అలుపెరగని యోధుడు.. జగన్ కు పట్టాభిషేకం

అలుపెరగని యోధుడు.. జగన్ కు పట్టాభిషేకం

11-06-2019

అలుపెరగని యోధుడు.. జగన్ కు పట్టాభిషేకం

ఆంధ్రప్రదేశ్‌లో ఈసారి జరిగిన అసెంబ్లీ ఎన్నికలు అనేక రికార్డులను సృష్టించింది. పెద్దసంఖ్యలో ఓటర్లు వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ (వైసీపీ)కి మద్దతుగా నిలిచి ఊహించనిరీతిలో విజయాన్ని ఆ పార్టీకి అందించారు..ప్రత్యక్ష ఎన్ని కల్లో 50శాతం ప్రజలు ఒక పార్టీకి మద్దతు ఇచ్చిన సందర్భాలు చాలా తక్కువ. 40 నుంచి 45 దాటితే అది ప్రభంజనమే.. కానీ  2019 ఎన్నికల వేళ వైసీపీ ఈ అపూర్వ విజయాన్ని సాధించింది.

ఆంధ్రప్రదేశ్‌ ఎన్నికల చరిత్రను వైకాపా తిరగరాసింది. ప్రఖ్యాత మీడియా సంస్థల సర్వే సంస్థల అంచనాల సరిహద్దులను చెరిపేస్తూ ప్రభంజనం సష్టించింది. ఇది రాష్ట్రంలో వచ్చిన సునామీలకంటే అతిపెద్ద ఓట్ల సునామి. ఎన్నికల ఫలితాల చరిత్రలో విడదీయలేని పేజీ. రాష్ట్రంలో 175 అసెంబ్లి స్థానాలకుగానూ 151 స్థానాలను కైవసం చేసుకుని రికార్డు బద్దలు కొట్టింది. ఇది వైకాపా అధినేత జగన్‌ మోహన్‌రెడ్డి కషి, పట్టుదల, పంతం, అంతకుమించి ప్రజలు అతని నాయకత్వంపై చూపించిన నమ్మకం, ఐదేళ్లుగా కొనసాగుతున్న తెలుగుదేశం ప్రభుత్వ విధానాలకు ప్రజలు విసిగి వేసారి అసహనంతో వైకాపాపై ఓట్ల వర్షం కురిపించారు. ఆయన పాదయాత్రకు ఫలితం లభించింది. పర్యటించిన అన్ని జిల్లాల్లో ప్రజలు ఆదరించారు. జగన్‌ ఇచ్చిన భరోసాపై గుండెల్లో విశ్వాసాన్ని నింపుకున్నారు. ఓట్ల రూపంలో అనూహ్యంగా తమ మహోన్నతమైన తీర్పును ఇచ్చారు. పది సంవత్సరాల జగన్‌ సుదీర్ఘ రాజకీయ ప్రస్థానానికి ఆంధ్ర రాష్ట్ర ప్రజలు పట్టాభిషేకం కట్టారు. తెలుగుదేశం పార్టీ ఆవిర్భవించిన అనంతరం 2019 సార్వత్రిక ఎన్నికలు మినహా ఇప్పటివరకూ జరిగిన అన్ని ఎన్నికల్లో ఏదోఒక పార్టీ పొత్తుతో విజయం సాధించిన తెదేపా ఈసారి ఒంటరిగా నిలచి ఓటమిపాలైంది. తెదేపాను, ఆపార్టీ ప్రజాప్రతినిధులను ప్రజలు తిరస్కరించారు.  లోక్‌సభ స్థానాల ఫలితాల్లోనూ అదే జోరు కొనసాగింది.

తెలుగుదేశం పార్టీ ఆవిర్భవించిన అనంతరం 1983లో జరిగిన ఎన్నికల్లో ఎన్టీఆర్‌ ప్రభజంనంలో రాష్ట్రంలో నాలుగు దశాబ్దాల తరువాత జగన్‌ మరో ప్రభంజనాన్ని సష్టించారు. ఆంధ్రప్రదేశ్‌లో వైకాపా ఓటమికి అధికార పక్షం ఎన్ని వ్యూహాలు పన్నినా ఓటర్ల ప్రభంజనం ముందు ఫలించలేదు. పశ్చిమగోదావరిలో 15 సీట్లకు 14 సీట్లను, తూర్పుగోదావరి జిల్లాలో 19 స్థానాలకు వైకాపా 14 గెలుచుకుని వైసీపి విజయదుందుభి మోగించింది. ఇవే ఫలితాల పరంపర ఉత్తరాంధ్రలో కూడా కొనసాగింది. గుంటూరు జిల్లాలో 17 సీట్లకుగాను వైకాపా 14 సీట్లలో, తెదేపా 3 సీట్లలో విజయం సాధించాయి. కష్ణా జిల్లాలో 16 స్థానాలకు వైకాపా 14 స్థానాలను కైవసం చేసుకుంది. ఇదే పరిస్థితి రాయలసీమ జిల్లాల్లో కూడా ప్రతిఫలించింది. అనంతపురం జిల్లాలో 14 సీట్లకు గానూ వైకాపా 13 సీట్లను తన ఖాతాలో వేసుకుంది. చిత్తూరు జిల్లాలో 14 సీట్లకు గాను 12 సీట్లను వైకాపా గెలుచుకుంది. ఇక్కడ తెదేపా 2 సీట్లకే పరిమితమైంది. కర్నూలులో కూడా 13 సీట్లను వైకాపా, 1 సీటు తెదేపా గెలుచుకున్నాయి. కడప జిల్లాలో వైకాపా క్లీన్‌ స్వీప్‌ చేసి 10 స్థానాల్లో విజయఢంకా మోగించింది. ప్రకాశంలో 12 సీట్లకు గాను వైకాపా 9, తెదేపా 3 సీట్లలో విజయం సాధించాయి. నెల్లూరులో కూడా వైకాపా క్లీన్‌ స్వీప్‌ చేస్తూ 10 స్థానాలను తన ఖాతాలో వేసుకుంది.  కడప, విజయనగరం, నెల్లూరు జిల్లాల్లో తెదేపా ఖాతా తెరవకపోవడం ఆపార్టీ దయనీయ పరి స్థితికి నిదర్శనం. తెదేపా అధినేత చంద్రబాబు స్వంత జిల్లా చిత్తూరులో కూడా వైకాపా ప్రభంజనానికి తెదేపా విలవిల్లాడిపోయింది. చంద్రబాబు స్వంత నియోజకవర్గం కుప్పంలో సైతం గతంలో కంటే ఆధిక్యత తగ్గడం గమనార్హం.

కొన్ని దశాబ్దాలుగా కొన్ని నియోజకవర్గాల్లో దిగ్గజాలుగా ఉన్న తెదేపా నేతలు సైతం పంకా గాలికి కొట్టుకుపోక తప్పలేదు. రాష్ట్ర మంత్రులతోపాటు జిల్లా పార్టీ అధ్యక్షులు సైతం ఓటమి చవిచూడాల్సి వచ్చింది.