ఇల్లినాయిలోని చికాగోలో జూలై 1 నుంచి 3వ తేదీ వరకు జరగనున్న అమెరికా తెలుగు సంఘం (ఆటా) వేడుకలకు అవసరమైన ఏర్పాట్లను రెడీ చేశారు. చికాగోలోని డొనాల్డ్ స్టీఫెన్స్ (రోజ్మాంట్) కన్వెన్షన్ సెంటర్లో ఈ వేడుకలు జరగనున్నాయి. తెలుగు జాతి సంప్రదాయాన్ని, విశిష్టతను, మాతృభాషను, మమకారాన్ని నాలుగు చెరగులా ప్రకాశింపజేసేలా ఈ వేడుకలు జరగనున్నాయి. రంగుల హరివిల్లును మరిపించే అలంకారాలు, అందాలతో రాజిల్లే షాపింగ్ ఏరియా, యువతరానికి ఉపయోగపడేలా కార్యక్రమాలు, కలయికలు, ప్రసంగాలను చికాగోలో జరిగే కాన్ఫరెన్స్‌లో చూడవచ్చు. సాహిత్య, సంగీత, రాజకీయ, యోగ, మెడిటేషన్, ఆధ్యాత్మిక, ఆరోగ్య, యువజన సమ్మేళనాలతో ఈ మహాసభలు విరాజిల్లనున్నాయి. వీటితోపాటు అమ్మ చేతి రుచిని మరిపించేలా విందు భోజనం, అల్పాహారాలు అనుకోని పరిచయాలు, ఆషామాషీ కబుర్లతో ఆకట్టుకునేలా ఏర్పాట్లు చేస్తున్నారు. కాన్ఫరెన్స్‌ను పురస్కరించుకుని ఎన్నో కార్యక్రమాలను ఏర్పాటు చేశారు.
సాహిత్య, సంగీత, రాజకీయ, యోగ, మెడిటేషన్, ఆధ్యాత్మిక, ఆరోగ్య, యువజన సమ్మేళనాలతో ఈ మహాసభలు ఆకట్టుకోనున్నాయి. సిల్వర్ జూబ్లి వేడుకల్లో ఎక్కువ మంది పాల్గొనేలా చేయాలన్న ఉద్దేశ్యంతో అమెరికా నలుమూలలా పలు పోటీలను ఆటా నిర్వహించింది. మిస్టర్ అండ్ మిస్ పేరుతో అందాల పోటీలను ఆటా ఏర్పాటు చేసింది. సోలో సింగింగ్, సోలో డ్యాన్స్, గ్రూపు డ్యాన్స్ పోటీలను వివిధ నగరాల్లో నిర్వహించి ఫైనల్ పోటీలను ఆటా కాన్ఫరెన్స్ వేదికపై నిర్వహిస్తున్నారు. ఆటా టాలెంట్ పేరుతో దుబ్మాష్, వాద్యకచేరి, షార్ట్‌ఫిల్మ్స్, మిమిక్రీ, స్టాండప్ కామెడి, మ్యాజిక్, ఏకపాత్రాభినయం, వెంట్రిలాక్విజంలో పోటీలను కల్చరల్ కార్యక్రమాలతోపాటు, బిజినెస్ సమావేశాలు, బిజినెస్ ఐడీయా పోటీలు, అలూమ్ని సమావేశాలు, రాజకీయ చర్చాకార్యక్రమాలు, సినీతారలతో ముచ్చట్లు ఇలా ఎన్నోరకాల కార్యక్రమాలతో ఆటా సిల్వర్జూబ్లి వేడుకలు అందరినీ ఆకట్టుకునేలా ఏర్పాట్లు చేశారు.
మహాసభల్లో పాల్గొనేందుకు ఎంతోమంది రాజకీయ నాయకులు తెలంగాణ, ఆంధ్ర ప్రాంతం నుంచి ఇక్కడకు వస్తున్నారు. తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్‌రావు, కేంద్రమంత్రి ఎం. వెంకయ్యనాయుడు ఈ వేడుకలు వస్తున్నారని ఆటా నాయకులు పేర్కొంటున్నారు. వీరితోపాటు తెలంగాణ నుంచి మంత్రులు, ఎమ్మెల్యేలు వస్తున్నారు. మరోవైపు ఆంధ్రప్రదేశ్ నుంచి కూడా మంత్రులు, ఎమ్మెల్యేలు మహాసభలకు హాజరవుతున్నట్లు సమాచారం.