కేసీఆర్ మంత్రివర్గం ఎలా ఉంటుంది?

కేసీఆర్ మంత్రివర్గం ఎలా ఉంటుంది?

04-02-2019

కేసీఆర్ మంత్రివర్గం ఎలా ఉంటుంది?

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ తన మంత్రివర్గం ఎలా ఉండాలన్న విషయంలో తుదిఆలోచనలో ఉన్నారని వార్తలు వస్తోంది. తన మంత్రివర్గం విస్తరణ ఎలా ఉండాలన్న దానిపై ఆలోచనలు, సమాలోచనలు చేస్తున్నారు. తన ఆలోచనలకు ఆయన తుదిరూపాన్ని ఇచ్చినట్లు కనిపిస్తోంది. తొలుత అనుకున్నట్లు పరిమిత సంఖ్యలో కాకుండా పూర్తిస్థాయిలో మంత్రివర్గాన్ని ఏర్పాటు చేయడానికి కేసీఆర్‌ సన్నద్ధమైనట్లు తెలుస్తోంది.  ఇప్పటికే ఒకరిద్దరు సీనియర్లకు స్వయంగా సీఎం కేసీఆర్‌ ఫోన్‌చేసి మంత్రి పదవులను ఇస్తున్న విషయాన్ని చెప్పారని ప్రచారం జరుగుతుండగా పార్టీ వర్గాలు కూడా ఈ అంశాన్ని దవీకరిస్తున్నాయి. తొలుత ఎనిమిది నుంచి పది మంది మంత్రులను తీసుకోవాలని సీఎం కేసీఆర్‌ భావించినా తాజా రాజకీయ పరిణామాల నేపథ్యంలో ఖాళీగా ఉన్న పదహారు మందిని ఒకే దఫా మంత్రివర్గంలో చేర్చుకోవాలన్న నిర్ణయానికి ఆయన వచ్చినట్టు అత్యంత విశ్వసనీయంగా తెలిసింది.

గత మంత్రివర్గంలో పని చేసిన వారిలో మెజారిటీ ఎమ్మెల్యేలకు ఈ దఫా కూడా అవకాశం ఉంటుందన్న సంకేతాలు వెలువడుతున్నాయి. శాసన సభకు కొత్తగా ఎంపికైన 17 మంది ఎమ్మెల్యేలలో ఇద్దరు లేదా ముగ్గురికి అవకాశం ఉండవచ్చన్న ప్రచారం ఉంది. రెండు నుంచి ఆరుసార్లు శాసనసభకు ఎన్నికైన వారిలో పలువురికి మంత్రివర్గంలో చోటు దక్కవచ్చని పార్టీ వర్గాలు భావిస్తున్నాయి. వీరిలో ఆయా సామాజికవర్గాలను, ప్రాంతాలను పరిగణలోకి తీసుకుని మంత్రులుగా ఎంపిక చేయవచ్చన్న ప్రచారం ఉంది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడక ముందు సాగిన ఉద్యమం, ప్రభుత్వం ఏర్పడ్డాక మంత్రులుగా అవకాశం వచ్చిన వారి పనితీరు, పార్టీ నేతలతో వారు వ్యవహరించిన విధానం, ఉమ్మడి జిల్లాల్లో పార్టీ బలోపేతానికి ఏ విధంగా పాటుపడ్డది, భవిష్యత్తులో జరిగే లోక్‌సభ, మునిసిపల్‌, సహకార ఎన్నికల్లో వారు ఏ విధంగా పని చేస్తారన్న అంశాలను పరిగణలోకి తీసుకుని వారిని మంత్రులుగా ఎంపిక చేస్తున్నట్టు ప్రచారం జరుగుతోంది. పార్టీపరంగా ఆయా జిల్లాల్లో వారు పనిచేసిన విధానం, నియోజకవర్గాల్లో వారు ప్రజలతో మమేకమైన పద్ధతి కూడా ప్రధానంగా చూస్తున్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఓవైపు పార్టీ తరఫున, మరోవైపు నిఘా వర్గాల నుంచి తెప్పించుకున్న నివేదికల ఆధారంగా మంత్రులుగా ఎవరిని ఎంపిక చేయాలన్న అంశంపై కేసీఆర్‌ పూర్తిస్థాయిలో అధ్యయనంచేసి జిల్లాల వారీగా అభ్యర్థిత్వాలను ఖరారు చేస్తున్నట్టు తెలుస్తోంది. ఉమ్మడి వరంగల్‌ జిల్లాకు చెందిన ఓ సీనియర్‌ ఎమ్మెల్యేకు సీఎం కేసీఆర్‌ బుధవారం ఉదయం ఫోన్‌చేసి జిల్లాల్లో పార్టీ బలోపేతం, పంచాయితీ ఎన్నికలపై చర్చించిన పిదప సదరు ఎమ్మెల్యేకు మంత్రి పదవిని ఇస్తున్న విషయాన్ని చెప్పి ఆయనకు శుభాకాంక్షలు కూడా తెలియజేసినట్టు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఈ విషయాన్ని గోప్యంగా ఉంచాలని ఎవరితోనూ పంచుకోవద్దని కేసీఆర్‌ ఆ ఎమ్మెల్యేకు హితబోధ చేసినట్టు కూడా ప్రచారం జరుగుతోంది. మరికొందరు ఎమ్మెల్యేలతో కూడా మంత్రివర్గ విస్తరణపై కూడా సమాలోచనలు జరిపినట్టు చెబుతున్నారు.

