‘తానా’ సేవలు ప్రశంసనీయం - మంత్రి జగదీశ్వర్‌

‘తానా’ సేవలు ప్రశంసనీయం - మంత్రి జగదీశ్వర్‌

03-05-2017

‘తానా’ సేవలు ప్రశంసనీయం - మంత్రి జగదీశ్వర్‌

అమెరికాలో మూడు దశాబ్దాలకుపైగా తెలుగు కమ్యూనిటీకి విస్తృతంగా సేవలందిస్తూ, మరోవైపు తెలుగు భాష, తెలుగు కళలు, తెలుగు సంస్కృతి విస్తరణకు కృషి చేస్తున్న ఉత్తర అమెరికా తెలుగు సంఘం మాతృరాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ రాష్ట్రాలలో చేస్తున్న కార్యక్రమాల్లో భాగంగా హైదరాబాద్‌లో డిసెంబర్‌ 11వ తేదీన నిర్వహించిన ‘చైతన్య స్రవంతి’ కార్యక్రమం విజయవంతమైంది. అమెరికా నుంచి వచ్చిన తానా నాయకులతోపాటు తెలంగాణ రాష్ట్ర మంత్రులు, ఎమ్మెల్యేలు, తానా అభిమానులు, కవులు, కళాకారుల ఈ వేడుకలకు హాజరయ్యారు. వేడుకలు జరిగిన భారతీయ విద్యాభవన్‌ ఆడిటోరియం జనంతో క్రిక్కిరిసిపోయింది.

ఈ సందర్భంగా వేడుకలకు ముక్య అతిధిగా వచ్చిన తెలంగాణ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి జగదీశ్వర్‌ రెడ్డి మాట్లాడుతూ, రెండు రాష్ట్రాలుగా విడిపోయిన తరుణంలో తెలుగు ప్రజల్లో సోదరభావాన్ని పెంపొందించేందుకు తానా వారధిగా పనిచేయాలని కోరారు. మాృతరాష్ట్రాల ప్రగతికోసం తానా చేస్తున్న కార్యక్రమాలు ప్రశంసనీయమన్నారు. కళాకారులను ప్రభుత్వంతోపాటు ఇలాంటి సేవా సంఘాలు కూడా ఆదుకుంటే కళలు అంతరించిపోకుండా ఉంటాయన్నారు. విద్యార్థులకు ఉచితంగా సంగీతాన్ని నేర్పుతున్న లిలిట్‌ మ్యుజిషియన్స్‌ అకాడమీకి స్థలం కేటాయించే విషయాన్ని ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్‌రావు దృష్టికి తీసుకెళ్తానని ఆయన హామి ఇచ్చారు. తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే ఎర్రబెల్లి దయాకర్‌రావు మాట్లాడుతూ, కళాకారులను ప్రోత్సహించాల్సిన బాధ్యత రెండు రాష్ట్ర ప్రభుత్వాలపై ఉందని చెప్పారు. ఎన్టీఆర్‌ హయాంలో వృద్ధ కళాకారులకు గౌరవ వేతనం ఇచ్చారని, దీనిని పునరుద్ధరించాలని ఆయన కోరారు. సిపిఐ తెలంగాణ నాయకుడు చాడ వెంకట్‌ రెడ్డి మాట్లాడుతూ, వృత్తి కళాకారులు ప్రస్తుతం దుర్భరమైన జీవనాన్ని సాగిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

ఈ వేడుకల్లోనే తానా అధ్యక్షుడు మోహన్‌ నన్నపనేని లిలిల్‌ మ్యూజిషియన్స్‌ అకాడమీ భవన నిర్మాణం కోసం సంస్థ వ్యవస్థాపక అధ్యక్షుడు రామాచారికి 45 లక్షల రూపాయల చెక్కును బహూకరించారు. తానా తరపున రెండు రాష్ట్రాలలోనూ సేవా కార్యక్రమాలను నిర్వహిస్తున్నామని చెప్పారు. తానా ఆధ్వర్యంలో వివిధ చోట్ల వైద్యశిభిరాలను నర్సాపురంలో బాపు విగ్రహాన్ని ఆవిష్కరిస్తున్నట్లు చెప్పారు. 19న నెల్లూరులో జానపద కళా ఉత్సవాలు, 21న విజయవాడలో జానపద కళాకారుల సమావేశాలను నిర్వహిస్తున్నట్లు చెప్పారు. పలువురు కవులను, కళాకారులను ఈ సందర్భంగా తానా ఆధ్వర్యంలో ఘనంగా సత్కరించారు.  డా. పి. ఆలేఖ్య (నృత్యం), శ్రీమతి నిత్యసంతోషిణి (సంగీతం), డా. చుక్కా సత్తయ్య (ఒగ్గుకథ), జె.కె. భారవి (సాహిత్యం), అంపశయ్య నవీన్‌ (సాహిత్యం), బివిఆర్‌ చారి (శిల్పం), మువ్వ శ్రీనివాస్‌లను సన్మానించారు.

ఈ కార్యక్రమంలో తానా మాజీ అధ్యక్షులు జయరామ్‌ కోమటి, ప్రసాద్‌ తోటకూరతోపాటు కార్యదర్శి సతీష్‌ వేమన తానా 20వ మహాసభల కన్వీనర్‌ గంగాధర్‌ నాదెళ్ళ, మాజీ అధ్యక్షురాలు పద్మశ్రీ ముత్యాల, తానా ట్రెజరర్‌ మధు తాతా, అంజయ్య చౌదరి లావు, శ్రీనివాస్‌ గోగినేని, విజయ ఆసూరి, మురళీ వెన్నం, శారద ఆకునూరి, వంశీరామరాజు, జయనారాయణ కురేటి, తానా చైతన్య స్రవంతి కో ఆర్డినేటర్‌ ప్రసాద్‌ గారపాటి తదితరులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు.

\r\n\r\n