డిజిటల్ తరగతుల ఏర్పాటులో ఎన్నారైల సేవలు ప్రశంసనీయం - సిఎం

డిజిటల్ తరగతుల ఏర్పాటులో ఎన్నారైల సేవలు ప్రశంసనీయం - సిఎం

10-08-2018

డిజిటల్ తరగతుల ఏర్పాటులో ఎన్నారైల సేవలు ప్రశంసనీయం - సిఎం

ఆంధ్రప్రదేశ్‌లోని ప్రభుత్వ పాఠశాలల్లో డిజిటల్‌ తరగతుల ఏర్పాటులో ఎపి జన్మభూమి ఆధ్వర్యంలో ఎన్నారైలు చేస్తున్న కృషిని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రశంసించారు. డిజిటల్‌ తరగతుల ఏర్పాటును గిరిజన ప్రాంత పాఠశాలల్లో కూడా ముమ్మరం చేయాలన్నారు. ఈ విషయంలో ఎపి ప్రభుత్వప్రత్యేక ప్రతినిధి జయరామ్‌ కోమటి చూపుతున్న చొరవను, చేస్తున్న కృషిని ముఖ్యమంత్రి అభినందించారు.

ప్రపంచ ఆదివాసీ దినోత్సవ వేడుకలో భాగంగా పాడేరు మండలం ఆడారిమెట్ట గ్రామంలోని మండల పరిషత్‌ ప్రాధమిక పాఠశాలలో ఎన్నారై రావాడ సుభాష్‌ ఆర్ధిక సహకారంతో ఏర్పాటు చేసిన డిజిటల్‌ తరగతులను ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రారంభించారు. రాష్ట్ర మంత్రులు  గంటా శ్రీనివాసరావు, నక్కా ఆనంద్‌ బాబు,  జయరాం కోమటి, ఏపీ జన్మభూమి సమన్వయకర్త పైలా ప్రసాదరావు ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్నారు. 

ఈ సందర్భంగా పాడేరు గిరిజన ప్రాంతంలో డిజిటల్‌ తరగతులు ఏర్పాటు, అంగన్‌వాడీ కేంద్రాల ఆధునీకరణకు సహకరిస్తున్న ఎన్నారైలను చంద్రబాబు ప్రశంసించారు.  జయరాం కోమటితో కలిసి ఆడారిమెట్ట ప్రాధమిక పాఠశాల చిన్నారులతో ముఖ్యమంత్రి చంద్రబాబు సంభాషించారు. చదువు ఎలా నేర్పుతున్నారన్న విషయాన్ని ఆయన విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. ఐదో తరగతి ఇంగ్లీషు పాఠాలలో ప్రశ్నలను చదివించి మిగతా పిల్లల చేత జవాబులు అడిగి తెలుసుకున్నారు. జయరాం కోమటి మాట్లాడుతూ, ముఖ్యమంత్రి సూచన మేరకు రాష్ట్రంలో ఐదువేల పాఠశాలల్లో డిజిటల్‌ తరగతులను ఏర్పాటు చేయాలన్న లక్ష్యాన్ని పూర్తిచేస్తామని చెప్పారు. ఇప్పటికే చాలాచోట్ల డిజిటల్‌ తరగతులను ప్రారంభించడం జరిగిందన్నారు.

Click here for Photogallery