ఆయా జిల్లాలకు చెందిన పలువురు ఎమ్మెల్యేలను ఎంపిక చేసుకుని వారితో అనేక అంశాలపై అభిప్రాయాలను సేకరిస్తున్నట్టు తెలుస్తోంది. తనను కలిసేందుకు ప్రగతి భవన్‌కు వస్తున్న ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో కూడా ఆయా జిల్లాలకు చెందిన అంశాలపై చర్చిస్తూ గతంలో ఎమ్మెల్యేలు, మంత్రులుగా పనిచేసిన వారి పూర్వాపరాలను తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నట్టు పార్టీవర్గాలు చెబుతున్నాయి. ఎమ్మెల్సీలుగా ఉండి మంత్రులుగా పనిచేసిన వారికి ఈసారి ఆశించిన స్థాయిలో అవకాశాలు ఉండవన్న సంకేతాలు కూడా వెలువడుతున్నాయి. ఒకరు లేదా ఇద్దరు ఎమ్మెల్సీలకు ఈ దఫా మంత్రివర్గంలో చోటుదక్కే అవకాశాలు ఉన్నట్లు సమాచారం. ఓవైపు ఎమ్మెల్యేలు, మరోవైపు ఎమ్మెల్సీల జాబితా ముందుంచి వారు ప్రాతినిధ్యం వహిస్తున్న జిల్లాలు, నియోజకవర్గాలు, సామాజికవర్గాలను పరిగణలోకి తీసుకుంటున్నట్టు సమాచారం. ఒకవేళ మంత్రులుగా సర్దుబాటు చేయకపోతే వారిని పార్లమెంటరీ కార్యదర్శులుగా నియమించాలన్న ప్రతిపాదనపై కూడా చర్చిస్తున్నట్టు తెలుస్తోంది. కొందరు ఎమ్మెల్యేలకు కీలకమైన కార్పొరేషన్‌ చైర్మన్‌ పదవులను కట్టబెట్టే అవకాశముందని తెలుస్తోంది. మొత్తంమీద మంత్రివర్గ విస్తరణకు సంబంధించి కేసీఆర్‌ తన కసరత్తును ముమ్మరం చేశారని అయితే రెండు, మూడు జిల్లాలకు సంబంధించిన వాటిపై ఇంకా లోతుగా అధ్యయనంచేసి ఆ జిల్లాల నుంచి ఎవరికి మంత్రులుగా చోటు కల్పించాలన్న అంశంపై ఒక నిర్ణయానికి వచ్చే అవకాశం ఉందని భావిస్తున్నారు.

పార్లమెంటరీ రాజకీయ కార్యదర్శులు

దేశంలోనే తొలిసారిగా ముఖ్యమంత్రి కార్యాలయ పర్యవేక్షణా బాధ్యతలను సహాయ మంత్రుల స్థాయిలో నియమించే నలుగురు పార్లమెంటరీ రాజకీయ కార్యదర్శులకు అప్పగించి వారికి ఒక్కో శాఖను కేటాయించేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. పార్లమెంటరీ రాజకీయ కార్యదర్శుల్లో నలుగురిని తన కార్యాలయంలో నియమించుకోవాలని కేసీఆర్‌ భావిస్తున్నారు.

