాబట్టి బాగానే చేశాడు. 30 ఇయర్ పృధ్వి కామెడీ బాగుంది. శ్రీనివాస్ రెడ్డి కూడా అలరించాడు. ఇక మిగతా పాత్రలన్ని పరిధి మేరకు నటించి మెప్పించారు.

సాంకేతిక వర్గం :

నూతన దర్శకుడు పవన్ మల్లెల తను చెప్పాలనుకున్న పాత పాయింట్ ను కొత్తగా చెప్పడానికి ట్రై చేయకపోవడం, పాత, బలహీనమైన సన్నివేశాలు రాసుకోవడంతో సినిమా రక్తి కట్టించలేకపోయింది. డైరక్షన్ టాలెంట్ ఓకే కాని ఈ సినిమా కథ కథనాలు అన్ని పరమ రొటీన్ గా వున్నాయి. ఆ విషయంలో దర్శకుడు ఎందుకు రొటీన్ గా నడిపించాడో అర్ధం కాదు. విజయ్ సి కుమార్ కెమెరా పనితనం బాగుంది. మణిశర్మ మ్యూజిక్ పర్వాలేదు. ప్రొడక్షన్ వాల్యూస్ సినిమాకు ఎంత కావాలో అంత పెట్టేశారు. మణిశర్మ అందించిన ఒక మెలోడి సాంగ్, రీరికార్డింగ్ బాగున్నాయి. యాక్షన్ సన్నివేశాల్ని బాగా చూపించారు. డైలాగ్స్ పర్వాలేదు. ఎడిటింగ్ ద్వారా కొన్ని అనవసర సన్నివేశాలని తొలగించి ఉండాల్సింది. నిర్మాతలు పాటించిన నిర్మాణ విలువలు చాలా రిచ్ గా వున్నాయి.

విశ్లేషణ:

దర్శకుడు ఎంచుకున్న పాయింట్ చాలా పాతది. ఇప్పటికే ఎన్నో సినిమాల్లో వాడిన ఈ ఫార్ములాను రోహిత్ ఎలా ఒప్పుకున్నారు అనే భావం కలుగుతుంది. ఈ కథకు ఫ్యాక్షన్ జోడించి రాసిన సన్నివేశాలు కూడా ఆసక్తికరంగా లేకపోవడంతో ప్రేక్షకులు బోర్ ఫీల్ అయ్యే అవకాశాలున్నాయి. మొదటి పది నిముషాల తర్వాత సినిమా ఎలా పడితే అలా వెళ్లిపోవడం, అనవసర పాత్రలు కథలోకి ప్రవేశించడంతో చిరాకు పెడతాయి.తన శత్రువులు మేనకోడలిని చంపుతారని తెలిసి ఓ రక్షకుడిని పెట్టడం అతను చొరవ తీసుకుని ఆమెతో ప్రేమలో పడటం ఇవి ఎప్పుడో వచ్చిన కథలు. అయితే పాత కథే అయినా దర్శకుడు స్క్రీన్ ప్లే కూడా రొటీన్ గా సాగించాడు. అయితే పృధ్వి కామెడీ మాత్రం బాగుంది. సినిమాను కమర్షియల్ బాట పట్టించడంలో కామెడీ ప్లస్ అయ్యింది. ఇక కథ కథనాల విషయంలో దర్శకుడు విఫలమయ్యాడు. యూత్ ఆడియెన్స్ రెజినా అందాల కోసం చూడొచ్చేమో కాని బాలకృష్ణుడు రెగ్యులర్ కమర్షియల్ సినిమా. మరి సినిమాను ప్రేక్షకులు ఎలా రిసీవ్ చేసుకుంటారో చూడాలి.