ఆపన్నులను ఆదుకుంటున్న 'నక్షత్ర ఫౌండేషన్'

ఆపన్నులను ఆదుకుంటున్న 'నక్షత్ర ఫౌండేషన్'

05-07-2018

ఆపన్నులను ఆదుకుంటున్న 'నక్షత్ర ఫౌండేషన్'

తెలుగు సినిమాల్లో సినీ నటిగా పేరు తెచ్చుకున్న మాధవీలతకు చిన్నప్పటి నుంచే ఇబ్బందులు పడుతున్నవారికి ఏదైనా సహాయం చేయాలనే కోరిక బలంగా ఉండేది. నచ్చావులే సినిమాతో సినీరంగంలో అడుగుపెట్టిన మాధవీలత ఎంతోమంది అభిమానులను సంపాదించుకుంది. కాకపోతే ఎంతమంది అభిమానులను సంపాదించుకున్నామన్నది ముఖ్యం కాదని, ఎంతమందికి సాయపడ్డామన్నదే ముఖ్యమని ఆమె అంటోంది. నటన మాత్రమే కాకుండా, సమాజం కోసం ఏదైనా మంచి చేయాలన్న కోరిక ఆమెను 'నక్షత్ర ఫౌండేషన్‌'ను స్థాపించేలా చేసింది.

బడి కి వెళ్లే వయసు నుండి షూటింగ్‌ కి వెళ్లే వయసు వరకూ తన చుట్టూ ఉన్న ప్రపంచాన్ని గమనిస్తూ తనలో కలిగిన ఆలోచనలను స్నేహితులతో,  కుటుంబ సభ్యులతో ఆమె పంచుకునేవారు. తన చుట్టూ ఉన్న సమాజంలో జరిగే దారుణాలు, ఎందరో ఎదుర్కొనే సమస్యలు ఆమెను సోషియాలజీ కోర్సును చేసేలా ప్రేరేపించాయి. దానివల్ల ప్రజల సమస్య పట్ల , సమాజం పట్ల ఒక అవగాహన కలుగుతుందని ఆమె భావించింది. తరువాత లండన్‌ లో ఫ్యాషన్‌ డిజైనింగ్‌ కోర్స్‌ చేసేటప్పుడు ఆదరణకి నోచుకోని వారికి ఏమీ చేయలేకపోతున్నాననే భావన ఆమెలో ఎక్కువగా కలిగింది. ఎలాగైనా తన ఆలోచనలకి ఒక రూపం తెచ్చి, అనాధలకి - ఆదరణ కరువైన వారికి అండగా నిలవాలని గట్టిగా నిర్ణయించుకుంది.

లండన్‌ నుండి ఇండియా కి తిరిగొచ్చిన కొత్తలో, తన స్నేహితురాలితో కలిసి రోడ్డు మీద ఇడ్లీబండి దగ్గర అల్పాహారం తీసుకుంటున్నప్పుడు ఓ సంఘటన జరిగింది. అక్కడికి ఓ చిన్న పిల్లవాడు వాళ్ళ దగ్గరకొచ్చి డబ్బులు అడిగాడు. కానీ, అతనిని చూసి నీకు డబ్బులుకావాలా తినడానికి తిండి కావాలా అని అడిగింది. అక్కా తనకు డబ్బులు వదు అనడంతో అతడిని లోపలికి తీసుకెళ్ళి కావాల్సింది పెట్టించింది. ఆ అబ్బాయి తింటున్నప్పుడు అతని కళ్ళలో కనిపించిన ఆనందం చూసి మాధవీలత మరింత సంతృప్తిని పొందింది. అప్పుడే తన ఆలోచనలను కార్యరూపంలో పెట్టాలని నిర్ణయించుకుంది.  

