కాలిఫోర్నియాలో ఘనంగా 'పాఠశాల' వసంతోత్సవం
Nela Ticket
Kizen
APEDB

కాలిఫోర్నియాలో ఘనంగా 'పాఠశాల' వసంతోత్సవం

05-06-2017

కాలిఫోర్నియాలో ఘనంగా 'పాఠశాల' వసంతోత్సవం

గత నాలుగు సంవత్సరాలుగా బే ఏరియాలో విజయవంతంగా నడుస్తున్న పాఠశాల నేడు సన్నివేల్‌ టెంపుల్‌ ఆడిటోరియంలో వసంతోత్సవ వేడుకలను అత్యంత వైభవంగా జరుపుకుంది. దాదాపు 150 మందికిపైగా పాఠశాల విద్యార్థులు తెలుగు భాష, సంస్కృతి ఉట్టిపడేలా 5 గంటలపాటు వివిధ కార్యక్రమాలను ప్రదర్శించారు. పాఠశాల డైరెక్టర్‌లు రమేష్‌ కొండా, ప్రసాద్‌ మంగిన, సిఇఓ సుబ్బారావు చెన్నూరి వచ్చిన అతిధులకు తొలుత స్వాగతం పలికారు. సన్నివేల్‌, శాన్‌రామన్‌, ఫ్రీమాంట్‌, డబ్లిన్‌, శాన్‌హోసె పాఠశాల సెంటర్‌ విద్యార్థినీ విద్యార్థులు తమ ప్రదర్శనలతో అందరినీ ఆకట్టుకున్నారు. డబ్లిన్‌ విద్యార్థులు ప్రదర్శించిన దశావతారాలు, ఫ్రీమాంట్‌ విద్యార్థులు ప్రదర్శించిన బాహుబలి కార్యక్రమాలు అందరినీ ఎంతగానో ఆకట్టుకున్నాయి. 4 ఏళ్ళ వయస్సు ఉన్న పిల్లలు కూడా తెలుగులో మాట్లాడి, పాటలు పాడి అందరినీ ఆశ్చర్యపరిచారు.

ఆంధ్రప్రదేశ్‌ పంచాయతీరాజ్‌, రూరల్‌ డెవలప్‌మెంట్‌ కమిషనర్‌ సీతారామాంజనేయులు మాట్లాడుతూ, తెలుగు భాషలో పదాలకు మంచి భావాలు ఉన్నాయని చెప్పారు. అమ్మ అంటే ఆత్మీయత అని అంటూ, మమ్మీ అన్న పదానికి దీనికి చాలా తేడా ఉందన్నారు. అన్న అని పిలిచినప్పుడు కలిగే భావాలు, బ్రదర్‌ అని పిలిచినప్పుడు కలగవన్నారు. అలాంటి తల్లిభాష తెలుగును ఇక్కడి పిల్లలకు నేర్పిస్తున్న 'పాఠశాల' కృషిని అభినందించారు. ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం భాగస్వామ్యంతో నడుస్తున్న పాఠశాల తెలుగు కోర్స్‌కి ప్రభుత్వ మద్దతు, సహకారం ఎప్పుడూ ఉంటాయని అన్నారు. మొట్టమొదటిసారిగా ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం 'పాఠశాల' ద్వారా నిర్వహించిన 'తెలుగు అడుగు' పరీక్షల్లో ఉత్తీర్ణులైన విద్యార్థులకు సర్టిఫికెట్స్‌ ఇచ్చే అవకాశం తనకు లభించిడం అదృష్టంగా భావిస్తున్నట్లు చెప్పారు.

ఎపి ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి, పాఠశాల చైర్మన్‌ జయరామ్‌ కోమటి మాట్లాడుతూ గత నాలుగు సంవత్సరాలుగా తెలుగు భాషను నేర్పుతున్న పాఠశాలకు ఈ సంవత్సరం ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ప్రభుత్వం నుంచి సహకారం రావడం, మొదటిసారి తెలుగు అడుగు పరీక్షలను రాష్ట్ర ప్రభుత్వం పాఠశాల ద్వారా నిర్వహించడం గొప్ప విషయమని అభినందించారు.

పాఠశాల సిఇఓ సుబ్బారావు చెన్నూరి మాట్లాడుతూ, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ప్రభుత్వం, విద్యాశాఖ వారు పూర్తిస్థాయిలో సహకరిస్తున్నారని, ఎన్నారై పిల్లల కోసం కొత్త సిలబస్‌ను తయారు చేసి ఇచ్చారని, ఈ సిలబస్‌ ద్వారా తెలుగు నేర్చుకోవడం మరింత సులభమైందని చెప్పారు. ప్రపంచంలోనే మొదటిసారిగా ఆన్‌లైన్‌లోనూ, పాఠశాల కేంద్రాల్లోనూ పరీక్షలు నిర్వహించామని, ఉత్తీర్ణులైన విద్యార్థులకు సర్టిఫికెట్‌ను ప్రదానం చేసినట్లు చెప్పారు. కార్యక్రమంలో భాగంగా తెలుగు అడుగు ప్రభుత్వ పరీక్షలో పాసైనవారికి, ఇతర క్లాస్‌లవారికి మెడల్స్‌, సర్టిఫికెట్‌లను ముఖ్య అతిధి రామాంజనేయులు ఇచ్చారు. పాఠశాల టీచర్లకు కూడా మెమోంటోలు ఇచ్చారు.

ఈ వసంతోత్సవంలో పలువురు ప్రముఖులు కూడా పాల్గొన్నారు. కుపర్టినో మేయర్‌ సవితా వైద్యనాథన్‌, కుపర్టినో స్కూల్‌ డిస్ట్రిక్ట్‌ బోర్డ్‌ ప్రెసిడెంట్‌ అంజలి కౌజర్‌, ఫ్రీమాంట్‌ స్కూల్‌ డిస్ట్రిక్ట్‌ బోర్డ్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ డా. యాంగ్‌ చావో, సరటోగా సిటీ కౌన్సిల్‌ మెంబర్‌ రిషి కుమార్‌, సన్నివేల్‌ సిటీ కౌన్సిల్‌ మెంబర్‌ లారీ క్లెన్‌తోపాటు థెరెసా కాక్స్‌ తదితరులు ఈ కార్యక్రమానికి వచ్చారు.


Click here for Event Gallery