అయుత చండీయాగానికి శరవేగంగా ఏర్పాట్లు

అయుత చండీయాగానికి శరవేగంగా ఏర్పాట్లు

28-04-2017

అయుత చండీయాగానికి శరవేగంగా ఏర్పాట్లు

అయుత చండీయాగం నిర్వహణకు ఏర్పాట్లు చకచకా పూర్తవుతున్నాయి. యాగాశాల నిర్మాణం పూర్తయింది. ఇతర అలంకరణల పని జరుగుతున్నది.  నేటి నుంచి అయుత చండీ పునశ్చరణ, మహాయాగ వైదిక కార్యక్రమాలు మొదలవుతాయి. నభూతో సభవిష్యతి అన్న రీతిలో అయుత చండీయాగం నిర్వహణకు యాగక్షేత్రం సిద్దమైంది. శృంగేరీ పీఠం ప్రధాన నిర్వహకుల పర్యవేక్షణలో ఈ ప్రాంగణమంతా ఆధ్యాత్మికత ఉట్టిపడే విధంగా పలువురు నిష్టాతులు అహర్నిశలూ శ్రమించారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌ సతీసమేతంగా పలుమార్లు ఈ ప్రాంగణాన్ని సందర్శించిన ఏర్పాట్ల తీరుతెన్నులు పరిశీలించారు. రాష్ట్రంలోనూ దేశ్యవ్యాప్తంగా కూడా ఆయుత చండీయాగం ఆసక్తిని రేకెతిస్తున్నది.

ఈ నేపథ్యలో యాగానికి భారీ సంఖ్యలో సందర్శకులు తరలివస్తారని భావిస్తున్నారు. వారికి ఎలాంటి ఆటంకాలు ఇబ్బందులు తలెత్తకూడదన్న ముఖ్యమంత్రి ఆదేశంతో ఆ మేరకు పటిష్ఠమైన  ఏర్పాట్లు చేస్తున్నారు. అయుత చండీయాగ నిర్వహణతో ఎర్రవల్లి  గ్రామం పేరు ఇప్పుడు రాష్ట్రం వ్యాప్తంగా ప్రాచుర్యం పొందింది. అయుత చండీయాగం నిర్వహణతో ఎర్రవల్లి పవిత్ర క్షేత్రంగా మారింది. సుమారు 40 ఎకరాల విస్తీర్ణంలో యాగశాల ప్రాంగణాన్ని తీర్దిదిద్దారు. ఇందులో మహాయాగ నిర్వహణకు 101 హోమగుండాలు, రాజశ్యామల, మహారుద్ర, అయుత మహాచండీయాగాలకు వేర్వేరుగా యాగశాలలు ఏర్పాటు చేశారు.

మహిళలకు కుంకుమార్చన కోసం ప్రత్యేక ప్రాంగణం నిర్మించారు. వివిధ రాష్ట్రాల నుంచి తరలివచ్చే రుత్విక్కులకు ప్రత్యేకంగా వసతి ఏర్పాట్లు చేశారు. మరోవైపు రాష్ట్రపతి, గవర్నర్లు, ముఖ్యమంత్రుల బసకు విడిగా కుటీరాలు ఏర్పాటు చేశారు. వీవీఐపీలకు రాకకోసం హెలీప్యాడ్‌లు కూడా సిద్దం చేశారు. ప్రతిరోజు సుమారు 50 వేల మంది తరలివచ్చినా ఇబ్బంది లేకుండా యాగాశాలను దర్శించుకునే విధంగా బారికేడ్లు నిర్మించారు. వారికి లడ్డూ ప్రసాదంతోపాటు భోజన ఏర్పాట్లు కూడా చేపట్టారు. అయుత చండీయాగం ఉదయం 7 గంటలలకు ప్రారంభమై మధ్యాహ్నం వరకు జరుగుతుంది. సాయంత్రం వేళల్లో ఆధ్యాత్మిక కార్యక్రమాలు ఏర్పాటు చేశారు. ఐదు రోజుల పాటు మహిళలకు కుంకుమార్చన కార్యక్రమానికి యాగశాలకు పక్కన ప్రత్యేక షామియానాలను ఏర్పాటు చేశారు. అక్కడే ఆధ్యాత్మిక ప్రవచనాలు, ధార్మిక ప్రసంగాలు, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తారు.

ముఖ్యమంత్రి కేసీఆర్‌ ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తున్న ఈ అయుత చండీయాగం కోసం ఆరు రాష్ట్రాలు ఉత్తరప్రదేశ్‌, మహారాష్ట్ర, తమిళనాడు, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ, నుంచి వేద బ్రాహ్మణులు వస్తున్నారు. రుత్విక్కులు యాగస్థలానికి చేరుకున్నారు. యాగం పూర్తిగా నియమనిష్ఠలతో నిర్వహిస్తారు. ఈ యాగం దిగ్విజయం కావడానికి ప్రతి ఒక్కరూ సహకరించాలి.