గెహ్లాట్ ఆశలపై నీళ్లు చల్లిన రాహుల్.. గెహ్లాట్ ఆ పదవి వదులుకోవలసిందేనా?

గెహ్లాట్ ఆశలపై నీళ్లు చల్లిన రాహుల్.. గెహ్లాట్ ఆ పదవి వదులుకోవలసిందేనా?

కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష ఎన్నికలపై సర్వత్రా ఆసక్తి నెలకొన్న సంగతి తెలిసిందే. ఈ ఎన్నికల్లో పార్టీ సీనియర్ నేతలు అశోక్ గెహ్లాట్, శశిథరూర్, దిగ్విజయ్ సింగ్ పోటీ పడుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. వీరిలో అశోక్ గెహ్లాట్ ప్రస్తుతం రాజస్థాన్ సీఎంగా ఉన్నారు. మరి కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఎన్నికయిన తర్వాత ఈ పదవి వదులుకుంటారా? అని కొందరు ప్రశ్నిస్తున్నారు. ఇలాంటి సమయంలో ఇటీవల మీడియాతో మాట్లాడిన గెహ్లాట్.. ఒకేసారి మూడు పదవులైనా చేపట్టే సత్తా తనకుందని చెప్పారు. దీంతో రాజకీయ వర్గాల్లో ఈ వ్యాఖ్యలు దుమారం రేపాయి. ఇప్పటికే రాజస్థాన్ సీఎం పదవి కోసం కాంగ్రెస్ నేత సచిన్ పైలట్ ప్రయత్నిస్తున్నారు. గతంలో ఆయన్ను కాకుండా గెహ్లాట్‌ను సీఎం చేయడంపై కొందరు నేతలు అసంతృప్తి వ్యక్తం చేశారు. దీంతో పార్టీలో చీలికలు కూడా వచ్చాయి. అయితే అధిష్టానం జోక్యం చేసుకొని సమస్య మరింత పెద్దది కాకుండా రెండు వర్గాలను శాంతపరిచింది. దీంతో వెనక్కు తగ్గిన సచిన్ పైలట్.. అధిష్టానం ఏం చెప్పినా చేసేందుకు సిద్ధంగా ఉన్నట్లు ప్రకటించారు. ఇప్పుడు కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికల బరిలో గెహ్లాట్ దిగబోతున్నారంటూ వార్తలు వస్తున్నాయి. దీంతో రాజస్థాన్ సీఎం పీఠం తనకు దక్కుతుందని సచిన్ పైలట్ భావించారు. అయితే కాంగ్రెస్ అధ్యక్ష పదవి దక్కిన తర్వాత కూడా రాజస్థాన్ సీఎంగా కొనసాగాలని గెహ్లాట్ అనుకుంటున్నారు. దీని గురించి సోనియాతో చర్చించినప్పుడు కూడా ఆయన ప్రస్తావించారట. దీనిపై రాజస్థాన్ కాంగ్రెస్ సభ్యులు అసహనంగా ఉన్న బయటపడలేదు. ఇదిలా వుండగా, గురువారం నాడు కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికల నోటిఫికేషన్ కూడా విడుదలైంది. ఈ నేపథ్యంలో భారత్ జోడో యాత్రలో పాల్గొనేందుకు కేరళ వచ్చిన ఆయనతో.. అక్కడే ఉన్న రాహుల్ సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ అంటే ఒక సిద్ధాంతమని, ఒక కుటుంబం లాంటిదని రాహుల్ అన్నారు. అలాగే ఒకరికి ఒకే పదవి సూత్రం అందరూ కచ్చితంగా పాటించాల్సిందేనని రాహుల్ తేల్చిచెప్పారట. దీంతో రాజస్థాన్ సీఎంగా కొనసాగాలని అనుకున్న గెహ్లాట్ కోరిక తీరే పరిస్థితి లేకుండా పోయింది. అలాగే సచిన్ పైలట్ లైన్ క్లియర్ అయినట్లు కనిపిస్తోంది.

 
Tags :