ఎపికి ఇప్పుడు మీ సాయం అవసరం- కోడెల

ఎపికి ఇప్పుడు మీ సాయం అవసరం- కోడెల

24-04-2017

ఎపికి ఇప్పుడు మీ సాయం అవసరం- కోడెల

విదేశాల్లో ఉన్న ఆంధ్రులు తన జన్మభూమి గురించి ఆలోచిస్తే సమస్యలకు పరిష్కారాలు వాటంతటవే లభిస్తాయని ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర శాసనసభాపతి కోడెల శివప్రసాదరావు అన్నారు. అమెరికా పర్యటలో ఉన్న ఆయన షార్లెట్‌ నగరవాసులతో భేటీ అయ్యారు. ఆంధ్రప్రదేశ్‌ నిర్మాణంలో ప్రతి ఒక్కరు భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. ఆంప్ర్రదేశ్‌ అభివృద్ధికి ఎవరెలా సహకరించవచ్చో  సోదాహరణంగా వివరించారు. గ్రామాల్లో రహదారులు, మరుగుదొడ్లు, విద్యుత్‌, డిజిటల్‌ తరగతులు, గ్రంథాలయాలు వంటి వాటికి ఎన్నారైలు విరాళాలు ఇవ్వాలని ఆయన కోరారు. మీరిచ్చే విరాళాలలో ప్రతి రూపాయి సద్వినియోగం అయ్యేలా తాను చూస్తానని కోడెల హామీ ఇచ్చారు. ఏపీ ప్రజలకు ధైర్యం, అనుభవం ఉన్నాయని, కావాల్సింది వనరులు మాత్రమేనని అన్నారు. షార్లెట్‌ నగరంలో ఇంతమంది విదేశాంధ్రులు ఉండటం ఆనందంగా ఉందని చెప్పారు. కోడెల వినతిపై స్పందించిన విదేశాంధ్రులు ఏపీలో 50 పాఠశాలల్లో ఈ-తరగతి గదుల ఏర్పాటుకు రూ.40 లక్షలు అందించేందుకు సంసిద్ధత వ్యక్తం చేశారు. అమెరికాలో ఏపీ రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిది కోమటి జయరాం మాట్లాడుతూ ఏపీలో పెట్టుబడులకు ఇప్పటికే కొందరు సిద్ధమయ్యారని, త్వరలోనే మరికొందరు ముందుకు వస్తారన్న నమ్మకం తనకు ఉందని చెప్పారు. ఈ కార్యక్రమంలో గంగాధర్‌ నాదెళ్ళ, కేశవ్‌ వట్టిగుంట, పట్టాభి కంఠమనేని, సతీష్‌ దండమూడి, లోహిత్‌ నన్నపనేని, నాగ పంచుమర్తి, మల్లి వేమన, రామ్‌ తదితరులు పాల్గొన్నారు.