కేంద్ర రాజకీయాల్లో వెలుగుతున్న బాబు

కేంద్ర రాజకీయాల్లో వెలుగుతున్న బాబు

12-05-2019

కేంద్ర రాజకీయాల్లో వెలుగుతున్న బాబు

ఆంధ్రప్రదేశ్‌లో పరిస్థితులు ఎలా ఉన్నా దేశ రాజకీయాల్లో మాత్రం చంద్రబాబు ప్రభ వెలిగిపోతోంది. కేంద్రంలో వేగంగా మారుతున్న పరిణామాలు జాతీయ రాజకీయాల్లో చంద్రబాబునాయుడుకు సానుకూలంగా పరిణమిస్తున్నాయి. దేశంలో ప్రధాని పదవికి మోడీతో సరితూగగల నాయకుడు మరెవరూ కనిపించడంలేదు. ఎన్‌డిఎ కూటమిలో కూడా మోడీ పట్ల విముఖత పెరుగుతోంది. ఇక ప్రతిపక్ష యుపిఎ కూటమి మోడిని దింపడమే లక్ష్యంగా పని చేస్తోంది. అలాగని యుపిఎ కాంగ్రెస్‌ నాయకత్వాన్ని ఆమోదించలేకపోతోంది. రాహుల్‌గాంధీని ప్రధానిగా ఊహించలేకపోతోంది. మోదీకి ప్రత్నామ్నాయంగా ఎవరన్నదానిపై నాయకుల్లో చర్చ జరుగుతోంది. మరోవైపు దేశంలోని ప్రాంతీయ పార్టీల సీనియర్‌ నాయకులంతా వయోభారంతో బాధపడుతున్నారు. ఈ దశలో అటు ఉత్తరాది, ఇటు దక్షిణాది రెండింటిని ప్రభావితం చేయగలిగే నాయకుడు చంద్రబాబు అవుతారని పరిశీలకులు అంచనాలేస్తున్నారు.

ప్రస్తుతం మోడీని నేరుగా ఢీ కొట్టగలిగే సామర్ద్యమున్న నాయకులెవరూ లేరు. ప్రాంతీయ పార్టీలే కాదు.. జాతీయ పార్టీల్లోనూ అంతటి సమర్ధులు కనిపించడంలేదు. మోడీతో ఎన్ని విబేధాలున్నా నేరుగా ఆయనపై విమర్శలు గుప్పించే ధైర్యం కూడా ఎవరికీలేదు. మోడీకి ప్రత్యామ్నాయమే కాదు. కనీసం ఆ దిశగా ఆలోచించగలిగే ధైర్యాన్ని కూడా ఎవరూ ప్రదర్శించలేకపోతున్నారు. దీంతో 2019ఎన్నికల లెక్కింపు ప్రక్రియ అనంతరం విపక్షాలకు సమర్ధుడైన నాయకుడు అవసరం. ఈ విషయాన్ని చంద్రబాబు ఏడాది ముందే గుర్తించారు. మోడీకి ప్రత్యామ్నాయ నాయకత్వం అందుబాటులో లేదని తేల్చుకున్నారు. ఆ లోటును తానే భర్తీ చేయాలని నిర్ణయించుకున్నందునే ఏడాది క్రితమే ఆయన ఎన్‌డిఎకు దూరం కావడంతోపాటు అంచెలంచెలుగా మోడీకి ప్రధాన శతవుగా మారారని పరిశీలకులు పేర్కొంటున్నారు. దేశంలో మాయావతి, ములాయంసింగ్‌, మమత, నవీన్‌పట్నాయక్‌, లాల్‌ప్రసాద్‌, పినరై విజయన్‌, స్టాలిన్‌ వంటి బలమైన ప్రాంతీయ పార్టీల నాయకులంతా మోడీ వ్యతిరేకవర్గంలోనే ఉన్నారు. కానీ వీరెవరూ సంధించని స్థాయిలో చంద్రబాబు మోడిపై విమర్శలు గుప్పిస్తున్నారు. ఆయన చేసే ప్రతి పనిలోనూ రాజకీయ ప్రయోజనాల్ని ఎత్తిచూపుతున్నారు.  సర్జికల్‌ స్ట్రైక్స్‌ నుంచి అన్నింట్లోనూ మోడీ పడుతున్న ప్రచారపటాటోపాన్ని ప్రజలకు విప్పిచెబుతున్నారు. ఇలా ఇప్పుడు జాతీయస్థాయిలో మోడిని నేరుగా ఢీ కొట్టగలిగే సామర్ధ్యమున్న ఒకే ఒక్క నాయకుడిగా చంద్రబాబు గుర్తింపుపొందారు.

కాంగ్రెస్‌ కూడా తనవైపు ఉండేలా చంద్రబాబు చేసుకోగలిగారు. అవకాశం దొరికితే కాంగ్రెస్‌ కూడా తన ప్రదానమంత్రి అభ్యర్థిత్వానికి మద్దతు ఇచ్చేలా చక్రం తిప్పారు. దేశంలో చురుగ్గా ఉన్న రాజకీయ నాయకుల్లో తానే సీనియర్‌నని పలు సందర్భాల్లో ప్రకటించారు. మోడి గుజరాత్‌ ముఖ్యమంత్రి కాకముందే అంతకంటే అతిపెద్ద రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్‌కు తాను ముఖ్యమంత్రి అయిన విషయాన్ని ఆయన పదే పదే గుర్తు చేశారు. జాతీయ రాజకీయాల్లో తాను కీలకపాత్ర పోషించానన్నారు. ప్రధానుల్ని సైతం తానే సూచించిన విషయాన్ని ప్రస్తుత తరానికి చంద్రబాబు గుర్తు చేశారు. అలాగే తనకంటే అనుభవంలో, వయసులో కూడా తక్కువైనప్పటికీ కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాహుల్‌ను కలిశారు. రాహుల్‌ కూడా తనవైపు నుంచి ఇదే వ్యూహాన్ని ఇక్కడ అమల్లో పెట్టడంతో చంద్రబాబుకు మార్గం మరింత సుగమమౌతోంది. రాహుల్‌ సూచనల మేరకే చంద్రబాబు దేశంలోని వివిధ రాష్ట్రాల్లో ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు. అక్కడ తనకు లభిస్తున్న మద్దతును ఆయన అంచనావేసుకుంటున్నారు. లెక్కింపు ప్రక్రియ అనంతరం పార్టీలు, కూటములు కంటే మోడీ, చంద్రబాబు అనుకూల, వ్యతిరేక వర్గాలుగా పార్టీలు కొలువుదీరే అవకాశాలు స్పష్టమౌతున్నాయి. ఏదీ ఏమైనా చంద్రబాబుకు కేంద్రంలో సానుకూల పరిస్థితులు ఉన్నాయనడంలో మాత్రం ఏమాత్రం సందేహం లేదు.