బే ఏరియాలో పాఠశాల టీచర్లకు అవగాహన సదస్సు

బే ఏరియాలో పాఠశాల టీచర్లకు అవగాహన సదస్సు

16-09-2017

బే ఏరియాలో పాఠశాల టీచర్లకు అవగాహన సదస్సు

బే ఏరియాలో 5 సెంటర్లలో, ప్రతి సెంటర్‌లోనూ 5 తరగతులతో దాదాపు 25 మంది టీచర్లతో చిన్నారులకు తెలుగు భాషను పాఠశాల దిగ్విజయంగా నేర్పిస్తున్న సంగతి తెలిసిందే. 2017-18 కొత్త విద్యాసంవత్సరాన్ని గతవారం లాంఛనంగా పాఠశాల ప్రారంభించింది. ఈ నేపథ్యంలో ఎపి ప్రభుత్వం రూపొందించిన కొత్త సిలబస్‌, కొత్త పాఠ్యపుస్తకాలను విడుదల చేసిన సంగతి కూడా పాఠకులకు విదితమే.

ఈ నేపథ్యంలో పాఠశాల టీచర్లకు ఈ విద్యాసంవత్సరానికి సంబంధించిన పాఠ్యప్రణాళిక, ఇతర విషయాలపై చర్చించేందుకుగాను అవగాహన తరగతులను సెప్టెంబర్‌ 15వ తేదీన మిల్‌పిటాస్‌లోని ఆఫీస్‌ ఆన్‌ స్పెషల్‌ రిఫ్రజెన్‌టేటివ్‌ ఆఫ్ నార్త్‌ అమెరికా కార్యాలయంలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి హాజరైన టీచర్లను ఉద్దేశించి పాఠశాల కరికులమ్‌ డైరెక్టర్‌ డాక్టర్‌ కె. గీతా మాధవి  ప్రసంగించారు. కొత్త విద్యాసంవత్సరానికి సంబంధించి అనుసరించాల్సిన పాఠ్యప్రణాళికలను, బోధన వివరాలను ఆమె తెలియజేశారు.

సింగపూర్‌ యూనివర్సిటీ నుంచి పాఠశాల పుస్తకాల ఆధర్‌, ఇ లెర్నింగ్‌ డైరెక్టర్‌ సుషుమ్నరావు తాడినాడ ఈ సంవత్సరం నుంచి ఎల్‌ఎస్‌ఆర్‌డబ్ల్యు విధానంలో బోధన పద్ధతిని అమలు చేయనున్నట్లు చెప్పారు. Learning - Speaking - Reading- Writing పద్ధతిలో బోధన ఉంటుందని, తొలుత భాషను తెలుసుకోవడం, తరువాత మాట్లాడటం, చదవడం, రాయడం వంటివి చేయిస్తారన్నారు. పాఠశాల చైర్మన్‌ జయరామ్‌ కోమటి, సిఇఓ చెన్నూరి వెంకట సుబ్బారావు, డైరెక్టర్‌లు ప్రసాద్‌ మంగిన, రమేష్‌ కొండ కూడా ఈ కార్యక్రమంలో ప్రసంగించారు. అనంతరం గత సంవత్సరం పాఠశాలలో విద్యాబోధన చేసిన టీచర్ల సేవలను ప్రశంసిస్తూ, వారికి గౌరవభృతిని చెక్కు రూపంలో పాఠశాల చైర్మన్‌ జయరామ్‌ కోమటి అందజేశారు.

Click here for Event Gallery