జగన్‌ వ్యూహం ఫలించినట్లేనా?

జగన్‌ వ్యూహం ఫలించినట్లేనా?

10-06-2019

జగన్‌ వ్యూహం ఫలించినట్లేనా?

ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి తన మంత్రివర్గ విస్తరణలో తనదైన శైలిలో ప్రవర్తించి అందరినీ ఆశ్చర్యపరిచారు. సీనియర్లను పక్కనపెట్టి కొత్తవారిని తన మంత్రివర్గంలోకి తీసుకోవడం అందరి దృష్టిని ఆకర్షించింది. వ్యూహం ప్రకారమే జగన్‌ ఈ మంత్రివర్గాన్ని ఏర్పాటు చేసినట్లు భావిస్తున్నారు. రాష్ట్రంలో మంత్రివర్గ ప్రమాణస్వీకారం అందరి అంచనాలను తలకిందులు చేస్తూ సాగింది.  మంత్రి పదవులు ఆశించి భంగపడిన భూమన కరుణాకరరెడ్డి, అనంత వెంక ట్రామిరెడ్డి, అంబటి రాంబాబు, సామినేని ఉదయ భాను, ఆర్‌కే రోజా, ఆళ్ల రామకష్ణారెడ్డి, మర్రి రాజశేఖర్‌ వంటి సీనియర్లను నామినేటెడ్‌ పదవుల్లో కూర్చబెట్టేందుకు రంగం సిద్ధం చేస్తున్నట్లు ప్రచారం జరుగు తోంది. ఈ క్రమంలోనే ఒకవైపు సంచలన నిర్ణయాలతో ప్రజల్లోకి దూసుకెళ్తున్న పార్టీ అధినేత, ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి తన రెండున్నరేళ్ల ఫార్ములా అంశాన్ని అంతే వేగంగా నేతల్లోకి తీసుకెళ్తున్నారు. ప్రస్తుతం కొలువు దీరిన మంత్రి వర్గంలో ఆరుగురు మాజీ మంత్రులకు స్థానం కల్పించగా, మిగిలిన 19 మంది కూడా జూనియర్లే. ఈ రెండున్నరేళ్ల కాలంలో వీరికి పరిపాలనాపరమైన అనుభవాన్ని కల్పించి, వారిని మంచి నేతలుగా తీర్చిదిద్దాలన్నదే తమ లక్ష్యమని మరే ఉద్దేశం లేదని పార్టీలో అగ్రనేతలు చెబుతున్నారు. చివరి రెండున్నరేళ్ల కాలం అత్యంత కీలకమైనది కాబట్టి అప్పుడు కేబినెట్‌లో సమర్థవంతమైన నేతల అవసరం ఎంతైనా ఉంటుందని అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు.

  2024 ఎన్నికలకు వెళ్లే ముందు ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి తనదైన శైలిలో సీనియర్లతో పరిపాలనా వేగాన్ని మరింతగా పెంచేందుకు వారికి ప్రస్తుతం పదవులు ఇవ్వలేదని చెబుతున్నారు. ఈ క్రమంలోనే వారికి ముందుగానే చెప్పినట్లైతే బాగుండేదన్న ప్రచారం కూడా ఉంది. మంత్రి పదవులు ఆశించిన వారిలో కొంత మంది మాత్రం జగన్‌ మోహన్‌ రెడ్డి నిర్ణయమే మాకు శిరోధార్యం అంటుండగా, మరికొంత మంది మాత్రం ఒక్క మాట మాకు ముందుగా చెప్పి ఉంటే బాగుండేదని అంటున్నారు. ఏదేమైనప్పటికీ సీనియర్లను పక్కనపెట్టలేదని తెలియజెప్పేందుకు వారికి నామినేటెడ్‌ పదవులు ఇవ్వాలనే నిర్ణయాన్ని మాత్రం అందరూ స్వాగతిస్తున్నారు.

    తన తండ్రి వైయస్‌ రాజశేఖరరెడ్డి హయాంలో కూడా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో సబితా ఇంద్రారెడ్డికి హోం శాఖ ఇచ్చి అందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తారు. సరిగ్గా పదేళ్ల తరువాత ఇప్పుడు మళ్లి ఆయన తనయుడు జగన్‌మోహన్‌రెడ్డి కూడా అదే పని చేశారు. దీనికితోడు జగన్‌ మోహన్‌రెడ్డి ఒక దళిత మహిళను హోం మంత్రిని చేయడం చర్చనీయాంశంగా మారింది. ఇప్పటికే మాజీ ముఖ్యమంత్రి, తెదేపా అధినేత చంద్రబాబు నాయుడు దళితులుగా పుట్టాలని ఎవరైనా అనుకుంటారా అని అన్నమాటలను ముఖ్యమంత్రి సీరియస్‌గానే తీసుకున్నారని చెబుతున్నారు. ఒక దళిత మహిళకు హోం మంత్రి పదవిని కట్టబెట్టడం ద్వారా చంద్రబాబుపై రాజకీయంగా పైచేయి సాధించినట్లని చెబుతున్నారు. ఇక దళితులెవ్వరూ చంద్రబాబు వెనక ఉండకూదనే అంతర్లీనమైన ఆలోచనతోనే ఈ కార్యక్రమం జరిగిందని చెబుతున్నారు.  ప్రజలు ఇచ్చిన గౌరవాన్ని నిలుపుకుంటూ వారి ఆశలను, ఆశయాలను, ఆకాంక్షలను నెరవేర్చేక్రమంలో ఇటువంటి చిన్నచిన్న ప్రయత్నాలు తప్పదని పార్టీ సీనియర్లు చెబుతున్నారు. ప్రజలకు మెరుగైన పాలన అందించడంతోపాటు పార్టీపరంగా అనుసరించాల్సిన వ్యూహాలను కూడా పాటించాల్సి ఉంటుందని వారు చెబుతున్నారు. ఏదిఏమైనప్పటికీ కూడా వైకాపా అధినేత, సీఎం జగన్‌ అడుగులు వ్యూహాత్మకంగా ఉన్నాయనడంలో ఎటువంటి సందేహం లేదని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు,