నా ఆరాటం సక్సెస్ మూవీ తీయడమే - 'అమర్ అక్బర్ ఆంటోనీ' దర్శకుడు శ్రీను వైట్ల

నా ఆరాటం సక్సెస్ మూవీ తీయడమే - 'అమర్ అక్బర్ ఆంటోనీ' దర్శకుడు శ్రీను వైట్ల

15-11-2018

నా ఆరాటం సక్సెస్ మూవీ తీయడమే - 'అమర్ అక్బర్ ఆంటోనీ' దర్శకుడు శ్రీను వైట్ల

మాస్‌ మహారాజా రవితేజ హీరోగా మైత్రి మూవీ మేకర్స్‌ పతాకంపై శ్రీను వైట్ల దర్శకత్వంలో నవీన్‌ ఎర్నేని, యలమంచిలి రవిశంకర్‌, సి.వి.మోహన్‌(సి.వి.ఎం) నిర్మిస్తున్న యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌ 'అమర్‌ అక్బర్‌ ఆంటోని'. ఈ చిత్రం నవంబర్‌ 16న ప్రపంచవ్యాప్తంగా విడుదల కాబోతోంది. ఈ నేపథ్యంలో చిత్ర దర్శకుడు శ్రీను వైట్లతో జరిపిన ఇంటర్వ్యూ. 

'అమర్‌ అక్బర్‌ ఆంటోనీ' ఈ ప్రాజెక్ట్‌ ఎలా సెట్‌ అయింది? 

- 'మిస్టర్‌' రిజల్ట్‌ తర్వాత నాకు నేనుగా కొంగ గ్యాప్‌ తీసుకున్నాను. ఈసారి సినిమా చేస్తే.. ఆ అటెంప్ట్‌ చాలా స్ట్రాంగ్‌గా ఉండాలని దాదాపు ఎనిమిది నెలలపాటు కొత్త రచయితల సహకారంతో 'అమర్‌ అక్బర్‌ ఆంటోని' స్క్రిప్ట్‌ని సిద్ధం చెయ్యడం జరిగింది. స్క్రిప్ట్‌ విషయంలో నేను పూర్తిగా శాటిస్‌ఫై అయిన తర్వాతే రవితేజకు చెప్పాను. ఈ కథలోని పాయింట్‌ రవికి బాగా నచ్చింది. అలా ఈ సినిమా స్టార్ట్‌ అయింది. 

రవితేజతోనే ఈ సినిమా ఎందుకు చెయ్యాలనుకున్నారు? 

- నేను, రవి ఒకేసారి ఇండస్ట్రీకి వచ్చాం. కెరీర్‌ పరంగా నేను వెనకబడి ఉన్న ప్రతిసారీ రవి నాకు ట్రబుల్‌ షూటర్‌ అయ్యాడు. మా ఇద్దరి మధ్య హీరో, దర్శకుడు అనే భావన లేదు. మేమిద్దరం ఎప్పుడు కలిసినా అల్లరిగానే ఉంటుంది. రవి నాకు చాలా సన్నిహిత మిత్రుడు అని చెప్పొచ్చు. తనతో వర్క్‌ చేయడం నాకు చాలా ఈజీ. ఈ కథ రవితేజని దృష్టిలో పెట్టుకొనే రాసుకున్నాను. ఈ సినిమాకి 'అమర్‌ అక్బర్‌ ఆంటోని' అనే టైటిల్‌ పెట్టడానికి రీజన్‌ ఏమిటి? అని చాలా మంది అడిగారు. దానికి ఒక బలమైన కారణం ఉంది. రవి... అమితాబ్‌కి పెద్ద ఫ్యాన్‌. ఈ టైటిల్‌ చెప్పగానే అతను వెంటనే ఓకే చెప్పాడు. నాకు కూడా ఈ టైటిల్‌ సినిమాకి పర్‌ఫెక్ట్‌గా ఉంటుందనిపించింది. 

సినిమా కథ గురించి? 

- నేను రవితేజ ఇది వరకు చేసిన సినిమాలన్నీ ఓ జోనర్‌లో ఉంటాయి. ఇది కంప్లీట్‌గా కొత్త కథ. గత సినిమాల్లో లేని బలమైన కథ ఇందులో బోనస్‌గా ఉంటుంది. 

హీరోయిన్‌గా ఇలియానాను తీసుకోవటం పూర్తిగా మీ ఛాయిసేనా? 

- అవును, అది పూర్తిగా నా ఛాయిసే. ఈ పాత్రకు ఇలియానా అయితేనే బాగుంటుందని నాకనిపించింది. నిజానికి తనని దృష్టిలో పెట్టుకొనే హీరోయిన్‌ పాత్రను డిజైన్‌ చేశాను. కానీ ఫస్ట్‌ తనతో కుదరలేదు. బట్‌, చివరకి తనే ఈ రోల్‌ చేసింది. తనతో పాటు తన రోల్‌ కూడా ఈ సినిమాకే ప్రత్యేకమైన ఆకర్షణగా నిలుస్తోంది. ముఖ్యంగా ఈ సినిమాలో ఇలియానా తన పాత్రకు తానే డబ్బింగ్‌ చెప్పి చిత్ర యూనిట్‌ను ఆశ్ఛర్యం కలిగించింది. ఇలియానా డబ్బింగ్‌కి ఎవరైనా ఫిదా అవ్వాల్సిందే. 

మైత్రి మూవీ మేకర్స్‌ బ్యానర్‌తో కలిసి పని చెయ్యడం ఎలా అనిపించింది? 