సరిగ్గా నెల తరువాత తను - తన ప్రాణ స్నేహితురాలు హరిత ఒకసారి చెన్నైకి ప్రయాణిస్తుండగా ఇద్దరి మధ్య జరిగిన సంభాషణలోనే ''నక్షత్ర'' పుట్టింది. నిజానికి ఇలా ఒక ఫౌండేషన్‌ ఏర్పాటు చేయాలని, దాని ద్వారా సేవ చేయాలనే ఆలోచన అప్పటికి లేదు. కానీ, ఆ క్షణం వచ్చిన ''నక్షత్ర ఫౌండేషన్‌'' ఆలోచనను ఆమె తన ఫేస్‌బుక్‌ లో ఉంచినప్పుడు, అభిమానులు, శ్రేయోభిలాషులు , స్నేహితుల దగ్గర నుండి రెండు రోజుల్లోనే అనూహ్య స్పందన వచ్చింది.  కొంతమంది కొన్ని సందేహాలు వెలిబుచ్చారు. వారికి  సమాధానం చెప్పింది. అయితే , చాలామంది ఉత్సాహపరిచినా, కొంతమంది నీకెందుకొచ్చిన గొడవ ఇదంతా అంటూ నిరుత్సాహపరిచారు. కొంతమంది ఏకంగా ఇలాంటి పనులు తలకెత్తుకుంటే దెబ్బ తింటావు అని కూడా ఆమెను హెచ్చరించారు.

కానీ, స్వతహాగా అనుకున్నది ఎలాగైనా సాధించాలన్న మొండిరకం కావడంతో.. వారి మాటలను ఆమె ఖాతరు చేయలేదు. తద్వారా కొంతమంది స్నేహితులను ఆమె దూరం చేసుకోవలసి వచ్చింది. మరికొంతమంది అయితే, వాళ్ళనెక్కడ  సహాయం అడుగుతుందో అని మొహం చాటేశారు.  కానీ, తాను ఏర్పరుచుకున్న లక్ష్యం ముందర ఇవన్నీ చాలా చిన్న సమస్యలుగా ఆమెకు అనిపించింది. నా మంచి-చెడు, కష్టం-సుఖం అన్నింట్లో.. అన్ని సందర్భాల్లో నాతో తోడుగా ఉండే స్నేహితులు చాలామంది ఉన్నారు. అందుకే, నాకు అవసరం అనుకున్నప్పుడు నన్ను వదిలేసి వెళ్ళిన వాళ్ళని దూరం పెట్టేసి... నాకు తోడు నీడగా ఉంటూ, నిజంగా సేవ చేయాలని ముందుకొచ్చిన స్నేహితులు హరిత, శీను, అన్వేష్‌, నవీన్‌ మరియు కొంతమంది సన్నిహితులతో కలిసి 27 జూన్‌ న మొదటి సమావేశం ఏర్పాటు చేసుకుంది. ఎన్ని అడ్డంకులు ఎదురైనా, ఎన్ని కష్టాలు అనుభవించైనా సరే నక్షత్ర ఫౌండేషన్‌ ని ముందుకి తీసుకెళ్లాలి అని, ఆపన్నులకి  సహాయం అందించి తీరాలని ఆ సమావేశం లో ధఢంగా నిర్ణయించుకుంది. నక్షత్ర ఫౌండేషన్‌ ద్వారా ఎన్నో కార్యక్రమాలను చేపట్టింది. ఇటీవలనే నక్షత్ర ఫౌండేషన్‌ 6వ వార్షికోత్సవ వేడుకలను వృద్ధాశ్రమంలో ఘనంగా జరుపుకుంది. ఈ సందర్భంగా మాధవీలత స్వయంగా వృద్ధులకు స్వీట్లను, ఆహారాన్ని అందించింది. వారితో కలిసి డ్యాన్స్‌లను కూడా చేసి వారిని ఆనందింపజేసింది.

నక్షత్ర ఫౌండేషన్‌ ద్వారా ఎన్నో కార్యక్రమాలను మాధవీలత చేపట్టింది. బ్లడ్‌ డొనేషన్‌, గ్రామీణ ప్రాంతాల్లో వైద్యసేవలు, సెలవురోజు వృద్ధులతో ఆనందంగా గడపడం వంటి కార్యక్రమాలను మాధవీలత చేస్తోంది.

ఈ నక్షత్ర ఫౌండేషన్‌ ద్వారా మరిన్ని కార్యక్రమాలు మరిన్నిచోట్ల చేయాలని మాధవీలత అనుకుంటోంది. అందుకు తగ్గట్టుగా విరాళాలను సేకరించాలని కూడా భావిస్తోంది. ఎవరైనా తన ఫౌండేషన్‌కు విరాళాలను అందించాలని అనుకుంటే ఈ కింది అకౌంట్‌కి విరాళాలను పంపించవచ్చని మాధవీలత చెబుతోంది.

Bank Details:

A/C NO. 915020012005829 IFSE: UTIB0000030 AXIS BANK

 

Click here for Photogallery