ఓ వైపు కమ్యూనిటీ సేవ...మరో వైపు? పక్కదారి పడుతున్న అమెరికా తెలుగు సంఘాలు!

ఓ వైపు కమ్యూనిటీ సేవ...మరో వైపు? పక్కదారి పడుతున్న అమెరికా తెలుగు సంఘాలు!

11-08-2018

ఓ వైపు కమ్యూనిటీ సేవ...మరో వైపు? పక్కదారి పడుతున్న అమెరికా తెలుగు సంఘాలు!

(చెన్నూరి వెంకట సుబ్బారావు)

అమెరికాలో మనవాళ్ళు అడుగుపెట్టి ఐదు దశాబ్దాలు దాటింది. నేడు అక్కడ ఐదోతరం ఉనికిని చాటుకుంటోంది. అమెరికాలో నేడు భారతీయ సంస్కృతి కనిపిస్తుందంటే అది మనవాళ్ళ గొప్పదనమే. అదే సమయంలో ప్రాంతీయ, కుల విభేదాలు కూడా ఎక్కువగా కనిపిస్తుందంటే అదీ మన గొప్పదనమే. ఏ దేశమేగినా...మా కులాన్ని మాత్రం మేము విడవము అన్నట్లుగా ముఖ్యంగా తెలుగువాళ్ళు తమ కుల గొప్పదనాన్ని ప్రదర్శించుకోవడానికి అహరహం శ్రమిస్తున్నారు. అమెరికాలో తెలుగువారికి సేవ చేయడానికోసమే అన్నట్లు జాతీయ తెలుగుసంఘాలు, ప్రాంతీయ సంఘాలు ఏర్పడ్డాయి. ఇప్పుడు రాష్ట్రం రెండుగా విడిపోయిన తరువాత ఎన్నో నగరాల్లో ఆంధ్ర, తెలంగాణ అంటూ మరిన్ని సంఘాలు పుట్టుకొచ్చాయి. ఈ అసోసియేషన్ల ముఖ్య లక్ష్యం కమ్యూనిటీ సేవ...తెలుగు భాష, సంస్కృతీ, సంప్రదాయాల పరిరక్షణ. కాని ఇప్పుడు ఉన్న అసోసియేషన్ల నాయకుల తీరుతో ఈ లక్ష్యం పక్కదారి పట్టింది.

జాతీయ సంఘాల్లో ఘనమైన చరిత్ర కలిగిన ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా) విషయానికి వస్తే ఆ సంఘం చేస్తున్న కార్యక్రమాలు ఎన్ని ఉన్నప్పటికీ ఆ సంఘం పెత్తనం మాత్రం కమ్మవాళ్ళ చేతుల్లోనే ఉండిపోవడంతో అది కమ్మవారి కులంగా పేరు పొందింది. ఈ తానా నుంచి చీలిపోయి ఏర్పడిన మరో సంఘం నాట్స్‌ కూడా కమ్మవారి సేవా సంఘమైపోయింది. మరో ప్రాచీన చరిత్ర ఉన్న అమెరికా తెలుగు సంఘం (ఆటా) రెడ్ల సంఘంగా మారిపోయింది. దీని నుంచి వచ్చిన ఉత్తర అమెరికా తెలుగు సమితి (నాటా) కూడా రెడ్ల ఆధిపత్యంలో కొనసాగుతోంది. రెడ్లు, కమ్మ సంఘంలో ఇమడలేకపోయిన బ్రాహ్మణులు తమకంటూ ఓ సంఘంగా సిలికానాంధ్రను పెట్టుకున్నారు.

