ఎన్నారై టీడిపి కి మంచి రోజులు వచ్చాయి....

ఎన్నారై టీడిపి కి మంచి రోజులు వచ్చాయి....

29-09-2018

ఎన్నారై టీడిపి కి మంచి రోజులు వచ్చాయి....

 (చెన్నూరి వెంకట సుబ్బారావు)

అమెరికాలో 14 ఏళ్ళుగా తెలుగుదేశం పార్టీకి అనుబంధ విభాగంగా ఉన్న ఎన్నారై టీడిపికి  సమర్థనాయకత్వం, అంకితభావంతో పనిచేసే కార్యకర్తలతోపాటు ఇప్పుడు ఎపిఎన్‌ఆర్‌టీలాంటి సంస్థల నుంచి కూడా సమర్థులైన నాయకులు కలవడంతో 2019 విజయయాత్రకు సిద్ధమైంది. వచ్చే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ గెలుపుకు ఎన్నారైలను చైతన్యపరిచేందుకు సిద్ధమైంది. తాను చేసిన కార్యక్రమాలు, చేపట్టిన ప్రచారంతోపాటు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అమెరికా పర్యటనలను ఫలప్రదమయ్యేలా చూడటం వంటివి ఎన్నారై టీడీపిని అగ్రభాగాన నిలబెట్టింది. దేశంలో జాతీయ పార్టీలకు విభాగాలు ఉన్నా, ఇలా విజయవంతమైన కార్యక్రమాలను నిర్వహించిన చరిత్ర మాత్రం దేనికీ లేదు. అది ఒక్క తెలుగుదేశం పార్టీకే లభించింది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఓవైపు నవ్యాంధ్ర ప్రగతి కోసం శ్రమిస్తుంటే మరోవైపు రాష్ట్రంలో పార్టీకి విజయాన్ని సాధించేందుకు ఎన్నారై టీడిపి కష్టపడుతోంది. 2007లో ఏర్పాటైన ఎన్నారై టీడీపి అంచెలంచెలుగా ఎదిగిన వైనం...సమర్థవంతమైన నాయకత్వంతో  2019 జైత్రయాత్రకు సిద్ధమైన విధానంపై 'తెలుగు టైమ్స్‌' ప్రత్యేక కథనాన్ని మీకు అందిస్తోంది.

ఎన్నారై టీడిపి ఎలా ఎదిగింది?

అమెరికాలో నేడు లక్షల సంఖ్యలో తెలుగు ఎన్నారైలు ఉన్నారు. వారిలో చాలామంది ఐటీరంగానికి సంబంధించినవారు ఎక్కువగా ఉన్నారు. తాము ఇక్కడకు రావడానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అనుసరించిన ఐటీ అనుకూలవైఖరినే కారణమని వారు చెబుతారు. 20ఏళ్ళ క్రితం సైబరాబాద్‌ను నిర్మించి ఐటీ కంపెనీల చిరునామాగా మార్చడం ద్వారా తమకు ఉద్యోగవకాశాలను ఇప్పించారని వారు పేర్కొంటారు. అలాగే 30 సంఖ్యలో ఉన్న ఇంజనీరింగ్‌ కాలేజీలను 300కు ఆ తరువాత 500 కు పెంచడం ద్వారా ఎంతోమంది సాంకేతిక విద్యను అవలంబించేలా ఆయన కృషి చేశారని, అందువల్ల ఆయన గెలుపు తమకు అవసరమని ఎన్నారైలు అంటారు. అమెరికా లో 2007 లో కొందరు ప్రముఖులు సమావేశమై తెలుగుదేశం పార్టీకి మద్దతుగా ఏ విధంగా వ్యవహరించాలన్న విషయమై ఆలోచించారు. చర్చలు, సమావేశాల తరువాత  తెలుగుదేశం పార్టీకి మద్దతుగా ఎన్నారై టీడిపిని ఏర్పాటు చేశారు. ఈ ఎన్నారై టీడిపి ఏర్పాటు వెనుక తానాలో ఉంటూ, తెలుగుదేశం పార్టీలో చేరిన జయరామ్‌ కోమటితోపాటు, తానా అధ్యక్షునిగా పనిచేసిన నాదెళ్ళ గంగాధర్‌ మరియు ఇతర నాయకులు ఉన్నారు.

