రివ్యూ: '18 పేజెస్' లవ్ స్టోరీ

రివ్యూ: '18 పేజెస్' లవ్ స్టోరీ

తెలుగుటైమ్స్.నెట్ రేటింగ్ : 3/5
నిర్మాణ సంస్థలు : GA2 పిక్చర్స్ అండ్ సుకుమార్ రైటింగ్స్
నటీనటులు : నిఖిల్ సిద్ధార్థ, అనుపమా పరమేశ్వరన్, సరయు, దినేష్ తేజ్, అజయ్, పోసాని కృష్ణమురళి తదితరులు
ఎడిటర్  : నవీన్ నూలి, సినిమాటోగ్రఫీ  : వసంత్, సంగీతం : గోపి సుందర్
రచయిత : శ్రీకాంత్ విస్సా, కథ : సుకుమార్, సమర్పణ : అల్లు అరవింద్
నిర్మాత : 'బన్నీ' వాస్, స్క్రీన్ ప్లే, దర్శకత్వం : పల్నాటి సూర్య ప్రతాప్
విడుదల తేదీ : 23.12.2022

'కార్తికేయ 2'తో నిఖిల్ పాన్ ఇండియా హిట్ అందుకున్నారు. అందులో నాయికగా నటించిన అనుపమా పరమేశ్వరన్ తో ఆయన నటించిన రెండో సినిమా '18 పేజెస్'. దీనికి సుకుమార్ కథ అందించారు. 'కుమారి 21ఎఫ్'కు దర్శకత్వం వహించిన సూర్య ప్రతాప్ దర్శకత్వం వహించారు. జీఏ2 పిక్చర్స్ మీద 'బన్నీ' వాస్ నిర్మించారు. 'కార్తికేయ 2' విజయం తర్వాత నిఖిల్, అనుపమ జోడీ నటించిన సినిమా కావడం... సుకుమార్, అల్లు అరవింద్ పేర్లు యాడ్ కావడంతో సినిమాపై అంచనాలు పెరిగాయి. మరి, సినిమా ఎలాఉందొ రివ్యూ లో చూద్దాం?

కథ :

సిద్ధూ అలియాస్ సిద్ధార్థ్ (నిఖిల్) యాప్ డెవలపర్. తనను ఒక అమ్మాయి ప్రేమ పేరుతో చేట్ చేసిందని బ్రేకప్ బాధలో... మందు కొడుతూ... రోడ్ల వెంట తిరుగుతున్న సమయంలో ఓ డైరీ దొరుకుతుంది. దానిని చదువుతూ... సోషల్ మీడియాకు దూరంగా, మనుషులకు దగ్గరగా జీవించే అమ్మాయి, ఆ డైరీ రాసిన నందిని (అనుపమా పరమేశ్వరన్) తో ప్రేమలో పడతాడు. డైరీలో పేజీలు చదవడం పూర్తయ్యాక... ఆమెను నేరుగా కలవాలని ఊరు వెళతాడు. కానీ, ఊరిలో ఆమె ఉండదు. హైదరాబాద్ తిరిగొచ్చిన సిద్ధూకి ఓ కవర్ కోసం నందిని మీద అటాక్స్ జరిగాయని, చంపడానికి చూశారని తెలుస్తుంది. పేపరులో నందిని మరణించిందని న్యూస్ ఉంటుంది. అసలు, ఆ కవర్ లో ఏముంది? నిజంగా నందిని మరణించిందా? లేదా? కనీసం ముఖం కూడా చూడకుండా డైరీ చదివి ప్రేమించిన సిద్ధూ పరిస్థితి ఏంటి? చివరకు ఏమైంది? అనేది వెండితెరపై చూడాలి.  