ఇప్పటిదాకా ఏ రాష్ట్రంలోనూ ఈ తరహా విధానం అమల్లో లేదు. కేవలం జాతీయ స్థాయిలో ప్రధానమంత్రి కార్యాలయంలో వ్యక్తిగత, పాలనాపరమైన పనులను పర్యవేక్షించేందుకు ప్రత్యేకంగా ఓ మంత్రిని నియమిస్తూ వస్తున్న సంగతి తెలిసిందే. రెండోసారి సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన కేసీఆర్‌ సాధారణ పరిపాలనాశాఖతో పాటు కీలకమైన సాగునీటి పారుదలశాఖ, సమాచార పౌర సంబంధాలు, రెవెన్యూ, రిజిస్ట్రేషన్‌, ఎక్సైజ్‌, వాణిజ్య పన్నులశాఖలను ఇతర మంత్రులకు కేటాయించకుండా తానే స్వయంగా నిర్వహిస్తానని నిర?యించారు. ఈ మేరకు ఆయన సంకేతాలు కూడా ఇచ్చారు. సీఎంగా ఇటు ప్రభుత్వం, అటు పార్టీని నడిపించడంతో పాటు జాతీయ స్థాయిలో ఫెడరల్‌ ఫ్రంట్‌ను ఏర్పాటుచేసి క్రియాశీలక పాత్ర పోషించాలని నిర్ణయించిన నేపథ్యంలో తన కార్యాలయంలో నలుగురు పార్లమెంటరీ రాజకీయ కార్యదర్శులను నియమించి వారికి ఒక్కో శాఖను అప్పగించాలన్న ప్రతిపాదనకు వచ్చినట్టు ప్రగతి భవన్‌ వర్గాలు చెబుతున్నాయి. మంత్రులకు, సీఎం కార్యాలయంలో పనిచేసే ఉన్నతాధికారులకు, ముఖ్యమంత్రి నడుమ ఈ నలుగురు అనుసంధానకర్తలుగా పనిచేస్తారని తెలుస్తోంది. మంత్రివర్గ విస్తరణ పూర్తయ్యాక 15 నుంచి 18 మంది పార్లమెంటరీ రాజకీయ కార్యదర్శులను నియమించాలని ఇప్పటికే ఒక నిర్ణయానికి వచ్చిన కేసీఆర్‌ ఇందులో నలుగురిని తన కార్యాలయంలో నియమించుకోవాలని భావిస్తున్నారు.

గతంలో ఈ తరహా కార్యదర్శులను నియమించినప్పటికీ కొందరు హైకోర్టును ఆశ్రయించడంతో ప్రభుత్వ నిర్ణయాన్ని తప్పుబట్టింది. దీంతో అప్పట్లో నియమితులైన వారి  ఆరుగురు పార్లమెంటరీ కార్యదర్శులు తమ పదవులను కోల్పోవలసి వచ్చింది. ఈ దఫా న్యాయపరమైన చిక్కులు తలెత్తకుండా ముందస్తుగా ఏర్పాట్లు చేయాలని కేసీఆర్‌ న్యాయశాఖ, సాధారణ పరిపాలనాశాఖ అధికారులను ఆదేశించారు. అందరి సమన్వయంతో ఆర్డినెన్స్‌కు సంబంధించి ముసాయిదాను సిద్ధంచేసినట్టు తెలుస్తోంది. శాసనసభ సమావేశాలలోపు పార్లమెంటరీ కార్యదర్శుల నియామకాలకు సంబంధించి నిర్ణయం తీసుకుంటే ఆర్డినెన్స్‌ను తీసుకురావాలని లేనిపక్షంలో శాసనసభలో బిల్లు రూపంలో సభ ముందుకు తేవాలని భావిస్తున్నట్లు సమాచారం. పార్లమెంటరీ కార్యదర్శుల నియామకాలకు సంబంధించి కేసీఆర్‌ ఇప్పటికే గవర్నర్‌ ఇఎస్‌ఎల్‌ నరసింహన్‌ దష్టికి తీసుకువెళ్ళి ఈ పదవులకు ఉన్న ప్రాధాన్యతలను వివరించారని సీఎం కార్యాలయ వర్గాలు చెబుతున్నాయి. అవినీతిరహిత పాలనను అందిస్తామని ఇప్పటికే ఎన్నికల ప్రచార సభల్లో, పార్టీ కార్యక్రమాల్లో తరచూ ప్రకటించిన కేసీఆర్‌ తన కార్యాలయంలో పార్లమెంటరీ కార్యదర్శులను నియమించడం ద్వారా ఆయా శాఖలకు సంబంధించిన దస్త్రాలను త్వరితగతిన పరిశీలించి ఆమోదముద్ర వేసేందుకు అవకాశం ఉంటుందని భావిస్తున్నారు.