తెలుగుదేశం పార్టీకి మద్దతుగా, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విజయానికి ఎల్లప్పుడూ నిరంతరం పాటుపడుతున్న ఎన్నారై తెలుగుదేశం పార్టీ విభాగం 2007లో ఏర్పడింది. ఆంధ్రప్రదేశ్‌లోని తెలుగుదేశం పార్టీకి స్వచ్ఛంద అనుబంధ సంస్థగా దీనిని ఏర్పాటు చేశారు. అప్పుడు చంద్రబాబు నాయుడు అధికారంలో లేకపోయినప్పటికీ ఆయనను అధికారంలోకి తీసుకురావాలన్న లక్ష్యంతో ఎన్నారైల మద్దతును కూడగట్టడానికి తద్వారా ఆంధ్రప్రదేశ్‌లో ఆయన విజయానికి బాటలు వేయడానికి ఎన్నారై తెలుగుదేశం పార్టీ కంకణం కట్టుకుంది.

ఎన్నారై టీడీపిని ఏర్పాటు చేసిన తరువాత దీనిని ఎలా విస్తరించాలన్న దానిపై నాయకులంతా చర్చించి 2007లో తెలుగుదేశం పార్టీ అధ్యక్షునిగా ఉన్న చంద్రబాబు నాయుడుతో 10 నగరాల్లో ప్రచార కార్యక్రమానికి శ్రీకారం చుట్టాలని భావించారు. ఈ నగరాల్లో కార్యక్రమం విజయవంతంగా జరిగేందుకు జయరామ్‌ కోమటి నాయకత్వంలో 9 మందితో కూడిన కమిటీని చంద్రబాబు నాయుడు నియమించారు. చంద్రబాబు నాయుడు పర్యటనను విజయవంతం చేసేందుకు  డా. రాఘవేంద్ర ప్రసాద్‌, డా. నవనీతకృష్ణ, డా. కొత్తపల్లి శ్రీనివాస్‌, పద్మశ్రీ ముత్యాల, ఉదయ్‌ చాపలమడుగు, శ్రీనివాస్‌ చందు, లక్ష్మీనారాయణ సూరపనేని, చలమా రెడ్డి, యుగంధర్‌ ఎడ్లపాటి, బ్రహ్మాజీ, సతీష్‌ వేమన, కిషోర్‌ పుట్టా, డా. హనుమయ్య బండ్ల  వంటివారు కృషి చేశారు. ఈ సమయం లోనే చంద్రబాబు వాషింగ్టన్ డి సి లో జరిగిన తానా మహా సభలకు రావటం, సతీష్ వేమన ఆద్వర్యం లో 300 కార్ లతో ఊరేగింపు గా వచ్చిన తెలుగు దేశం అభిమానుల చే ఎయిర్ పోర్ట్ లో ఆయన కు జరిగిన ఘన  స్వాగతం ఎవరూ మర్చిపోలేరు. 

2007 జూన్‌ - జూలై లో అమెరికాలోని శాన్‌హోసె, డల్లాస్‌, హ్యూస్టన్‌, డిట్రాయిట్‌, టొరంటో, ఇండియానాపొలిస్‌, చికాగో, న్యూజెర్సి, వాషింగ్టన్‌డీసి వంటి నగరాల్లో చంద్రబాబు నాయుడు విస్తృతంగా పర్యటించారు. టీడిపి అభిమానులతో సమావేశమయ్యారు. చంద్రబాబుకు తోడుగా మేమున్నామంటూ ఎంతోమంది ఎన్నారైలు ఆయా సమావేశాల్లో గళం విప్పారు. ఎంతోమంది విరాళాలను ఇచ్చారు. తెలుగుదేశం పార్టీ విజయానికి తామంతా కృషి చేస్తామని హామి ఇచ్చారు. ఈ సమావేశాలు విజయవంతమవడంతో ఎన్నారై టీడిపి వివిధ నగరాలకు విస్తరించడం ప్రారంభించింది.

