ఆయన జైలు నుంచి బయటికి రావడం.. కేంద్ర దర్యాప్తు సంస్థలకు ఇష్టం లేదు

ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియాపై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ మరో కేసు నమోదు చేయడంపై ఆమ్ ఆద్మీ పార్టీ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆమ్ ఆద్మీ పార్టీ అధికార ప్రతినిధి, రాజ్యసభ సభ్యుడు రాఘవ్ చద్దా మీడియాతో మాట్లాడుతూ సిసోడియా జైలు నుంచి బయటికి రావడం కేంద్ర దర్యాప్తు సంస్థలకు ఇష్టం లేదని ఆరోపించారు. కేంద్ర దర్యాప్తు సంస్థలు సిసోడియాపై మరో తప్పుడు కేసు బనాయించాయని, ఆయన జైలు నుంచి బయటికి రావడం వారికి ఇష్టం లేదని వ్యాఖ్యానించారు. ఫీడ్ బ్యాక్ యూనిట్ పేరుతో మనీష్ సిసోడియా పై మరో తప్పుడు కేసు నమోదు చేశారు. ప్రధానిపై సిసోడియా గూఢరచర్యానికి పాల్పడ్డారని వారు ఆరోపిస్తున్నారు. ఎందుకంటే ప్రధాని మోదీ, సిసోడియా ఇద్దరిలో ఎవరు శక్తిమంతులో కేంద్ర దర్యాప్తు సంస్థలకు తెలియదు. అందుకే ఎనిమిదేండ్లుగా గూఢచర్యం కొనసాగుతున్నదని ఆరోపిస్తున్నారు అని ఎద్దేవా చేశారు. మరి ఎనిమిదేండ్లుగా ప్రధానిపై గూడచర్యం కొనసాగుతుంటే కేంద్ర దర్యాప్తు సంస్థలు ఏం చేస్తున్నట్టని ఆయన ప్రశ్నించారు.