యుపిలో బిజెపికి సవాల్?

యుపిలో బిజెపికి సవాల్?

12-05-2019

యుపిలో బిజెపికి సవాల్?

కేంద్రంలో చక్రం తిప్పే అవకాశా న్ని అందిపుచ్చుకోవడంలో కీలక పాత్ర పోషించే ఉత్తరప్రదేశ్‌ రాష్ట్రంలో కమల దళానికి అడుగడుగునా ఇబ్బందులు ఎదురవుతున్నాయి. 2014తో పోలిస్తే ఉత్తరప్రదేశ్‌లో బీజేపీకి సానుకూల పరిస్థితులు లేవనే చెప్పాలి. నిరుద్యోగం, ధరల పెరుగుదల, కుల సమీకరణాలు, గోమాంస నిషేధం వంటివి కమలానికి కష్టాలు తెచ్చి పెట్టేలా ఉన్నాయి. ముఖ్యంగా ఎస్పీ- బీఎస్పీ -ఆర్‌జెడి మహాకూటమి బీజేపీకి పెను సవాల్‌ విసురుతోంది. తొలి రెండు విడతల వరకు మహా ఘట్‌బంధన్‌ పెద్దగా ప్రభావం చూపకపోయినా ఆ తర్వాత మాత్రం కూటమి ప్రభావం స్పష్టంగా కనిపిస్తోంది. అటు కేంద్రంలో ఐదేళ్ల నరేంద్ర మోడీ పరిపాలన, ఇటు రాష్ట్రంలో రెండేళ్ల పాటు యోగి ఆదిత్యనాథ్‌ పాలనా వ్యవహారాలు ఈసారి ఎన్నికలను తీవ్రంగా ప్రభావితం చేయబోతున్నాయి.

దేశంలోనే అత్యధికంగా 80 లోక్‌సభ నియోజక వర్గాలు కలిగిన ఉత్తరప్రదేశ్‌లో ఏడు దశల్లో ఎన్నికలు జరుగుతున్నాయి. 2014లో సొంతంగానే బీజేపీ 71 స్థానాలను, మిత్రపక్షం అప్నాదళ్‌ 2 స్థానాలను కైవసం చేసుకున్నాయి. ఎస్పీ ఐదు సీట్లు దక్కించుకోగా, బీఎస్పీకి ఒక్క స్థానం కూడా దక్కలేదు. కాంగ్రెస్‌ 2 స్థానాలకే పరిమితమైంది. గత ఎన్నికల్లో బీజేపీ అగ్రనాయకత్వం యూపీపై ప్రత్యేక దష్టి సారించి విజయ బావుటా ఎగుర వేసింది. ఈసారి కూడా ఆచితూచి అడుగులు వేస్తున్నా మహాకూటమి పెనుసమస్యగా మారింది. కలిసి ఉంటే కలదు సుఖం, ఐకమత్యమే మహాబలమంటూ కూటమిగా ఏర్పడ్డ సమాజ్‌వాదీ, బచహుజన్‌ సమాజ్‌వాదీ, రాష్ట్రీ య లోక్‌దళ్‌ బీజేపీని ధీటుగా ఎదుర్కొనేందుకు పావులు కదుపుతున్నాయి. సమైక్యంగా తమ సత్తా చాటేందుకు వ్యూహాలు రచిస్తున్నాయి. తొలుత పెద్దగా జనాన్ని ఆకట్టుకో లేకపోయినా తరువాత తమ బలాన్ని చూపించడం చేశాయి. కూటమి ఐక్యతపై మొదట సంప్రదాయవాదులు పెదవి విరిచారు. దశాబ్దాల విబేధాలు వీడి మొయిన్‌పురిలో ములాయం సింగ్‌, మాయావతి ఒకే వేదిక పంచుకున్నారు. ఈ సమావేశంతో ఎస్పీ-బీఎస్పీ శ్రేణులకు బలమైన సందేశం ఇచ్చినట్లయింది. ఆ తర్వాత విడతల్లో మహా కూటమి సామాజిక సమీకరణాలు బలోపేతమయ్యాయి. ఎస్పీ వెంట యాదవులు, ముస్లిం మైనారిటీలు ఉండగా, బీఎస్పీ వెంట దళితులు, ఆర్‌జెడి వెంట జాట్లు ఉన్నారు. ఈ సామాజికవర్గాల సంఖ్యాబలం ఎక్కువగా ఉన్న చోట బీజేపీకి ఎదురుగాలి, కూటమికి అనుకూల పవనాలు వీస్తున్నాయి.