ఇండోర్‌లో ఘనంగా ప్రవాసీ భారతీయ దివస్‌

ఇండోర్‌లో ఘనంగా ప్రవాసీ భారతీయ దివస్‌

ఎన్నారైల సేవను ప్రశంసించిన ప్రధాని మోదీ

ప్రవాస భారతీయులను విదేశీ గడ్డపై భారత్‌కు బ్రాండ్‌ అంబాసిడర్లుగా ప్రధాని నరేంద్ర మోదీ అభివర్ణిస్తూ, వారు చేస్తున్న సేవా కార్యక్రమాలను ప్రశంసించారు. రాబోయే 25 ఏళ్ల అమృతకాల ప్రయాణంలో వారి పాత్ర అత్యంత కీలకమని కూడా ఉద్ఘాటించారు. మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌లో 17వ ప్రవాసీ భారతీయ దివస్‌ సదస్సును ఆయన ప్రారంభించి మాట్లాడారు.  మధ్యప్రదేశ్‌ ప్రభుత్వం భాగస్వామ్యంతో జనవరి 08 నుండి జనవరి 10 వరకూ ఇండోర్‌లో ఈ వేడుకలు ఘనంగా జరిగాయి. ప్రధానమంత్రితోపాటు, కేంద్రమంత్రులు, ఇతర దేశ అతిధులు, అమెరికా, ఇతర దేశాల నుంచి వచ్చిన ఎన్నారైలు ఈ వేడుకల్లో పాల్గొన్నారు. కార్యక్రమానికి ప్రత్యేక గౌరవ అతిథిగా సురినామ్‌ అధ్యక్షుడు చంద్రికాప్రసాద్‌ సంతోఖీ, ముఖ్య అతిథిగా గయనా అధ్యక్షుడు మొహమ్మన్‌ ఇర్ఫాన్‌ అలీ హాజరయ్యారు.

ప్రధానమంత్రి నరేంద్రమోదీ తన ప్రసంగంలో పలు విషయాలను పేర్కొన్నారు. దాదాపు 66 దేశాల నుంచి వచ్చిన ఎన్నారైలను ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ, ప్రవాసీల ఘనతలను రికార్డు చేయాల్సిన అవశ్యకతను తెలియజేశారు. ఎన్నారైలు భారత దూతలు. మన యోగా, ఆయుర్వేదం, హస్తకళలు, చిరుధాన్యాలు, కాటేజీ పరిశ్రమకు మీరు బ్రాండ్‌ అంబాసిడర్లని అంటూ, ప్రపంచ వేదికపై భారత్‌ పాత్ర మీ వల్లే బలోపేతం కానున్నదన్నారు. స్కిల్‌ క్యాపిటల్‌గా కూడా ఎదిగే సామర్థ్యం భారత్‌కుంది. ప్రపంచ ప్రగతికి ఇంజన్‌గా మారనుంది. భారత్‌ గురించి తెలుసుకొనేందుకు ప్రవాసీల సంతానం ఆసక్తి చూపుతుండడం శుభపరిణామం. భారతీయులు ఎన్నో దేశాలకు వలస వెళ్లి శతాబ్దాలుగా స్థిరపడ్డారు. వారి జీవితాన్ని, ఎదుర్కొన్న కష్టానష్టాలు, చేసిన పోరాటాలు, సాధించిన విజయాలను రికార్డు చేయాల్సిన అవసరముంది. ఇందుకు భారత వర్సిటీలు చొరవ తీసుకోవాలి. వారి అనుభవాలు, జ్ఞాపకాలను ఆడియో`విజువల్‌, అక్షరరూపంలో నమోదు చేయాలని కోరారు. జీ20 సారథ్య బాధ్యతను ఒక మంచి అవకాశంగా భావిస్తున్నాం. మన గురించి ప్రపంచదేశాలకు తెలియజేయడానికి ఇది సరైన వేదిక. ప్రపంచంలో భారత్‌ పాత్ర గణనీయంగా పెరుగుతోంది. మన మాటకు, సందేశానికి ఎంతో విలువ ఉంది. కరోనా టీకాలను దేశీయంగానే అభివృద్ధి చేసుకున్నాం. 220 కోట్ల టీకా డోసులను ఉచితంగా అందించాం. మన అభివృద్ధి అసాధారణం, అద్వితీయం అన్నారు.

ప్రపంచంలోని ఐదు అత్యున్నత ఆర్థిక వ్యవస్థల్లో భారత్‌ కూడా ఒకటిగా మారింది. అత్యధిక స్టార్టప్‌లు ఉన్న మూడో దేశం మనదే. నేడు ప్రపంచం భారత్‌ వైపు చూస్తోంది. కొన్నేళ్లుగా మనం సాధించిన ఘనతలు అసాధారణం, అద్వితీయం. ప్రపంచంలో జరుగుతున్న మొత్తం డిజిటల్‌ లావాదేవీల్లో 40 శాతం కేవలం భారత్‌లోనే జరుగుతున్నాయి. మనకు అత్యాధునిక స్పేస్‌ టెక్నాలజీ ఉంది. అంతరిక్షంలోకి ఒకేసారి 100 ఉపగ్రహాలను పంపించగల సత్తా మన సొంతమన్న విషయాన్ని ఎన్నారైలకు ఆయన తెలియజేశారు.

ఎన్‌ఆర్‌ఐల ప్రయోజనాలను కాపాడేందుకు కట్టుబడి ఉన్నామని, వారికి అవసరమైన సాయం కచ్చితంగా అందిస్తామని అంటూ, మన సాంస్కృతిక, ఆధ్యాత్మిక పరిజ్ఞానాన్ని కాపాడాలని ఎన్‌ఆర్‌ఐలను కోరుతున్నట్లు చెప్పారు. విదేశాల్లో భారతదేశ ప్రతిష్టను మరింత పెంచాలని, మన దేశ ఔన్నత్యాన్ని చాటిచెప్పాలని విన్నవిస్తున్నాం’’ అని ప్రధాని మోదీ వెల్లడిరచారు. మధ్యప్రదేశ్‌లో ఎన్నో పర్యాటక ప్రాంతాలు ఉన్నాయని, వాటిని సందర్శించాలని ఎన్‌ఐఆర్‌లకు సూచించారు. సురక్షిత, చట్టబద్ధ వలసల ప్రాధాన్యాన్ని తెలియజేస్తూ ప్రత్యేక పోస్టల్‌ స్టాంప్‌ను ప్రధాని విడుదల చేశారు.

 

Tags :