ఫిబ్రవరి 25 నుంచి జాతీయ బీచ్ కబడ్డీ పోటీలు

ఫిబ్రవరి 25 నుంచి జాతీయ బీచ్ కబడ్డీ పోటీలు

20-01-2018

ఫిబ్రవరి 25 నుంచి జాతీయ బీచ్ కబడ్డీ పోటీలు

ఆర్గనైజింగ్‌ కమిటీ చైర్మన్‌గా జయరామ్‌ కోమటి

ఆంధ్రప్రదేశ్‌లోని మంగళగిరి మండలం పెద్దవడ్లపూడిలో ఫిబ్రవరి 25 నుంచి  28 వరకు ఆంధ్రా కబడ్డీ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో జాతీయ స్థాయి బీచ్‌ కబడ్డీ చాంపియన్‌షిప్‌ పోటీలను నిర్వహిస్తున్నారు. ఈసారి ఈ పోటీల నిర్వహణను ఆంధ్ర కబడ్డీ అసోసియేషన్‌కు ఇస్తున్నట్లు కబడ్డీ ఫెడరేషన్‌ ఆఫ్‌ ఇండియా ప్రకటించింది. కాగా ఈ పోటీల నిర్వహణ కమిటీ చైర్మన్‌గా అమెరికాలో ఎపి ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధిగా ఉన్న జయరామ్‌ కోమటి వ్యవహరించనున్నారు. ఆయనతోపాటు ఈ పోటీల నిర్వహణను గుంటూరు జడ్‌పి మాజీ చైర్మన్‌ పాతూరి నాగభూషణం చూడనున్నారు.

గతంలో జరిగిన నేషనల్‌ బీచ్‌ కబడ్డీ ఛాంపియన్‌షిప్‌ పోటీల్లో ఆంధ్రప్రదేశ్‌ జట్టు మంచి ప్రతిభను కనబరిచిందని, ఈసారి జరిగే పోటీల్లో కూడా ప్రతిభను కనబరచడంతోపాటు ట్రోఫీని కూడా గెల్చుకోవాలని ఆర్గనైజింగ్‌ కమిటీ చైర్మన్‌ జయరామ్‌ కోమటి అన్నారు. ఈ పోటీల నిర్వహణపై విజయవాడలోని క్రీడాప్రాధికార సంస్థలో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్ర కబడ్డీ అసోసియేషన్‌ కార్యదర్శి వి. వీర్లంకయ్య మాట్లాడుతూ, ఈ పోటీల్లో దేశవ్యాప్తంగా సుమారు 50 నుంచి 60 జట్లు పాల్గొంటాయని, మ్యాచ్‌లు లీగ్‌కమ్‌  నాకౌట్‌ పద్ధతిలో జరుగుతుందని ఆయన పేర్కొన్నారు. క్రీడా మైదానం వడ్లపూడిలోని పాతూరి నాగభూషణంకు చెందిన 3 ఎకరాల స్థలంలో ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. ఈ సమావేశంలో కబడ్డీ జిల్లా సెక్రటరీ వై.శ్రీకాంత్‌ కూడా పాల్గొన్నారు.