రెండోసారి ప్రధానిగా మోదీ

రెండోసారి ప్రధానిగా మోదీ

11-06-2019

రెండోసారి ప్రధానిగా మోదీ

వరుసగా రెండోసారి ప్రధాన మంత్రి పదవి చేపట్టిన నరేంద్ర మోదీ శాఖల కేటాయింపులో విధేయత, సామర్థ్యం, బీజేపీ సిద్ధాంతాల అమలుకే పెద్ద పీట వేశారు. ప్రభుత్వ విధానాలను పటిష్టంగా అమలు చేయటంతోపాటు పరిపాలన, పథకాల అమలులో సమూల మార్పులకు మోదీ శాఖల కేటాయింపు అద్దం పడుతోంది. నాలుగు ముఖ్యమైన శాఖలు హోమ్‌, రక్షణ, ఆర్థిక, విదేశీ వ్యవహారాల శాఖల కేటాయింపులో చాకచక్యంగా వ్యవహరించి తనకుకు అత్యంత విధేయుడైన పార్టీ అధ్యక్షుడు అమిత్‌ షాకు కీలక హోమ్‌ శాఖను కేటాయించుకున్నారు. రవిశంకర్‌ ప్రసాద్‌, ధర్మేంద్ర ప్రధాన్‌, ప్రకాశ్‌ జావడేకర్‌, అమేథీలో కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీని ఓడించి జెయింట్‌ కిల్లర్‌గా నిలిచిన స్మ తి ఇరానీ, నితిన్‌ గడ్కరీ తదితర సీనియర్‌, జూనియర్‌ మంత్రులకు వారి పాత శాఖలే కేటాయించటం ద్వారా ప్రభుత్వ విధానాల కొనసాగింపునకు పెద్ద పీట వేశారు. స్మ తి ఇరానీకి పాత జౌళి శాఖతోపాటు అదనంగా మహిళా, శిశు సంక్షేమ శాఖను కేటాయించారు.

దాదాపు పది మంది పాత మంత్రులకు ఇది వరకటి శాఖలే ఉంచారు. ఆరుగురు మంత్రులకు పాత శాఖలతో పాటు అదనంగా కొత్తవి కేటాయించారు. మిత్రపక్షాలైన అకాలీదళ్‌ నాయకురాలు హర్‌సిమ్రత్‌ కౌర్‌, లోక్‌జన శక్తి అధినాయకుడు రాంవిలాస్‌ పాశ్వాన్‌, శివసేన నేత అరవింద్‌ సావంత్‌, రిపబ్లికన్‌ పార్టీ నాయకుడు రాందాస్‌ అఠావలేకు గతంలో ఉన్న శాఖలే కొనసాగించారు. తనకు అత్యంత సన్నిహితుడైన అమిత్‌ షాకు హోమ్‌ శాఖ కేటాయించటం ద్వారా మొత్తం పరిస్థితి తన అదుపు, ఆజ్ఞల్లో ఉండేలా చేసుకున్నారు. ఇంత వరకూ హోమ్‌శాఖను నిర్వహించిన సీనియర్‌ నాయకుడు రాజ్‌నాథ్‌ సింగ్‌ను రక్షణ శాఖకు బదిలీ చేశారు. దేశం తొలి మహిళా రక్షణ శాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌ను దేశం మొదటి ఆర్థిక శాఖ మంత్రిగా నియమించటం ద్వారా మోదీ మరోసారి తన ఘనత చాటుకున్నారు.