ఎన్నో కార్యక్రమాలు...ఎందరితో పరిచయ అవకాశాలు

అమెరికాకు వచ్చే తెలుగుదేశం పార్టీ నాయకులకు, ఇతరులకు ఇది స్వాగతం పలికే సంస్థగా మారింది. అమెరికాలో తెలుగుదేశం పార్టీ తరపున కార్యక్రమాలను, ఇతర ప్రచారాన్ని నిర్వహించేందుకు ఇది వేదికగా నిలిచింది. 2007 చంద్రబాబు పర్యటన తరువాత ఎన్నారై టీడిపి అమెరికాలో చాలా కార్యక్రమాలను నిర్వహించడం ప్రారంభించింది. ఎన్టీఆర్‌ జయంతి, వర్థంతి వంటి కార్యక్రమాలతోపాటు అమెరికాకు వచ్చే పార్టీ నాయకులతో ముఖాముఖీ కార్యక్రమాలను ఏర్పాటు చేసింది. ఇలా వచ్చినవారిలో ఎందరో నాయకులు ఉన్నారు.

కోడెల శివ ప్రసాద్‌, గంటా శ్రీనివాసరావు, గరికపాటి మోహనరావు, పల్లె రఘునాధరెడ్డి, బోండా ఉమ, ఉమామాధవరెడ్డి, బొజ్జల గోపాలక్రిష్ణారెడ్డి, నన్నపనేని రాజకుమారి, పయ్యావుల కేశవ్‌, నారాలోకేష్‌, ముళ్ళపూడి బాపిరాజు, మురళీమోహన్‌, చదలవాడ క్రిష్ణమూర్తి, ధూళిపాళ్ళ నరేంద్ర, నన్నూరి నరసిరెడ్డి, నారా రోహిత్‌, నందమూరి బాలక్రిష్ణ, సుజనాచౌదరి వంటివారు ఎన్నారై టీడిపి కార్యక్రమాల్లో పాల్గొన్నారు.

ప్రతి సంవత్సరం ఎన్నారై టీడిపి తరపున యన్‌.టి.ఆర్‌, పరిటాల రవి, యర్రం నాయుడు, మాధవరెడ్డి జయంతి, వర్ధంతి సమావేశాలు, తె.దే.ప ఆవిర్భావ దినోత్సవాలు, మినీ మహానాడులను ఎన్నారై టీడిపి నిర్వహిస్తోంది. ఇదే కాకుండా  ఇండో అమెరికన్‌ కాన్సర్‌ హాస్పిటల్‌ కు, స్మార్ట్‌ విలేజ్‌ కి, జన్మభూమికీ నిధి సేకరణ చేయటం, హుద్‌ హుద్‌ తుఫాన్‌ సేవా కార్యక్రమాల్లో కూడా ఎన్నారై టీడిపి పాలుపంచుకుంది. 2009 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీని బలపరచాలంటూ ఎన్నారైలను కోరింది. రాష్ట్రంలో నిర్వహించిన టీడిపి మహానాడులో ఎన్నారై టీడిపి నాయకులు ప్రత్యేకంగా పాల్గొని అమెరికాలో ఎన్నారై టీడిపి తరపున చేసిన కార్యక్రమాలను అందరికీ తెలియజేశారు.

2010 తరువాత సంవత్సరాలలో, ముఖ్యంగా  2014 ఎన్నికల ముందు సంవత్సరంలో యువతరం ఎన్నారై టీడిపిలో చేరింది. యువత రాకతో ఎన్నారై టీడిపి ప్రచారం ఊపందుకుంది. రాష్ట్రంలో ఉన్న తెలుగుదేశం పార్టీ ఆఫీసుతో యువత కలిసి పనిచేయడం ప్రారంభించడంతో ఎన్నారై టీడిపి గురించి రాష్ట్రంలోని తెలుగుదేశం పార్టీ నాయకులకు, కార్యకర్తలకు, ప్రజలకు బాగా తెలిసింది. రాష్ట్రంలో ఉనికిని చాటడంతోపాటు కొంతమంది అప్పడు ప్రత్యక్ష ఎన్నికల్లోకి వచ్చేందుకు ప్రయత్నించారు. ఎన్నారై టీడిపి చేసిన బ్రింగ్‌ బాబు బ్యాక్‌ ప్రచారం రాష్ట్రమంతటా విస్తృతంగా ప్రజల్లోకి చొచ్చుకువెళ్ళింది. డల్లాస్‌లోని ఎన్నారై టీడిపి నాయకులు ప్రారంభించిన బాబు వస్తే జాబు గ్యారంటీ అన్న ప్రచారం కూడా రాష్ట్రంలోని యువతరాన్ని ఆకట్టుకుంది. ఇలా కొత్త నినాదాలతో, సామాజిక మాధ్యమాలను విస్తృతంగా వాడుకుంటూ ఎన్నారై టీడిపి చేసిన ప్రచారం పార్టీని అధికారంలోకి తీసుకువచ్చేలా చేసింది.

రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావడంతో యుఎస్‌లోని పలువురు ఎన్నారైలు అటూ ఇటూగా ఉన్నవారు ఎన్నారై టీడిపిలో చేరారు. కొంతమంది ఎన్నారైలు లోకేష్‌ను కలిసి ఎన్నారైల కోసం ప్రభుత్వపరంగా కార్యక్రమాలను చేయాలని కోరారు. దాంతో ఎపిఎన్‌ఆర్‌టీని ప్రభుత్వం ఏర్పాటు చేసి, అధ్యక్షునిగా అమెరికాకు చెందిన డా. రవి వేమూరిని నియమించింది. ఎపిఎన్‌ఆర్‌టీ అమెరికాతోపాటు వివిధ దేశాల్లో ఉన్న తెలుగుదేశం పార్టీ అభిమానులను, ఇతరులను ఒకే ప్లాట్‌ఫామ్‌ మీదకు తీసుకువచ్చేందుకు కృషి చేస్తోంది. వివిధ దేశాల్లో ఎపిఎన్‌ఆర్‌టీ కో ఆర్డినేటర్లను నియమించి వారి ద్వారా ఎపి ప్రభుత్వ ఆశయాలను, ప్రభుత్వ పథకాలను విస్తృతంగా వ్యాపింపజేసింది. అలాగే ఎన్నారైల కోసం ఎపి ప్రభుత్వం చేస్తున్న కార్యక్రమాలను కూడా తెలియజేసింది. ఓవైపు ఎన్నారై టీడిపి, మరోవైపు ఎపిఎన్‌ఆర్‌టీ ద్వారా ఎన్నారైలు తెలుగుదేశం పార్టీవైపు మళ్ళడం ప్రారంభించారు.

ఎన్నారై టీడిపిని ఏర్పాటు చేసి పార్టీకోసం అంకితభావంతో పనిచేస్తున్న జయరామ్‌ కోమటిని ఉత్తర అమెరికాలో ఎపి ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధిగా నియమించటంతో, జయరాం కోమటి కూడా  ఎపి జన్మభూమి అనే సేవా సంస్థ ని ఏర్పాటు చేసి ఎన్‌ఆర్‌ఐ ల మద్దతు సమీకరించటం మొదలు పెట్టారు. నవ్యాంధ్ర అభివృద్ధి కోసం ఎపి జన్మభూమి తరపున జయరామ్‌ కోమటి రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లో డిజిటల్‌ తరగతుల ఏర్పాటు, అంగన్‌వాడీ కేంద్రాల్లో మౌలిక వసతుల కల్పన, శ్మశానవాటికల అభివృద్ధి వంటి కార్యక్రమాలను ఎన్నారైల సహకారంతో చేయడం ప్రారంభించారు. ఇప్పటివరకు దాదాపు 3,500 ప్రభుత్వ పాఠశాలల్లో డిజిటల్‌ తరగతులను ఎన్నారైల సహకారంతో జయరామ్‌ కోమటి ఏర్పాటు చేశారు. అదేవిధంగా దాదాపు 500 అంగన్‌వాడీ సెంటర్‌లు, 300 శ్మశానవాటికలను అభివృద్ధిపరిచారు.

మే లో డల్లాస్‌లో మహానాడు

అమెరికా లో ఎన్నారై టీడిపి తరపున ఎన్నో కార్యక్రమాలను నిర్వహిస్తున్న యువతరం డల్లాస్‌లో పార్టీ మహానాడును నిర్వహించాలని ప్లాన్‌ చేసింది. ఈ సంవత్సరం మే 27,28 తేదీల్లో ఈ మహానాడును ఎన్నారై టీడిపి ఏర్పాటు చేసింది. ఈ మహానాడుకు చంద్రబాబును రావాల్సిందిగా తానా మాజీ అధ్యక్షుడైన జయరామ్‌ కోమటి, నాట్స్‌ లో ఉన్న మోహనకృష్ణ మన్నవ విజయవాడకు వెళ్ళి ముఖ్యమంత్రిని ఆహ్వానించారు. చంద్రబాబు కూడా ఈ  ఆలోచన కు అభినందనలు తెలిపి మహానాడును విజయవంతంగా నిర్వహించేందుకు అందరూ కలిసి పనిచేయాలని సూచించడంతోపాటు ఈ మహానాడుకు మంత్రి గంటా శ్రీనివాసరావును, ఇతర ముఖ్యనేతలను పంపించారు. 