నటి నటుల హావభావాలు:

నిఖిల్ కొత్తగా కనిపించాడు. ఆయన క్యారెక్టర్ మన పక్కింటి కుర్రాడిలా, మన ఆఫీసులో పని చేసే కొలీగ్‌గా ఉంటుంది. సిద్ధూ పాత్రలో జీవించాడు. స్మార్ట్ ఫోన్స్, సోషల్ మీడియాకు అడిక్ట్ అయిన ఈ తరం యువతకు అనుపమా పరమేశ్వరన్‌ క్యారెక్టర్ కొత్తగా ఉంటుంది. ప్రతి అమ్మాయి  అలా ఉంటే బావుంటుందని అనిపిస్తుంది. అంత చక్కగా ఆ క్యారెక్టర్ డిజైన్ చేశారు. అనుపమ కూడా చక్కగా నటించారు. హీరో స్నేహితురాలిగా సరయుకు పంచ్ డైలాగ్స్ వేసే ఛాన్స్ వచ్చింది. ఆమె కొన్ని సన్నివేశాల్లో నవ్విస్తారు. పోసాని కృష్ణమురళి, అజయ్, దినేష్ తేజ్ పాత్రల పరిధి సినిమాలో తక్కువే. ఉన్నంతలో వాళ్ళు చక్కగా నటించారు.

సాంకేతికవర్గం పని తీరు :

ప్రేమకథకు సుకుమార్ అండ్ రైటింగ్ టీమ్ ఇచ్చిన ట్విస్టులు బావున్నాయి. ఒక వైపు ప్రేమను ఫీల్ అవుతూ... మరోవైపు చిన్న టెన్షన్‌తో నెక్స్ట్ ఏం జరుగుతుంది? అని ప్రేక్షకుడు ఫీలయ్యేలా కథను ముందుకు నడిపారు. సూర్యప్రతాప్ డైరెక్షన్ డీసెంట్‌గా ఉంది. నిఖిల్, అనుపమ జోడీకి తోడు గోపీసుందర్ హిట్ & క్యాచీ సాంగ్స్, నేపథ్య సంగీతం స్క్రీన్ మీద మేజిక్ చేశాయి. కథ, సన్నివేశాలకు మంచి సంగీతం, సినిమాటోగ్రఫీ తోడు కావడంతో సరదాగా సినిమా సాగుతుంది.  సినిమా ఫస్టాఫ్ హీరో హీరోయిన్ల ఇంట్రడక్షన్, పాటలు, సరదా సన్నివేశాలతో సాగింది. ఇంటర్వెల్ ట్విస్ట్ కొంచెం షాక్ ఇస్తుంది. ఇంటర్వెల్ తర్వాత క్లైమాక్స్ ఎలా ఉంటుందో ఊహించడం పెద్ద కష్టం కాదు. కానీ, క్లైమాక్స్ వరకు కథను నడిపిన తీరు బావుంది. 'టైమ్ ఇవ్వు పిల్లా...' సాంగ్ క్యాచీగా ఉంది. 'నిదురన్నది లేదే ఓ పిల్లా నీ వల్ల...', 'నన్నయ్య రాసిన...' పాటల్లో సాహిత్యం సన్నివేశాలకు తగ్గట్టు ఉంది. కెమెరా వర్క్ చాలా నీట్‌గా ఉంది. 

విశ్లేషణ:

ఈ సినిమాలో ప్రేమకథకు మించి ట్విస్టులు ఉన్నాయని హీరో నిఖిల్ చెప్పారు. సినిమా చూస్తే అది నిజమే అనిపిస్తుంది. ఇదొక ప్రేమకథ మాత్రమే కాదు ఈతరం ప్రేమకథలకు భిన్నమైన కథతో '18 పేజెస్' రూపొందింది. ప్రేమకథ, థ్రిల్లింగ్ నేరేషన్  మధ్య మిక్సింగ్ కరెక్టుగా కుదిరింది. సినిమాలో బ్యూటీ ఏంటంటే... హీరో హీరోయిన్లు ఎక్కడా కలవకపోయినా వాళ్ళ ప్రేమను మనం ఫీల్ అవుతాం. హృదయానికి హత్తుకునే చక్కటి సంగీత భరిత ప్రేమకథా చిత్రమిది.  వీకెండ్ హ్యాపీగా టైమ్‌పాస్ చేయొచ్చు. సోషల్ మీడియాకు అడిక్ట్ అవుతున్న యువతకు, వృద్ధులను విస్మరిస్తున్న తల్లిదండ్రులకు చక్కటి సందేశం ఇస్తుంది.లాజిక్కులు వెతుకుతూ కూర్చుంటే స్క్రీన్ మీద మేజిక్ ఎంజాయ్ చేయడం కష్టం.

 

 

Tags :