ఇండియా డే వేడుకల్లో ‘ఆపి’ నాయకులు

అమెరికాలో భారత సంతతి వైద్యులు ఏర్పాటు చేసుకున్న అమెరికన్ అసోసియేషన్ ఆఫ్ ఫిజీషియన్స్ ఆఫ్ ఇండియన్ ఆరిజిన్ (ఆపి) నాయకులు న్యూయార్క్‌లో ఎఫ్‌ఐఎ ఆధ్వర్యంలో జరిగిన ఇండియా డే వేడుకల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు అందరికీ ఆరోగ్యం కలగాలన్న సందేశాన్ని చాటారు. 21 ఆగస్టున న్యూయార్క్ లో జరిగిన ఈ ఇండియా డే పరేడ్ లో పాల్గొన్నారు. భారత్ దేశ ప్రతినిధిగా గ్రాండ్ మార్షల్ హోదాలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హాజరయ్యారు. ఆపి సంస్థ లోగోలతో ప్రతినిధులందరూ న్యూయార్క్ నగరంలో తిరుగుతున్న సమయంలో స్థానికుల నుంచి మంచి ఆదరణ లభించింది. మార్గమధ్యంలో చప్పట్లతో సంస్థ ప్రతినిధులను అభినందించారు.
సంస్థ ప్రతినిధులందరూ సంస్థ బ్యానర్లు, భారత జాతీయ జెండాలు చేత పట్టుకొని భారత దేశానికి ఘనంగా సెల్యూట్ చేశారు. ఇకసంస్థ ప్రతినిధులందరూ 75 వ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా భారత్ కీర్తిని గుర్తు చేసుకుంటూ మెలోడీ ట్యూన్స్ కు డ్యాన్స్ చేస్తూ, పాటలు పాడుకున్నారు. ఈ ఇండియా డే పరేడ్ లో ఆపి సంస్థ ప్రెసిడెంట్ డాక్టర్ రవి కొల్లితో పాటు ప్రాంతీయ డైరెక్టర్లు, దేశంలోని వివిధ ప్రాంతాలకు చెందిన సభ్యులు, ప్రపంచ వ్యాప్తంగా ఉన్న సభ్యులందరూ కలిసి భారతీయ అమెరికన్ వైద్యులు చేస్తున్న సేవా కార్యక్రమాలను ప్రశంసిస్తూ, వారే దేశానికి నిజమైన హీరోలంటూ అభినందించారు. తమ ప్రాణాలను పణంగా పెట్టి, ఇతరులకు సహాయం చేయడానికి ముందుకు వచ్చిన హీరోలంటూ అభివర్ణించారు. ప్రెసిడెంట్ డాక్టర్ రవి కొల్లితో పాటు, డాక్టర్ అంజనా సమద్దార్, డాక్టర్ సామ్యూల్ రవల్, ఆపి కోశాధికారి డాక్టర్ రంగా, డాక్టర్ హెటల్ గోర్, రీజినల్ డైరెక్టర్ డాక్టర్ జగదీశ్ గుప్తా, డాక్టర్ రఘు లోలాభట్లు, డాక్టర్ కవితా గుప్త, డాక్టర్ సుధాకర్ జొన్నలగడ్డ, డాక్టర్ దుర్గేశ్ మన్ కిక్రర్, ఉదయ శివాగ్ని, డాక్టర్ భవానీ శ్రీనివాసన్ తదితరులు పాల్గొన్నారు.