రివ్యూ : టైటిల్‌కి తగ్గట్టుగా 'ఆడవాళ్లు మీకు జోహార్లు'

రివ్యూ : టైటిల్‌కి తగ్గట్టుగా 'ఆడవాళ్లు మీకు జోహార్లు'

తెలుగుటైమ్స్.నెట్ రేటింగ్ : 2.5/5

నిర్మాణ సంస్థ :శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్‌
నటీనటులు : శర్వానంద్‌, రష్మిక, ఖుష్భూ, రాధిక, ఊర్వసి, వెన్నెల కిషోర్‌, సత్య తదితరులు
సంగీతం : దేవీశ్రీ ప్రసాద్‌; సినిమాటోగ్రఫీ : సుజిత్‌ సారంగ్‌; ఎడిటర్‌: శ్రీకర్‌ ప్రసాద్‌
నిర్మాత: సుధాకర్ చెరుకూరి; దర్శకత్వం : కిశోర్ తిరుమల
విడుదల తేది : 04.03.2022

యంగ్‌ హీరో శర్వానంద్‌కు సరైన హిట్ పడి చాలా కాలం అయింది. ‘మహానుభావుడు’ తర్వాత ఆయనకు మరో సక్సెస్‌ దక్కలేదు. ఇటీవల ఆయన తీసిన ‘శ్రీకారం’, ‘మహాసముంద్రం’ చిత్రాలు బాక్సాఫీస్‌ వద్ద బోల్తా పడ్డాయి. దీంతో ఈ సారి పక్కా హిట్‌ కొట్టాలనే కసితో  ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌ని ఎంచుకున్నాడు. గోల్డెన్ గర్ల్  రష్మిక మందన్నతో కలిసి కుటుంబ క‌థా చిత్రాల‌ను తెర‌కెక్కించే ద‌ర్శ‌కుడు తిరుమ‌ల కిషోర్‌తో ‘ఆడవాళ్లు మీకు జోహార్లు’సినిమాతో  ప్రేక్షకులను పలకరించాడు. ఇప్పటికే విడుదలైన పాటలు, ట్రైలర్‌కు పాజిటివ్‌ టాక్‌ రావడంతో పాటు సినిమాపై అంచనాలను క్యూరియాసిటీని పెంచేసింది. భారీ అంచనాల మధ్య ఈ రోజు శుక్రవారం మార్చి 4న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రాన్ని ప్రేక్షకులు ఏ మేరకు ఆదరించారో రివ్యూలో చూద్దాం.
కథ:

ఉమ్మడి కుటుంబంలో పుట్టి పెరిగిన చిరంజీవి అలియాస్‌ చిరుకి(శర్వానంద్‌) ఆది ల‌క్ష్మి(రాధిక‌) కొడుకు. ఆమె నలుగురు చెల్లెళ్లు కూడా త‌న‌ని త‌మ సొంత కొడుకులాగా పెంచుతారు. త‌న ఆస్థిగా వ‌చ్చిన ప‌ద్మావ‌తి క‌ళ్యాణ మండ‌ప నిర్వ‌హ‌ణంతా చిరంజీవే చూసుకుంటుంటాడు.  అయితే ఏజ్‌ బార్‌ అయినా ఇంకా పెళ్లి కాదు. తనతో పాటు తన కుటుంబం మొత్తానికి నచ్చే అమ్మాయినే పెళ్లి చేసుకోవాలని తన లక్ష్యం. అయితే కుటుంబ సభ్యులు మాత్రం పెళ్లి చూపులకు వెళ్లి వచ్చిన ప్రతి అమ్మాయిని ఏదో ఒక వంక చెప్పి రిజెక్ట్‌ చేస్తారు. దీంతో తన జీవితంలో ఇక ‘మాంగళ్యం తంతునానేనా ’అనే మంత్రాన్ని ఉచ్చరించనేమోనని బాధపడుతున్న క్రమంలో ఆద్య(రష్మిక) పరిచయం అవుతుంది. ఆ పరిచయం కాస్త ప్రేమగా మారుతుంది. ఆద్యకు కూడా చిరుపై ప్రేమ ఉన్నప్పటికీ.. అతని ప్రపోజ్‌ని రిజెక్ట్‌ చేస్తుంది. దానికి కారణం తన తల్లి వకుళ(కుష్బూ)కు పెళ్లి అంటే నచ్చకపోవడం. వకుళను ఒప్పిస్తేనే ఆద్య తనకు దక్కుతుందని భావించిన చిరు.. ఓ చిన్న అబద్దం చెప్పి ఆమెకు దగ్గరవుతాడు. ప్రేమ‌ను గెలిపించుకోవ‌డం కోసం ఆమె ఇంట్లోకి అడుగు పెడ‌తాడు. ఆ తర్వాత ఎలాంటి పరిణామాలు చోటు చేసుకున్నాయి? అసలు వకుళకు పెళ్లి అంటే ఎందుకు నచ్చదు? ఆమె నేపథ్యం ఏంటి? మ‌రి చిరు ప్ర‌య‌త్నం ఫ‌లిస్తుందా? ఆద్య అమ్మ న‌మ్మ‌కాన్ని గెలుచుకుంటాడా? ప్రేమ‌లో విజ‌యాన్ని సాధిస్తాడా?  అనేది తెలుసుకోవాలంటే సినిమా  చూడాల్సిందే...