ముఖ్యమైన శాఖల కేటాయింపులో తనదైన ముద్రను ప్రదర్శించటం ద్వారా సీనియర్‌ నాయకులైన రాజ్‌నాథ్‌ సింగ్‌, అమిత్‌షా మధ్య ఎలాంటి ఘర్షణ లేకుండా చేసుకోవటంలో మోదీ విజయం సాధించారని చెప్పక తప్పదు. బీజేపీపికి చెందిన ఇద్దరు సీనియర్‌ నాయకులు అరుణ్‌జైట్లీ, సుష్మాస్వరాజ్‌ ఆరోగ్య కారణాల మూలంగా మంత్రి వర్గానికి దూరంగా ఉన్న నేపథ్యంలో నరేంద్ర మోదీ మరో సీనియర్‌ నాయకుడు రాజ్‌నాథ్‌ సింగ్‌కు సముచిత ప్రాధాన్యత ఇవ్వటం ద్వారా పార్టీ, ప్రభుత్వంలో తనకు ఎలాంటి అసమ్మతి లేకుండా చూసుకోగలిగారు. సీనియర్‌ సివిల్‌ సర్వీస్‌ అధికారి ఎస్‌ జై శంకర్‌ను విదేశీ వ్యవహారాల శాఖ మంత్రిగా నియమించటం ద్వారా భారత దేశం భవిష్యత్‌లో అత్యంత ముఖ్యమైన పాత్ర నిర్వహించేందుకు అవసరమైన ఏర్పాట్లకు తెర లేపారని చెప్పక తప్పదు. చైనా తదితర ముఖ్యమైన దేశాల వ్యవహారాలను అత్యంత చాకచక్యంగా చక్కబెట్టిన దౌత్యాధికారి జైశంకర్‌ విదేశాంగ శాఖను అత్యంత సమర్థంగా వ్యవహరించటం ద్వారా అంతర్జాతీయ స్థాయిలో దేశ ప్రయోజనాలను పరిరక్షించ గలుగుతారని మోదీ భావిస్తున్నారు.

జమ్మూకాశ్మీర్‌కు ప్రత్యేక ప్రతిపత్తిని ఇచ్చే రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 370, రాష్ట్రం శాశ్వత పౌరులను నిర్ధారించే ఆర్టికల్‌ 35ఏను రద్దు చేస్తామంటూ బీజేపీ ఎన్నికల ప్రణాళికలో ఇచ్చిన హామీని అమలు చేయాలంటే హోమ్‌ శాఖ తన నమ్మిన బంటు చేతిలో ఉండాలనే లక్ష్యంతోనే అమిత్‌ షాకు మోదీ దాన్ని అప్పగించారని భావించవలసి ఉంటుంది. పార్టీ విధానాలను తుచ తప్పకుండా అమలు చేయగలిగే వ్యక్తి హోమ్‌మంత్రిగా ఉంటేనే సాధ్యం అవుతుందని, అందుకే అమిత్‌ షాకు ఆ శాఖను ఇచ్చారు. ఆర్టిల్‌ 370, 35ఏ రద్దు వ్యవహారంతోపాటు పౌరసత్వం సవరణ బిల్లు, జాతీయ పౌరసత్వ నమోదు వివాదం, నక్సలైట్ల సమస్య తదితర అంశాలను అమిత్‌ షా పరిష్కరించవలసి ఉంటుంది.

కాగా ప్రధాని పదవిని ఆశించిన సీనియర్‌ మంత్రి నితిన్‌ గడ్కరీకి పాత శాఖ ఉపరితల రవాణాను కొనసాగించినా అత్యంత ముఖ్యమైన షిప్పింగ్‌ శాఖను తొలగించటం గమనార్హం. షిప్పింగ్‌కు బదులు ఆయనకు సూక్ష్మ, చిన్న మధ్య తరహా ఎంటర్‌ప్రైజెస్‌ శాఖ బాధ్యతలను అప్పగించారు. మోదీ సొంత రాష్ట్రం గుజరాత్‌కు చెందిన మన్‌సుక్‌లాల్‌ మాండవియాకు అప్పగించటం గమనార్హం. కర్నాటకకు చెందిన సీనియర్‌ మంత్రి సదానంద్‌ గౌడకు రసాయనాలు, ఎరువుల శాఖే ఉంచారు. మిత్రపక్షమైన ఎల్‌జేపీ అధినాయకుడు రాంవిలాస్‌ పాశ్వాన్‌కు కూడా పాత శాఖ వినియోగదారుల వ్యవహారాలు, ఆహారం, ప్రజాపంపిణీ వ్యవస్థ ఇచ్చారు. సీనియర్‌ మంత్రులు రవిశంకర్‌ ప్రసాద్‌కు గతంలో ఉన్న న్యాయ శాఖతోపాటు అదనంగా కమ్యూనికేషన్లు, ఎలక్ట్రానిక్స్‌, సమాచార సాంకేతిక పరిజ్ఞానం శాఖ బాధ్యతలు కూడా అప్పగించడం గమనార్హం.