డాలస్ నగరం నుంచి  ఎన్నారై టీడిపి తరుపున లోకేష్ నాయుడు, శ్రీని మండవ, సుధాకర్ కంచర్ల, మురళి వెన్నం, నవీన్ ఎర్రంనేని, సాంబ దొడ్డ, ఇంద్రనీల్ కామినేని, చంద్రారెడ్డి పోలీస్, ప్రవీణ్ కోడలి, సతీష్ కొమ్మన, శ్రీనివాస్ కొమ్మినేని, జనార్దన్ యెనికపాటి, కిశోరె చలసాని, శ్రీనివాస్ శాఖమూరి, విజయ్ వల్లూరు లాంటి యువకులు, ఎన్నారై టీడిపి కార్యకర్తలు మహానాడును విజయవంతంగా నిర్వహించి అందరి ప్రశంసలను అందుకున్నారు.  ఈ కార్యక్రమం విజయవంతం అవటానికి  కారణం ఒక పక్క  డల్లాస్ లో వున్న ఉత్సాహం అయితే, రెండో పక్క తానా- నాట్స్‌ కలిసి పని చేయడం, ఎపిఎన్‌ఆర్‌టీ కార్యవర్గం కూడా ఎన్నారైటీడిపితో తో కలిసి పని చేయడమే అని విజయవాడలోని టిడిపి  అధినాయకులు, అమెరికాలోని నాయకులకు అర్ధం అయ్యింది. డాలస్‌ నగరం లో ఎంత మంది యువకులు టిడిపి అభిమానులు ఉన్నారో, పార్టీపై వారికి ఉన్న అభిమానాన్ని ఉత్సాహాన్ని గమనించింది.

విస్తృతమైన కార్యక్రమాలు...పెరిగిన కన్‌ఫ్యూజన్‌

అమెరికాలోని వివిధ నగరాల్లో ఎపిఎన్‌ఆర్‌టీ  ప్రతినిధుల నియామకం తరువాత వారి కార్యక్రమాలు, ప్రచారాల ద్వారా ఎన్‌ఆర్‌ఐ లను ఏపీఎన్‌అర్‌టి లో చేర్చుకొనే ప్రయత్నాలు, ఇంకోవైపు ఏపీ జన్మభూమి కార్యకర్తలు కూడా అంటే ఉత్సాహం తో వారి కార్య క్రమాలు కూడా అన్ని పట్టణాలలో నిర్వహిస్తున్నారు.  ఈ రెండు వర్గాలు చేస్తున్న సేవలలతోపాటు ఎన్నారై టీడిపి ద్వారా పార్టీ కోసం చేస్తున్న కార్యక్రమాలు ఎంతోమంది ఎన్నారైలను ఆకట్టుకున్నాయి. దాంతో మునుపటికన్నా ఇప్పుడు టీడిపి బలం అమెరికాలో మరింతగా పెరిగింది. దానికితోడు ఎన్నారై టీడిపిలో ఉన్న తానా అధ్యక్షుడు సతీష్‌ వేమన, నాట్స్‌ నాయకుడు మోహనకృష్ణ మన్నవ వంటి వారు యువకులను ఆకర్షించడం ప్రారంభించారు. సతీష్‌ వేమనకు ఉన్న మాస్‌ ఇమేజ్‌తో పార్టీ కార్యక్రమాలను విజయవంతం చేసేందుకు ఎంతోమంది ముందుకు వచ్చారు. మరోవైపు న్యూజెర్సిలో ఉన్న మోహనకృష్ణ మన్నవ తన అనుచరులతో పార్టీకి ఆదరణను సంపాదించిపెడుతున్నారు. 

