కళాకారుల సేవలో ఎబిఆర్

కళాకారుల సేవలో ఎబిఆర్

అమెరికాలోని కమ్యూనిటీకి, జన్మభూమిలోని ప్రజలకు, తనవంతుగా సేవ చేయాలన్న ఉద్దేశ్యంతో అనిల్‌ రెడ్డి అటు తెలుగు సంఘాల్లో కీలకపాత్ర పోషిస్తూ, మరోవైపు తన టీవీ ఛానల్‌ ఎబిఆర్‌ ద్వారా మరుగునపడిన కళలను, కళాకారులను వెలుగులోకి తీసుకువస్తున్నారు. అట్లాంటాలో స్థిరపడిన అనిల్‌ రెడ్డి గ్రేటర్‌ అట్లాంటా తెలంగాణ సొసైటీకి చైర్మన్‌గా, ఎఫ్‌ఐఎ, తామా ఇతర సంఘాల్లో కీలకంగా పనిచేసి ప్రస్తుతం అమెరికా తెలుగు సంఘం (ఆటా)లో బోర్డ్‌ మెంబర్‌గా కొనసాగుతున్నారు. సేవ చేయడంతోపాటు, సహాయపడటంలో ఎల్లప్పుడూ ముందుండే  అనిల్‌ రెడ్డి కరోనా సమయంలో కళాకారులు పడుతున్న ఇబ్బందులను గమనించారు. వారికోసం ఏదైనా చేయాలన్న తపనతో ఎపిఆర్‌ ఛానల్‌ను ఏర్పాటు చేశారు.

ఈ ఛానల్‌ ద్వారా మరుగున పడిన కళలను వెలుగులోకి తీసుకురావడంతోపాటు పల్లెల్లోనూ, ఇతర చోట్ల ఉన్న ప్రతిభావంతులైన కళాకారుల ప్రతిభను తెలియజేయడానికి ఈ ఛానల్‌ను ఆయన వేదికగా మార్చారు. దాంతో ఈ ఛానల్‌ ద్వారా ఎంతోమంది తమ కళా ప్రతిభను ప్రదర్శించారు. ఎంతోమంది ఎన్నారైలు, తెలుగు సంఘాలవారు చేసే కార్యక్రమాలను కూడా తన ఛానల్‌ ద్వారా లైవ్‌ చేస్తున్న అనిల్‌ రెడ్డి కళాకారులకు డబ్బులివ్వడం వల్ల తాత్కాలికంగా ప్రయోజన లభించవచ్చని, అలా కాకుండా వారి ప్రతిభను అందరికీ తెలియజేస్తే వారికి పదిచోట్ల ఉపాధి లభిస్తుందన్న ఉద్దేశ్యంతో తన ఛానల్‌ ద్వారా కార్యక్రమాలను చేస్తున్నట్లు చెప్పారు. ఎబిఆర్‌ టీవీ ద్వారా, ఎబిఆర్‌ ప్రొడక్షన్స్‌ ద్వారా అనగనగా మనకథలు, మన ఆటపాట, విదేశాల్లో మన విజేతలు వంటి కార్యక్రమాలను చేస్తున్నారు. అనగనగా మనకథలు ద్వారా పల్లెల్లో మరుగునపడిన కథలను వెలుగులోకి తీసుకువస్తున్నారు. మన ఆటపాట ద్వారా డప్పుల నృత్యం, చిరుతల భజన, జడకొప్పుకోలాటం, బుడబుక్కలాట వంటి కళాకారులతో ప్రదర్శనలను చేయిస్తూ, ఎన్నారైలకు వారి కళలను, కళాకారులను పరిచయం చేస్తున్నారు.

ఎబిఆర్‌ మ్యూజిక్‌ ద్వారా చిన్న చిన్న కళాకారులను, వారి గానమాధుర్యాన్ని వెలుగులోకి తెస్తున్నారు. పల్లె పలుకులు పేరుతో జానపదకళలను, పాటలను, పల్లె ముచ్చట్లను తెలియజేస్తున్నారు. ఎబిఆర్‌ న్యూస్‌, వంటలు వంటివి కూడా ఆయన ఛానల్‌ ద్వారా ప్రసారమవుతున్నాయి. కళలను ప్రోత్సహించడంతోపాటు, చిన్న చిన్న కళాకారులను వెలుగులోకి తీసుకురావడమే తన లక్ష్యమని అందుకే ఈ ఛానల్స్‌ను ఏర్పాటు చేసినట్లు చెప్పారు. ఆయన కొన్ని సినిమాలను కూడా వర్థమాన కళాకారులతో నిర్మించారు. ఇలా ఎన్నో కార్యక్రమాలతో, అటు ఆటా ద్వారా కమ్యూనిటీకి తనవంతుగా తోడ్పాటును ఆయన అందిస్తున్నారు.

 

Tags :