అమెరికాలో మనవాళ్ళ కష్టాలు
ఒకప్పుడు అమెరికాలో చదువుకునేందుకు వెళుతున్నారంటే అక్కడే అతనికి ఉపాధి దొరుకుతుందని, ఇండియాకు రాదని చెప్పేవాళ్ళు. కాని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ పుణ్యమా అని ఇప్పుడు చదువుకోవడానికి వెళ్ళేవాళ్ళు చదువు అయిన తరువాత ఇండియాకు తిరిగి వచ్చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఎందుకంటే ఉపాధి కోసం ఇచ్చే వీసాలను అమెరికా భారీ సంఖ్యలో తగ్గించేయడమే. దీంతో అమెరికాలో చదువుకుంటే ఉద్యోగం వస్తుందన్న ఆశ చాలామందిలో తగ్గిపోయింది. దీంతో లక్షల సంఖ్యలో విద్యార్థులు ప్రతి సంవత్సరం అమెరికా యూనివర్సిటీల్లో చేరుతున్నా వారిలో వేలమందికి మాత్రమే ఉపాధి దొరుకుతోంది. అత్యున్నత ప్రతిభ ఉన్నవాళ్ళకే ఈ ఉపాధి లభిస్తోంది. దీంతో అప్పు చేసి అమెరికా వచ్చిన విద్యార్థులు భారీగా నష్టపోతున్నారు. స్వదేశానికి వారు ఒట్టి చేతులతో వెళ్ళాల్సి వస్తోంది.
అమెరికన్లకే ఉపాధి అన్న ట్రంప్ విధానాల కారణంగా ఇతరులకు వర్క్ పర్మిట్లను పెద్దఎత్తున ఇవ్వడానికి ఇమ్మిగ్రేషన్ అధికారులు సిద్ధంగా లేరు. దీంతో అమెరికా యూనివర్సిటీల్లో లక్షల సంఖ్యలో మన విద్యార్థులు వెళ్తున్నా.. ఆ దేశం ఏటా జారీ చేస్తున్న వర్క్ వీసాల సంఖ్య మాత్రం 85 వేలు దాటడం లేదు. దీంతో మున్ముందు ఉద్యోగాలు దొరక్క భారతీయ విద్యార్థులు తిరిగి వెళ్ళాల్సి ఉంటుందని పరిశీలకులు అంటున్నారు.
అంతర్జాతీయ విద్యార్థుల సంఖ్యను ఏటేటా పెంచుకోవడం ద్వారా గతేడాది అమెరికన్ విశ్వవిద్యాలయాలు భారీగానే ఆదాయాన్ని సంపాదించుకుంటున్నాయి. వీసా గడువు ముగుస్తున్న దశలో రెన్యువల్ కోసం వస్తున్న దరఖాస్తులను కూడా యునైటెడ్ స్టేట్స్ సిటిజన్షిప్ అండ్ ఇమిగ్రేషన్ సర్వీసెస్ (యుఎస్సీఐఎస్) తిరస్కరిస్తోంది. హెచ్1బీ వీసాల జారీ, గడువు పొడిగింపు వంటి అంశాల్లో డోనాల్డ్ ట్రంప్ ప్రభుత్వం ఎలాంటి మార్పులు చేయలేదు. గతంలో అమెరికా యూనివర్సిటీల్లో చదివేందుకు వచ్చే విద్యార్థుల సంఖ్య 40వేలలోపే ఉండేది. దాంతో అక్కడ చదువుకున్న వాళ్ళకు ఉపాధి సులువుగా లభించేవి. నేడు పరిస్థితులు మారాయి. పాలసీలు మారాయి. దానికితోడు అమెరికా వెళ్ళి చదువుకునే విద్యార్థుల సంఖ్య వేల నుంచి లక్షకుపైగా దాటింది. దాంతో ఉపాధి అవకాశాలు క్రమక్రమంగా సన్నగిల్లడం గత నాలుగైదు సంవత్సరాలనుంచి జరుగుతోంది.
ఈ ఏడాదిలో వీసా కోసం భారతీయుల నుంచి వచ్చిన దరఖాస్తులు మొత్తం 1.68 లక్షలు. వీరిలో 71,675 మందికి మాత్రమే హెచ్1బీ వీసాలు మంజూరయ్యాయి. వాటిలోనూ వెరిఫికేషన్ తర్వాత 3 నుంచి 5 శాతం తిరస్కరణకు గురయ్యే అవకాశం ఉంటుంది. వీరంతా అర్హత ఉంటే 2019 ఏప్రిల్కు మళ్లీ దరఖాస్తు చేయాల్సి ఉంటుంది. అయితే గ్రాడ్యుయేషన్ తర్వాత ఆప్షనల్ ప్రాక్టికల్ ట్రైనింగ్ (ఓపీటీ) కోసం మూడేళ్లు అమెరికాలో ఉండేందుకు అనుమతిస్తారు. ఈ మూడేళ్లలో హెచ్1 బీ వీసా లభించకపోతే తిరిగి స్వదేశం వెళ్లడమో లేదా మళ్లీ విశ్వవిద్యాలయాల్లో చేరిపోవడమో తప్ప వేరే మార్గం ఉండదు.
గ్రాడ్యుయేషన్ తర్వాత మూడేళ్లు ఉద్యోగం చేసినా వీసా దొరకని వారు అప్పటిదాకా కూడబెట్టుకున్న సొమ్ముతో తిరిగి ఇతర కోర్సుల్లో చేరేందుకు మళ్లీ ఎఫ్1 (విద్యార్థి వీసా)కు మారిపోతున్నారు. గతంలో హెచ్1బీ వీసా రెన్యువల్ చేసే విషయంలో ఇమ్మిగ్రేషన్ అధికారులు ఉదారంగా వ్యవహరించేవారు. కానీ గడచిన మూడేళ్లుగా నిబంధనలు కఠినం చేశారు. వీసా పొందిన మూడేళ్లు క్రమం తప్పకుండా పన్ను చెల్లించారా లేదా అన్న అంశంతోపాటు 36 నెలలు నెలనెలా బ్యాంక్లో వేతనం జమ అయిందా లేదా అన్న వివరాలు పరిశీలిస్తున్నారు. ఏ కారణం చేత అయినా 6 నెలలు లేదా ఏడాది ఖాళీగా ఉంటే వీసాను పునరుద్ధరించడం లేదు. గడచిన మూడేళ్లలో 1.38 లక్షల మంది వీసాలు పునరుద్ధరణకు నోచుకోలేదు. అంటే ఏటా సగటున 45 వేల మంది అక్కడ ఉద్యోగం ఉండి కూడా తిరుగుముఖం పడుతున్నారన్నమాట! ఈ సంఖ్య రానున్న రోజుల్లో మరింత పెరుగుతుందని అంచనా వేస్తున్నారు. ఏదీ ఏమైనా మన విద్యార్థులు అక్కడ ఉపాధిని దక్కించుకోవాలంటే ఎంతో కష్టపడాల్సి ఉంటుంది. అన్నింట్లోనూ ప్రతిభను చూపినప్పుడే ఉపాధికి అవకాశాలు అక్కడ లభిస్తాయి.
-గోవింద్