పార్టీ పరంగా కూడా  రాష్ట్రం నుంచి వచ్చిన మంత్రులు, టిడిపి నాయకుల కోసం ఏర్పాటు చేసిన సమావేశాలు కూడా పెరగటంతో ఎన్నారై టీడీపీలో కొంత కన్‌ఫ్యూజన్‌ చోటు చేసుకుంది. 2014 వరకు  జయరాం కోమటి నాయకత్వం లో ఒక్క తాటిన  నడిచిన ఎన్నారై టీడీపీ కార్యక్రమాలు తరువాత వివిధ నగరాల్లో ఎవరికివారు ఎన్నారై టీడిపి పేరుతో కార్యక్రమాలను చేయడంతో కొంత కన్‌ఫ్యూజన్‌ చోటు చేసుకుంది.

సెప్టెంబర్‌ లో చంద్రబాబు అమెరికా పర్యటన

ఈ పరిస్థితులలో చంద్రబాబు అమెరికా పర్యటన ఖరారు కావటం తో అటు పార్టీ లోను, ఇటు ఎన్నారైలలోను కొత్త ఉత్సాహం వచ్చింది.  ముఖ్యమంత్రి, ఇతర పెద్దల అంగీకారంతో  ఎన్నారై టీడిపి నాయకులు న్యూజెర్సిలో చంద్రబాబు నాయుడుతో మీట్‌ అండ్‌ గ్రీట్‌ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ సమావేశం విజయవంతానికి జయరామ్‌ కోమటితోపాటు, రవి వేమూరు కూడా తమతమ పరిధులో కృషి చేశారు. ఇద్దరూ కూడా తమవాళ్ళతో ఈ కార్యక్రమానికి కావాల్సిన ఏర్పాట్లను పర్యవేక్షించారు. అన్ని పట్టణాలలో ఉన్న ఉత్సాహభరిత ఎన్నారైలతో వాట్స్‌ అప్‌ గ్రూప్‌ లు ఏర్పాటు చేసి కార్యక్రమ వివరాలను, చేస్తున్న ఏర్పాట్లను ఎప్పటి కప్పుడు అందరితో పంచుకొనే అవకాశం కలిగించారు.  అమెరికా నలుమూలలా ఉన్న ఎన్నారై టీడిపి అభిమానులను ఈ సమావేశానికి వచ్చేలా కృషి చేశారు. వాట్సాప్‌ లాంటి సోషల్‌ మీడియా రెండు వైపులా పదును ఉన్న కత్తి అయినా జాగత్త్రగా వాడుకొన్నారు.

సెప్టెంబర్‌ 23 న జరిగే సభ కేవలం పార్టీ మీటింగ్‌ కదా ... ఏపీఎన్‌ఆర్‌టీ లాంటి ప్రభుత్వ సంస్థ కి ఇందులో ఏం పని అని ప్రశ్నించిన వారు ఉన్నారు. అలాగే 10-12 సంవత్సరాలుగా పని చేస్తున్న కార్యకర్తలను పక్కకు పెట్టి నిన్న మొన్న పార్టీ లో చేరిన వారు పెత్తనం చెలాయించడం ఏమిటి అని నిలదీసిన వారు ఉన్నారు. అయితే అన్నీ ప్రశ్నలకు జయరాం కోమటి, రవి వేమూరు ఓపిక గా సమాధానం చెప్పి వారిని సముదాయించి అందరినీ ఒక్కతాటిపైకి తీసుకువచ్చారు.  ఇది పార్టీ సమావేశమే అయినా అందరిని కలుపుకొని వెళ్ళాల్సిన అవశ్యకతను వారు నొక్కి చెప్పారు. ఎపిఎన్‌ఆర్‌టీకి చెందిన బుచ్చిరాంప్రసాద్‌, నాట్స్‌ నుంచి మోహనకృష్ణ మన్నవ, తానా నుంచి సతీష్‌ వేమన  వంటి అనేక మంది కలిసి ఈ కార్యక్రమం విజయవంతానికి కృషి చేశారు.  అధినాయకుడు చంద్రబాబు కూడా 3000 మంది అభిమానులతో జరిగిన ఈ కార్యక్రమాన్ని ఒక విజయ వేదిక గా భావించారు. సమావేశానికి వచ్చిన ఎన్నారైలను చూసి సంతోషపడిన చంద్రబాబు వారిని ఉత్సాహపరిచేలా ప్రసంగించారు. వచ్చే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ గెలుపుకు కృషి చేయాలని పిలుపునిచ్చారు.

