అలాంటి ఆలోచన ఉంటే పక్కనపెట్టండి : ఠాక్రే

నేను ఎవరికీ అనుకూలం కాదు, వ్యతిరేకం కాదు, అలాంటి ఆలోచన ఉంటే పక్కన పెట్టండి. అధిష్ఠానం చెప్పింది చేయడమే నా విధి అని కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జి మాణిక్రావు ఠాక్రే పార్టీ నేతలకు స్పష్టం చేశారు. గాంధీభవన్లో నిర్వహించిన పీసీసీ విస్తృతస్థాయి సమావేశంలో ఆయన మాట్లాడుతూ భారత్ జోడో యాత్ర మాదిరిగానే తెలంగాణలో రెండు నెలల పాటు చేపట్టనున్న హాథ్సే హాథ్ జోడో కార్యక్రమాన్ని గడపగడపకూ తీసుకువెళ్లాలని సూచించారు. ఎముకలు కొరికే చలిలో రాహుల్ గాంధీ భారత్ జోడోయాత్ర చేశారు. యాత్ర లక్ష్యాలను ఇంటింటికీ తీసుకెళ్లాల్సిన బాధ్యత ప్రతి కార్యకర్తపై ఉందన్నారు. నేతలంగా ఐక్యంగా హాథ్ సే హాథ్ జోడో యాత్ర చేయండి. పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి 50 నియోజకవర్గాలకు తగ్గకుండా యాత్ర చేస్తారు. మిగలిఇన సీనియర్లు కూడా 20, 30 నియోజకవర్గాల్లో యాత్ర చేయాలి. వచ్చే ఎన్నికలకు దృష్టిలో పెట్టుకుని ప్రతి ఒక్కరూ యాత్రను విజయవంతం చేయాలి. అంతా ఐక్యంగా పనిచేస్తే వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ గెలవడం, అధికారంలోకి రావడం ఖాయం అన్నారు. సమస్యలు ఉంటే చెప్పండి. నాకు ఫోన్ చేయండి. ఎప్పుడూ అందుబాటులోనే ఉంటా. పార్టీకి నష్టం చేసేలా ఎవరూ మీడియా ముందు మాట్లాడొద్దు అని ఠాక్రే పార్టీ నేతలకు సూచించారు.