నటీనటుల హావభావాలు :

చిరంజీవిగా శర్వానంద్‌ ఆకట్టుకున్నాడు. వధువు కోసం అన్వేషించి, విసిగిబేజారెత్తిన  ఏజ్‌ బార్‌ బ్యాచిలర్‌గా తనదైన నటనతో ఆకట్టుకున్నాడు. గత చిత్రాలకు భిన్నంగా  ఈ సినిమాను కాస్త డిఫ‌రెంట్‌గా చేసిన‌ట్టే అనిపించింది. ఇక ఆద్య పాత్రలో రష్మిక ఒదిగిపోయింది. చీర‌క‌ట్టులో చూడ‌చ‌క్క‌గా చాలా అందంగా కనిపించింది. హీరో తల్లి ఆదిలక్ష్మీగా రాధిక పర్వాలేదనిపించింది. పద్మమ్మగా ఊర్వశి తనదైన కామెడీతో నవ్వులు పూయించింది. ఇక హీరోయిన్‌ తల్లి వకుళ పాత్రకు ఖుష్భూ న్యాయం చేసింది. సినిమాలో చాలా బలమైన పాత్ర తనది. హీరో స్నేహితుడిగా వెన్నెల కిశోర్‌ ఎప్పటి మాదిరే తనదైన పంచ్‌ డైలాగ్స్‌తో నవ్వించాడు. పెళ్లి కూతురు తండ్రి బుజ్జిగా బ్రహ్మానందం తళుక్కున మెరిసి వెళ్లాడు. మిగిలిన నటీ, నటులు తమ పాత్రల పరిధిమేర నటించారు.

సాంకేతిక వర్గం పనితీరు:

తిరుమ‌ల కిషోర్ గ‌త చిత్రాల‌ను గ‌మ‌నిస్తే ఆయ‌న రామ్ కోసం డైరెక్ట్ చేసిన రీమేక్ సినిమా రెడ్ మినహా మిగ‌తావ‌న్నీ ప్రేమ‌లు, బంధాలు, బాంధ‌వ్యాలు మీద‌నే న‌డిచే సినిమాలే ఎక్కువ. హీరోయిన్ ప్రేమ కోసం హీరో ఆమె ఇంటికి వెళ్ల‌డం అక్క‌డ ప‌రిస్థితుల‌ను చ‌క్క‌దిద్ద‌డం.. త‌ర్వాత పెద్ద‌లే హీరో ప్రేమ‌ను అర్థం చేసుకోవ‌డం అనే పాయింట్ మీద 'నేను శైల‌జ' సినిమాను డైరెక్ట్ చేశారు. ఆడ‌వాళ్ళు మీకు జోహార్లు సినిమా మెయిన్ ప్లాట్ కూడా అదే అనిపించింది.  దేవిశ్రీ ప్ర‌సాద్ అందించిన సంగీతంలో టైటిల్ ట్రాక్ ఆక‌ట్టుకుంటుంది. సెకండాఫ్‌లో వ‌చ్చే ఎమోష‌న‌ల్ సాంగ్ కూడా బావుంది. ఇక మిగిలిన పాట‌లు ఓకే నేప‌థ్య సంగీతం బావుంది. సుజిత్ కెమెరా వ‌ర్క్ బావుంది. నిర్మాణ విలువలు సినిమాకు తగ్గట్టు వున్నాయి. 

విశ్లేషణ :

శర్వానంద్‌ లాంటి టాలెంటెడ్‌ హీరో, రష్మిక లాంటి బ్యూటిఫుల్‌ హీరోయిన్‌.. రాధిక, ఖుష్బూ, ఊర్వశి లాంటి సీనియర్‌ నటీమణులు, వీళ్లంతా కలిసి నటించిన చిత్రం కావడంతో తొలి నుంచి ‘ఆడవాళ్లు మీకు జోహార్లు’ భారీ అంచనాలు ఉన్నాయి. చెప్పుకోవడానికి పెద్ద పేరున్న నటీ, నటులను తీసుకున్నాడు తప్పా.. వారి పాత్రలకు తగిన ప్రాధాన్యత మాత్రం సినిమాలో లేదు. అలాగే ఇటీవల కాలంలో టాలీవుడ్‌లో ఫ్యూర్‌ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌ మూవీ రాకపోవడంతో... ఈ సినిమా కచ్చితంగా ఆ లోటుని తిరుస్తుందని భావించారు అంతా. కానీ ప్రేక్షకుల అంచనాలు తప్పాయి. ఇక సెకండాఫ్‌లో హీరోయిన్ ఇంటికి హీరో వెళ్ల‌డం అక్క‌డ ప‌రిస్థితుల‌ను చ‌క్క‌దిద్ద‌డం హీరోయిన్ త‌ల్లికి హీరోపై స‌ద‌భిప్రాయం ఏర్ప‌డ‌టం అనే స‌న్నివేశాలు కూడా కామ‌న్‌గా చాలా సినిమాల్లో చూసిన‌వే అనిపిస్తాయి. ఫైట్స్‌, భారీ డైలాగులు లాంటి గందరగోళం  లేకుండా కుటుంబంతో సినిమా చూడాలనుకునే ఫ్యామిలీ ఆడియెన్స్ ఓసారి ఈ చిత్రాన్ని చూడొచ్చు.

 

Tags :