దేశ రాజధానిలో బాంబు కలకలం... ఉలిక్కిపడ్డ ఢిల్లీ

దేశ రాజధానిలో బాంబు కలకలం...  ఉలిక్కిపడ్డ ఢిల్లీ

దేశ రాజధాని ఢిల్లీ లో గుర్తుతెలియని దుండగులు బాంబు కలకలం రేపింది. ఘాజీపూర్‌ పూల మార్కెట్‌ సమీపంలో అనుమానాస్పద స్థితిలో ఓ బ్యాగును గుర్తించారు. దీనిపై వెంటనే స్థానికులు పోలీసులకు సమచారమిచ్చారు. అక్కడకు చేరుకున్న పోలీసులు బాంబు స్క్వాడ్‌ తో పాటు ఎన్‌ఎస్‌జీకి సమాచారం అందించారు. అనంతరం ఎన్‌ఎస్‌జీ, బాంబు స్క్వాడ్‌ బృందాలు ఆ బ్యాగును  పరిశీలించగా అందులో ఐఈడీ పేలుడు పదార్థాలు ఉన్నట్లు గుర్తించారు. వెంటనే నిర్జన ప్రదేశానికి తీసుకెళ్లిన ఎన్‌ఎస్‌జీ బృందాలు ఆ బాంబును నిర్వీర్యం చేయడంతో భారీ ప్రమాదం తప్పింది. అయితే బాంబు ఎవరు పెట్టారన్న దానిపై పోలీసులు, భద్రతా దళాలు దర్యాప్తు ప్రారంభించాయి.

ఢిల్లీ ఘాజీపూర్‌ పూల మార్కెట్‌కు స్కూటీపై చేరుకున్న ఓ వ్యక్తి ఓ దుకాణానికి సమీపంలో ఓ బ్యాగును వదిలిపెట్టి వెళ్లిపోయాడు. దాన్ని గమనించిన సదరు షాపు యజమాని ఈ విషయాన్ని పోలీసులకు తెలియజేశాడు. దీంతో వెంటనే పోలీసులు అక్కడకు చేరుకున్నట్లు ఢిల్లీ  పోలీస్‌ కమిషన్‌ రాకేశ్‌ ఆస్థానా మీడియాకు తెలిపారు. అయితే  ఆ వ్యక్తి ఎవరనే కోణంలో దర్యాప్తు ముమ్మరం చేసినట్లు తెలిపారు. ఇందుకు సంబంధించి ఢిల్లీ పోలీస్‌ స్పెషల్‌ సెల్‌లో కేసు నమోదు చేశామని తెలిపారు. గణతంత్ర దినోత్సవానికి కొద్దిరోజుల ముందే బాంబు ఘటన వెలుగుచూడటంతో నేషనల్‌ సెక్యూరిటీ గార్డు సిబ్బంది, స్థానిక పోలీసులు అప్రమత్తమయ్యారు.  ప్రస్తుతం ఢిల్లీ లో హై అలెర్ట్‌ కొనసాగుతుంది.

 

Tags :