ఈ సంఘాల్లో ఆంధ్రవాళ్ళ పెత్తనమే ఎక్కువంటూ తెలంగాణకు చెందిన వాళ్ళు దీని నుంచి వేరుపడి సొంత సంఘాలను ఏర్పాటు చేసుకున్నారు. ఇందులో అమెరికన్‌ తెలంగాణ సంఘం (ఆటా-తెలంగాణ), తెలంగాణ అమెరికా తెలుగు సంఘం (టాటా) జాతీయ సంఘాలుగా ఉన్నాయి. వివిధ నగరాల్లో కూడా ప్రాంతీయ, కుల ప్రేమతో చాలా తెలుగు సంఘాలు  ఏర్పడి పనిచేస్తున్నాయి. కాకపోతే గుడ్డిలో మెల్లగా ఇవి తమ సేవల్లో మాత్రం కులవివక్షను పాటించడం లేదు. కాకపోతే తమ కులంవాళ్ళకు కావాల్సిన ప్రచారాన్ని, ప్రయోజనాన్ని మాత్రం ఎక్కువగానే పంచిపెడుతున్నాయి. ఈ సంఘాలు చేస్తున్న కార్యక్రమాల్లో ఆయా కులాలవాళ్ళకే ఎక్కువ సంఖ్యలో ఆహ్వానాలు అందుతుంటాయి. దీనికితోడు రాజకీయాంశాలు కూడా ఈ సంఘాల్లో ప్రత్యక్షంగా కనిపిస్తుంటాయి. కులంపై ఉన్న అభిమానంతో తానా నాయకులు తెలుగు దేశం పార్టీకి మద్దతుగా ప్రచారం చేస్తుంటారు. తెలుగుదేశం పార్టీ కార్యక్రమాల్లో తానా నాయకులు ఎక్కువమంది ప్రత్యక్షంగానో పరోక్షంగానే పాల్గొంటున్నారు. అదే విధంగా నాటా నాయకులు వైఎస్‌ఆర్‌సిపి అభిమానులుగా పేరు పొందారు. తమ కార్యక్రమాల్లో వైఎస్‌ఆర్‌సిపికి మద్దతుగా వారు కార్యక్రమాలను కూడా చేస్తుంటారు.

కమ్మ, రెడ్డు, బ్రాహ్మణులు ఇలా ఎవరికివారు సంఘాల్లో పెత్తనం చెలాయిస్తుంటే తాము మాత్రం వెనక్కి ఎందుకు ఉండాలని కాపు నాయకులు కూడా ఇప్పుడు తెరమీదకు వచ్చారు. అమెరికన్‌ ప్రోగ్రెసివ్‌ తెలుగు అసోసియేషన్‌ (ఆప్త)లో కాపుల ఆధిక్యం కనిపిస్తోంది. ఈనెలాఖరులో జరగనున్న పదివసంతాల పండుగకు వస్తున్న అతిధుల్లో కూడా చాలామంది కాపువాళ్ళే కనిపిస్తారు. ఈ కాపు సంఘాన్ని మరింతగా విస్తరించేందుకు ప్రయత్నాలు కూడా జరుగుతున్నాయి.

ఈ జాతీయ, ప్రాంతీయ సంఘాలు నిర్వహించే వేడుకలు కూడా తమ కుల ఆధిక్యాన్ని ప్రదర్శించేలా ఉంటుంటాయి. దీంట్లో కూడా సినిమా వెర్రి ఎక్కువగా కనిపిస్తుంటుంది. తమ అభిమాన నటుని పాటలు, ఆటలు వచ్చినప్పుడు వెర్రెత్తిపోస్తుంటారు. ఈలలు, చప్పట్లు మోతలతో తాము విదేశాల్లో ఉన్నామన్న విషయాన్ని వారు గుర్తించరు.

తెలంగాణ సంఘాలవారు తమ వేడుకల్లో తమ ప్రాంతానికి సంబంధించిన పండుగలనే నిర్వహించడం మొదలెట్టారు. కామన్‌గా తెలుగువారు చేసుకునే పెద్ద పండుగలైన సంక్రాంతి, ఉగాది, దీపావళి వంటి వేడుకలను పెద్దఎత్తున చేయరు. బోనాలు, బతుకమ్మలకే వారు ప్రాధాన్యం ఇస్తారు.