- ఈ చిత్రానికి కొంచెం బాగానే బడ్జెట్‌ అయింది. దాంతో పాటు సినిమాలో కీలక సన్నివేశాలు యుఎస్‌లో జరుగుతాయి. ఒక విధంగా మైత్రి మూవీ మేకర్స్‌ కాబట్టే మేం చాలా కంఫర్టబుల్‌గా యుఎస్‌లో షూట్‌ చేయగలిగాం. స్నో ఫాలింగ్‌ సమయంలో, సమ్మర్‌లో రెండు బంచ్‌ల కింద ఈ సినిమా చేశాం. అయితే నిర్మాతలు వారు పెట్టిన ఖర్చుకు తగ్గ ఔట్‌పుట్‌ వచ్చిందని ఆనందంతో కాంప్లిమెంట్స్‌ ఇస్తున్నారు. మైత్రి మూవీ మేకర్స్‌తో పని చెయ్యడం చాలా సంతోషాన్నిచ్చింది. 

దర్శకుడుకి బ్రాండ్‌ అనేది వరమా.. శాపమా? 

- నాలాంటి దర్శకులకు బ్రాండ్‌ అనేది వరం అవుతుంది. అలాగే శాపం కూడా అవుతుంది. మంచి బ్రాండ్‌ని నిలబెట్టుకోవడానికి ఆ దిశగా చాలా కృషి చేయాలి. నేనిప్పుడు అదే పనిలో ఉన్నాను. 

మీ ఫెయిల్యూర్స్‌ నుండి మీరు ఏమి నేర్చుకున్నారు? 

- ఎవరి జర్నీలో అయినా ఫెయిల్యూర్స్‌ అనేవి చాలా కామన్‌. కానీ, నా ఫెయిల్యూర్స్‌ మాత్రం నన్ను ఇంకా బాగా స్ట్రాంగ్‌ చేశాయి. మామూలుగా ఎవరైనా మిస్టేక్స్‌ నుంచే ఎక్కువ నేర్చుకుంటారు. అందుకే ఎంతో కేర్‌ తీసుకోని అన్ని విషయాల్లో అన్ని రకాలుగా ఆలోచించి ఓ మంచి చిత్రంతో మళ్లీ మీ ముందుకు వస్తున్నాను. ఈ సినిమా ఖచ్చితంగా హిట్‌ అవుతుందని నేను చాలా నమ్మకంగా చెప్పగలను. 

ఇతర భాషల్లో సినిమాలు చేసే ఆలోచన ఉందా? 

- నాకు హిందీలో సినిమా చేయాలని ఉంది. ఇంతకు ముందు రెండు సార్లు చేయాల్సింది. కానీ ఎందుకో కుదరలేదు. అయితే 'అమర్‌ అక్బర్‌ ఆంటోని' రైట్స్‌ని ఈసారి నా దగ్గరే ఉంచుకున్నాను. ఏమవుతుందో చూడాలి. 

చిన్న సినిమాలు తీసే ఆలోచన ఉందా? 

- నేనెప్పుడూ సినిమాల్లో పనికోసమే ఆరాటపడ్డా. నేను చేస్తున్న సినిమా చిన్నదా, పెద్దదా అని ఎప్పుడూ ఆలోచించలేదు. నా తొలి సినిమా రూ.38లక్షల్లో చేశా. ఆ తర్వాత అలా చేస్తూ చేస్తూ ఒక స్థాయికి వచ్చాను. ఇప్పుడు ఒకవేళ ఏదైనా ఫ్లాష్‌లాగా ఆలోచన వస్తే నేను చిన్న బడ్జెట్‌ చిత్రాన్ని చేయడానికి వెనకాడను. 

ఈ సినిమాలో అదనపు ఆకర్షణలు? 

- సునీల్‌ది ఇందులో చాలా మంచి పాత్ర. ఎంత బావుంటుందంటే అప్పుడెప్పుడో పాత సినిమాల్లో సునీల్‌ని చూసినంత ఫ్రెష్‌గా అనిపిస్తుంది. ఇందులో లయగారి పాప యాక్ట్‌ చేశారు. పాపకు తల్లిగా ఇంకెవరినైనా చూద్దామని అనుకుంటున్నప్పుడు మేమే లయగారిని చేయమని అడిగాం. ఆమె.. 'లేదండీ మేం చేయడం లేదు..' అని అన్నారు. ఎలాగూ, పాపతో మీకు కన్వీనియెంట్గా ఉంటుందని అడిగితే సరేనన్నారు. ఆమెతో పాటు నటి అభిరామి కూడా చేశారు. జెన్నిఫర్‌ లోపెజ్‌ మేన్షన్‌ చాలా బావుంటుంది. దాదాపు 13 ఎకరాల్లో ఉన్న ఇల్లు అది. యు.ఎస్‌.లో అలాంటి మేన్షన్‌లు చాలా అరుదుగా ఉంటాయి. దాన్ని మన తెలుగు వ్యక్తి మల్లారెడ్డి కొన్నారట. నన్ను మామూలుగా తీసుకెళ్లి చూపించారు. నాకు నచ్చింది. ఇక షూటింగ్‌ జరిగినన్ని రోజులు మేం అక్కడే ఉన్నాం. 

మీ తదుపరి ప్రాజెక్టుల గురించి చెప్పండి ? 

- ఇంకా ఏం ఆలోచించలేదండి. ప్రస్తుతం 'అమర్‌ అక్బర్‌ ఆంటోనీ' రిలీజ్‌ కోసమే ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నాను. ఈ సినిమా రిజల్ట్‌ని బట్టి తర్వాత ఏ సినిమా చెయ్యాలి, ఎవరితో చెయ్యాలి అనేది ఆలోచిస్తాను అంటూ ఇంటర్వ్యూ ముగించారు దర్శకుడు శ్రీను వైట్ల.

Click here for Photogallery