సినిమాల్లో హీరోలకు, హీరోయిన్లకు ఉన్న క్రేజీ పార్టీ నాయకులకు పెద్దగా ఉండదు. కాని నేడు పరిస్థితులు మారిపోయాయి. గతంలోలాగా హీరోలు, హీరోయిన్లు చెబితే ఓటు వేసే పరిస్థితులు నేడు కనిపించడం లేదు. దానికితోడు సినిమాల్లో మాత్రమే మీరు హీరోలు, హీరోయిన్లు. బయటకు వస్తే అందరిలోనూ మీరు ఒకరే అన్నట్లుగా పరిస్థితి మారిపోతోంది. 2000 సంవత్సరానికి పూర్వం రాజకీయ పార్టీలు సినిమా నటులకు టికెట్లు ఇస్తే, ఆ నటీనటులు గెలవడం గ్యారెంటీగా ఉండేది. దీంతో రాజకీయ పార్టీలు కూడా వారిని దువ్వడానికి ప్రాధాన్యత ఇచ్చేవి. దీని ఫలితంగానే రాజేష్ ఖన్నా, వినోద్ ఖన్నా, శత్రుఘ్న సిన్హా, రాజ్ బబ్బర్, ధర్మేంద్ర, హేమమాలిని, జయప్రద, గోవింద, జయా బచ్చన్ రాజకీయ ప్రవేశం చేసి దుమ్ము దులిపారు. అయితే ధర్మేంద్ర, గోవింద వంటి నటులు మొదటిసారి గెలిచినా.. రాజకీయాలు అర్థం కాక గందరగోళపడ్డారు. రాజ్ బబ్బర్, శత్రుఘ్న సిన్హా, హేమ మాలిని, జయా బచ్చన్ వంటి వారు మాత్రం ఒదిగిపోయారు.
రానురాను పరిస్థితులు మారిపోతూ వచ్చాయి. అలాగే సినీరంగంలో ఉన్నవారికి రాజకీయ రంగంలో ఇమేజ్ తగ్గిపోయింది. దీంతో సినిమా నటులు ప్రచారం చేసిన స్థానాల్లో గెలుస్తామనే నమ్మకం పార్టీల్లో రాన్రాను సడలి పోతోంది. అందుకనే ఈ ఎన్నికల్లో సినిమా వాళ్లతో ప్రచారం చేయించాలనే డిమాండ్ బాగా తగ్గిపోవడం కనిపించింది. సినిమా వాళ్లు ఉపన్యాసాలు ఇవ్వలేరని, ఓటర్లపై వారి ప్రభావం ఏమీ ఉండదని అంటున్నారు. సినిమా నటులపై ప్రజలకు కూడా నమ్మకం తగ్గిపోతోందని, వారేం చెబుతున్నారో దానికి కట్టుబడి ఉండడం లేదని అంటున్నారు. పార్టీల ప్రచారానికి సినిమా నటులు డబ్బులు తీసుకుంటున్నారన్న విషయం కూడా ప్రజలకు తెలిసిపోవడం కూడా ఒక కారణమని చెబుతున్నారు. ఒకప్పుడు సినీ గ్లామర్ అంటే మోజు ఉండేదని, అయితే వీరిప్పుడు టీవీల్లో, సోషల్ మీడియాలో ఇరవై నాలుగు గంటలూ కనిపిస్తుండడంతో ప్రజలు కూడా పెద్దగా పట్టించుకోవడంలేదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. తమ అభిమాన నటుడిని చూడడానికి గతంలో ప్రజలు గంటల తరబడి వేచి ఉండేవారు. ఇప్పుడా పరిస్థితి లేదంటున్నారు. రాజకీయాల్లో నిలబడాలంటే స్టార్డమ్ కన్నా సమస్యలపై అవగాహన కావాలని యూపీ కాంగ్రెస్ చీఫ్ రాజ్ బబ్బర్ అన్నారు. బబ్బర్ కేవలం ప్రచారానికే పరిమితం కాకుండా పార్టీ నిర్మాణం, వ్యూహ రచన వంటి వాటిలో ఆరితేరిపోయారు. ఇక హేమమాలిని, జయప్రద, జయాబచ్చన్ వంటి వారు కేవలం ప్రచారానికే పరిమితమవుతూ, వారి సొంత పార్టీ కార్యకలాపాలకు దూరంగా ఉంటారు. అయితే తారల మాటలకు పార్టీల్లో నేతలు పెద్దగా విలువ ఇవ్వరని, మీరు ప్రచారం చేస్తే మిగిలింది మేం చూసుకుంటామని అంటారని ఓ తార వాపోయింది. కేవలం తాము తారలం కావడంతోనే ఆ ఆకర్షణను పార్టీలు వాడుకుంటాయని, అంతకు మించి పార్టీకి తామేమీ కామని కూడా వారు పేర్కొంటున్నారు.