ఆంధ్రవాళ్ళ ఆధిక్యంలో ఉన్న సంఘాలు సంక్రాంతి, ఉగాది, దసరా, దీపావళి వంటి వేడుకలను వైభవంగా నిర్వహిస్తుంటాయి.

ఈ సంఘాలు మహాసభలను నిర్వహించినప్పుడు మాత్రం కులానికి ప్రాధాన్యం ఇస్తూనే మరోవైపు ఆదాయాన్ని సమకూర్చేవారికి కూడా పెద్దపీట వేస్తుంటాయి.

ఈ సంఘాలు తమ ఉనికి చాటుకునేందు కోసం తమ మాతృరాష్ట్రాల్లో కూడా కార్యక్రమాలను నిర్వహిస్తుంటాయి. ఈ కార్యక్రమాల్లో కూడా కుల, ప్రాంతీయ అభిమానాలను ఈ సంఘాలు కురిపిస్తుంటాయి. ఆంధ్రవాళ్ళ ఆధిపత్యంలో ఉన్న సంఘాలు ఎక్కువ కార్యక్రమాలను ఆంధ్రప్రదేశ్‌లో నిర్వహిస్తూ, తెలంగాణ ప్రాంతంలో ఒకటి రెండుచోట్ల కార్యక్రమాలను నిర్వహిస్తుంటాయి. తెలంగాణ ప్రాంతీయ జాతీయ సంఘాలు తమ సేవా కార్యక్రమాల్లో ఎక్కువగా తెలంగాణ ప్రాంతాలకు ప్రాధాన్యం ఇస్తాయి.  తానా చైతన్యస్రవంతి పేరుతో ఆంధ్రలో ఎక్కువగా కార్యక్రమాలను నిర్వహిస్తుంటుంది. ఆటా కూడా తెలంగాణలో ఎక్కువ, ఆంధ్రాలో తక్కువ అన్నట్లుగా కార్యక్రమాలను ఇటీవల నిర్వహించింది. టాటా సేవాడేస్‌ పేరుతో ఎక్కువగా తెలంగాణలోనే కార్యక్రమాలను నిర్వహించింది. ఆటా తెలంగాణ కూడా తెలంగాణ ప్రాంతంలోనే కార్యక్రమాలను చేసింది.

ఇలా తెలుగు సంఘాలు తమ కార్యక్రమాల్లో కులానికి, ప్రాంతీయతకు ప్రాధాన్యం ఇవ్వడం వల్ల అసలైన తెలుగు వైభవాన్ని చాటేలా కార్యక్రమాలను నిర్వహించలేకపోతోంది. గత చరిత్ర ఎంతో గొప్పది అన్నట్లుగా మనవాళ్ళలో మొదటితరం చేసిన కార్యక్రమాలు ప్రచార ఆర్భాటం లేకపోయినప్పటికీ తమ సంస్కృతి, సంప్రదాయాన్ని కాపాడుకునేలా చేసుకుని అందరి అభిమానాలను అందుకుంది. నాయకత్వ మార్పులో భాగంగా వచ్చిన నేటితరం తమ సంఘం ఏర్పడిన మూల లక్ష్యాలను పక్కనపెట్టి తమకు ఇష్టమైన రీతిలో కార్యక్రమాలను నిర్వహిస్తూ సంఘాల ప్రయోజనం కన్నా స్వప్రయోజనాలే మిన్న అన్నట్లుగా వేడుకలను, కార్యక్రమాలను చేస్తున్నారు. దీనివల్ల అమెరికాలోనూ, మాతృరాష్ట్రాల్లోనూ చేస్తున్న సేవా కార్యక్రమాలకన్నా,  నాయకుల స్వార్థప్రయోజనాల వల్ల ఆ అసోసియేషన్లు తమ ప్రతిష్టను కోల్పోతున్నాయి. దాంతో కమ్యూనిటీకి సేవ చేస్తున్నప్పటికీ అసలైన లక్ష్యం పక్కదారిపట్టడంతో సంఘాలు కొన్ని సమయాల్లో విమర్శల పాలవుతున్నాయి.