 కమిటీల ఏర్పాటు కు చంద్రబాబు సూచన

23 సెప్టెంబర్‌ న జరిగిన మీట్‌ అండ్‌ గ్రీట్‌ సమావేశం విజయవంతం అవటం తో  చంద్రబాబు మరునాడే  ఎన్నారై టీడిపి కార్యకర్తలతో  న్యూయార్క్‌ హోటల్‌ లో దాదాపు 2 గంటల పాటు సమావేశమై మాట్లాడారు.  ప్రతి వారు చెప్పిన మాటలు, సూచనలు విన్నారు.  పార్టీకి మళ్ళీ అధికారం దక్కేలా కృషి చేసే బాధ్యత మీదేనంటూ స్పష్టంగా చెప్పారు. అదే సమయంలో ఎన్నారై టీడీపి కార్యకర్తలు కొందరు ఎపిఎన్‌ఆర్‌టీ తీరుపై అసంతృప్తి వ్యక్తం చేసినా, మరోవైపు ఎన్నారై టీడిపి తీరుపై ఎపిఎన్‌ఆర్‌టీ వారు అసంతృప్తి తెలిపినా అందరూ సర్దుకుపోవాలని పార్టీ కోసం అందరూ కలిసి పనిచేయాలని ఆయన  సూచించారు.  అన్ని సమీకరణాలు కలిస్తే ఓ ఇద్దరికీ ఎన్నికలలో సీట్‌ ఇవ్వవచ్చు అని తెలిపి అందరిని ఉత్సాహపరిచారు.  అమెరికా లో ఎన్నారై టీడీపి ని బలోపేతం చేసేందుకు ఒక నేషనల్‌ కమిటి ని, మరిన్ని కమిటీ లను వెంటనే వేస్తామని తెలిపారు. ఆ కమిటీ లను నిర్ణయించే బాధ్యత కూడా మీదే అని చెప్పి ఆ పని చేయమని జయరాం కోమటి, రవి వేమూరికి సూచించారు.

నాయకుడు ఇచ్చిన ఈ సూచనలతో టీడీపీ కార్యకర్తలు అందరు చాలా ఉత్సాహంతో  తమ పేర్లను, తమ వూరిలో పని చేసే కార్యకర్తల పేర్లను ఇవ్వటం మొదలు పెట్టారు. 24 సెప్టెంబర్‌ రాత్రికి దాదాపు 300 మంది పేర్లు వచ్చాయి. ఆ తరువాత దాదాపు 2 రోజులు ఆ పేర్లను, సూచనలపై కూలంకషం గా చర్చించి,  మధ్య మధ్య లో చంద్రబాబు గారి తో చర్చించి  8 పేర్ల తో ఒక నేషనల్‌ కమిటీ ని, 13 పేర్లతో ఒక సోషల్‌ మీడియా కమిటీ ని తయారు చేసి నాయకుడికి ఇచ్చారు. అమెరికా పర్యటనను ముగించుకుని అమరావతి తిరిగి వెళ్ళే ముందు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎపిఎన్‌ఆర్‌టీ అధ్యక్షుడు రవి వేమూరు, ఎన్నారై టీడిపి నాయకుడు జయరామ్‌ కోమటి ఇతర ముఖ్య నాయకులతో సమావేశమయ్యారు. పార్టీ విజయంకోసం తాము అనుసరించినున్న ప్రచార వ్యూహాలను జయరామ్‌ కోమటి, రవి వేమూరు ముఖ్యమంత్రికి వివరించారు. వివిధ నగరాల్లో కమిటీలను ఏర్పాటు చేస్తున్నట్లు వారు తెలిపారు. ముఖ్యమంత్రి ఆ కమిటీ పేర్లను పరిశీలించి వాటికి తన ఆమోదం తెలిపారు. ఒకట్రెండు రోజుల్లో పేర్లను విడుదల చేయనున్నారు. 

ఇప్పటి దాకా ఎన్నారై టీడీపి ని చూస్తున్న జయరాం కోమటి చైర్మన్‌ గా ఈ నేషనల్‌ కమిటీ పని చేస్తుందని తెలిసి ఎన్నారై టీడీపి ఇక ముందు ఒకేతాటి మీద నడుస్తుందని, మంచి రోజులు వచ్చాయని అందరూ భావిస్తున్నారు.

Click here for Photogallery