ఘనంగా జయరాం కోమటి కుమార్తె పెళ్లి వేడుకలు

ఘనంగా జయరాం కోమటి కుమార్తె పెళ్లి వేడుకలు

31-08-2018

ఘనంగా జయరాం కోమటి కుమార్తె పెళ్లి వేడుకలు

తానా మాజీ అధ్యక్షుడు, అమెరికాలో ఆంధ్ర రాష్ట్ర ప్రతినిధి కోమటి జయరాం కుమార్తె మేఘన వివాహ వేడుకలను గత ఐదు రోజుల నుండి విజయవాడ పరిసర ప్రాంతంలో అట్టహాసంగా జరిగాయి. మంగళగిరి సమీపంలోని సీకే కళ్యాణ మండపంలో బుధవారం రాత్రి జరిగిన వివాహానికి వివిధ రంగాలకు చెందిన పలువురు ప్రముఖులు హాజరై వధూవరులను ఆశీర్వదించారు.

ఏపీ అసెంబ్లీ స్పీకర్‌ డా.కోడెల శివప్రసాద్‌, డిప్యూటీ స్పీకర్‌ మండలి బుద్ధప్రసాద్‌, మంత్రులు గంటా శ్రీనివాసరావు, ఆనందబాబు, తెలంగాణ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, పలువురు ఎంపీలు, ఎమ్మెల్యేలు ఈ వివాహానికి హాజరై వధూవరులను అశ్వీర్వదించారు. అమెరికా నుండి జయరాం సన్నిహితులు, మిత్రులు పెద్ద సంఖ్యలో ఈ వివాహానికి తరలివచ్చారు. తానా అధ్యక్షుడు వేమన సతీష్‌, తదుపరి అధ్యక్షుడు తాళ్ళూరి జయశేఖర్‌, కార్యదర్శి అంజయ్య చౌదరి, కోశాధికారి పొట్లూరి రవి, తానా మాజీ అధ్యక్షుడు నాదెళ్ళ గంగాధర్‌ తదితరులు వధూవరులను ఆశీర్వదించారు.

ఘనంగా సంగీత్‌:

అంతకు ముందు మంగళవారం రాత్రి విజయవాడ ఏ ప్లస్‌ కల్యాణ మండపంలో సంగీత్‌ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఆంధ్రా అమ్మాయి, ఐర్లాండ్‌ అబ్బాయి సంగీత్‌ అదిరింది. ఉత్తరాది నుంచి మనం అలవాటు చేసుకున్న సంగీత్‌ నృత్యాలను ఇటలీ డ్యాన్సులు తోడయ్యాయి. తానా మాజీ అధ్యక్షుడు కోమటి జయరాం కుమార్తె మేఘన, ఐర్లాండ్‌ అబ్బాయి మార్సెల్‌ సంగీత కార్యక్రమం విజయవాడలోని ఏ ప్లస్‌ కన్వెన్షన్‌ హాలులో మంగళవారం రాత్రి ఆంధ్రా, ఇటలీ సంప్రదాయాల మేలవింపుతో జరిగింది.

ఈ కార్యక్రమానికి పలువురు రాజకీయ, సినీ పారిశ్రామిక ప్రముఖులు హాజరయ్యారు. ఆంధ్రజ్యోతి మేనేజింగ్‌ డైరెక్టర్‌ రాధాకృష్ణ, దర్శకుడు రాఘవేంద్రరావు, ఎంపీలు మురళీమోహన్‌, కేవీపీ రామచంద్రరావు, గరికిపాటి రామ్‌మోహన్‌రావు, సెంట్రల్‌ ఎమ్మెల్యే బొండా ఉమా, గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ, మహిళా కమిషన్‌ చైర్‌ పర్సన్‌ నన్నపనేని రాజకుమారి, ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న, యువనేత దేవినేని అవినాష్‌ హాజరై వధూవరులను ఆశీర్వదించారు.

అంతకు ముందు వధూవరులు ఊరేగింపుగా ఫంక్షన్‌ హాలు వద్దకు వచ్చారు. వధూవరులు డ్యాన్సులు చేసుకుంటూ ఫంక్షన్‌ హాలులోకి ఇటలీ సంప్రదాయం దానికనుగుణంగా నూతన వధూవరులతో పాటు అమెరికా, ఐర్లాండ్‌ నుంచి వచ్చిన యువతీ, యువకులు డ్యాన్సులు వేసుకుంటూ వచ్చారు. ఈ వేడుకలో కోమటి జయరాం దంపతులతో పాటు మరేల్స్‌ కుటుంబీకులు కూడా ఇటలీ సాంప్రదాయ నృత్యాలు చేశారు.


Click here for Event Gallery