రివ్యూ : బాలకృష్ణ 'అఖండ' నటనా విశ్వరూపం

రివ్యూ  : బాలకృష్ణ  'అఖండ' నటనా విశ్వరూపం

తెలుగు టైమ్స్.నెట్ రేటింగ్ : 3/5
నిర్మాణ సంస్థ: ద్వారకా క్రియేషన్స్‌
నటీనటులు : బాలకృష్ణ, జగపతిబాబు, శ్రీకాంత్‌, ప్రగ్యా జైశ్వాల్‌, సుబ్బరాజు, కాలకేయ ప్రభాకర్‌ తదితరులు
సంగీతం : తమన్‌, సినిమాటోగ్రఫీ : సి రామ్ ప్రసాద్, ఎడిటింగ్‌: కోటగిరి వెంకటేశ్వరరావు
నిర్మాత : మిర్యాల రవిందర్ రెడ్డి; దర్శకత్వం: బోయపాటి శ్రీను  
విడుదల తేది : 02.12.2021

ఈ ఏడాదిలో మరో బిగ్గెస్ట్ రిలీజ్ ఈరోజు అయ్యింది. న‌ట‌సింహా నందమూరి బాలకృష్ణ, స్టార్ డైరెక్టర్ బోయపాటి శ్రీను కాంబినేషన్‌లో రూపొందిన `అఖండ`పై తొలి నుంచే భారీ అంచనాలు ఉన్నాయి. ‘సింహా’, ‘లెజెండ్‌’తర్వాత ఈ హిట్‌ కాంబోలో హ్యట్రిక్‌ మూవీ కావడం, బాలకృష్ణ అఘోర గెట్ అప్, [పైగా డ్యూయెల్ రోల్ వేయడం,  ఇప్పటికే విడుదలైన ట్రైలర్‌, టీజర్‌కు పాజిటివ్‌ రెస్పాన్స్‌ రావడంతో ‘అఖండ’పై హైప్‌ క్రియేట్‌ అయింది. భారీ అంచనాల మధ్య ఈ రోజు గురువారం(డిసెంబర్‌ 2) ప్రేక్షకుల ముందుకు వచ్చిన ‘అఖండ’ప్రేక్షకులను ఏ మేరకు ఆకట్టుకుందో రివ్యూలో చూద్దాం.

కథ:

కథా విషయానికొస్తే...  అనంతపురం జిల్లాకు చెందిన మురళీకృష్ణ (బాలకృష్ణ) ఓ రైతు. ఊరికి పెద్ద, పేదవారికి అండగా ఉంటాడు. ఫ్యాక్షనిజం బాటపట్టిన యువతను దారి మళ్లీంచి ప్రతిభావంతులుగా తీర్చిదిద్దుతాడు. పేదవారి కోసం స్కూల్స్‌, ఆస్పత్రులు కట్టించి సేవ చేస్తుంటాడు. ఈ క్రమంలో అదే జిల్లాకు కొత్తగా వచ్చిన కలెక్టర్‌ శరణ్య (ప్రగ్యా జైశ్వాల్‌) మురళీ కృష్ణ మంచితనం చూసి మనసు పడుతుంది. తన ప్రేమ విషయాన్ని తెలియజేసి పెళ్లి చేసుకుంటుంది. అదే సమయంలో వరద రాజులు (శ్రీకాంత్‌) వరదా మైన్స్‌ పేరుతో మైనింగ్‌ మాఫియా నడుపుతుంటాడు. తను చేస్తున్న అక్రమాలకు అడ్డొస్తున్నవారిని దారుణంగా హతమారుస్తుంటాడు. ప్రభుత్వ అనుమతులు లేకుండా యురేనియం తవ్వకాలను ప్రారంభిస్తాడు. ఈ తవ్వకాల వల్ల  ఆ ప్రాంత ప్రజల ప్రాణాలకు ముప్పు వాటిల్లుతుంది. విషయం తెలుసుకున్న మురళీకృష్ణ.. యూరేనియం తవ్వకాలను ఆపాలని ప్రయత్నిస్తాడు. కానీ వరదరాజులు తనకున్న పలుకుబడితో అతనిపై అక్రమ కేసులు బనాయించి జైలులో పెట్టిస్తాడు. ఈ క్రమంలో అఖండ (బాలకృష్ణ) ఎంట్రీ ఇచ్చి, మురళీకృష్ణ ఫ్యామిలీకి అండగా నిలుస్తాడు. అసలు అఖండ ఎవరు? మురళీకృష్ణ కుటుంబానికి అఖండకు సంబంధం ఏంటి? మైనింగ్‌ మాఫియా లీడర్‌ వరదరాజులు వెనుక ఉన్నదెవరు? మురళీకృష్ణ ఫ్యామిలీని అఖండ ఎలా కాపాడాడు? వరదరాజు ఆగడాలకు అఖండ ఎలా అడ్డుకట్ట వేశాడు? అనే ప్రశ్నలకు సమాధానం తెలియాలి అంటే వెండితెరపై ఈ చిత్రాన్ని చూడాల్సిందే.

నటీనటుల హావభావాలు:

మరోసారి బాలకృష్ణ తనదైన నటనతో విజృంభించాడు. సినిమా మొత్తం బాలకృష్ణ వన్‌మేన్‌ షో అనే చెప్పాలి. గ్రామ పెద్ద మురళీ కృష్ణగా, అఖండగా రెండు విభిన్న రెండు వేరియేషన్ లో కూడా బాలయ్య లోని మాస్ విశ్వరూపం దేనికదే డిఫరెంట్ గా సాలిడ్ ట్రీట్ ని అందిస్తుంది. ‘జైబాలయ్య’పాటకు ఆయన వేసిన స్టెప్పులు, అఖండ రూపంలో చేసే ఫైట్స్‌ సినిమాను మరోస్థాయికి తీసుకెళ్తాయి. ముఖ్యంగా బాలయ్య అఘోర గెటప్ లో ఎంటర్ అయ్యాక సినిమా నెక్స్ట్ లెవెల్ కి వెళుతుంది. అందులో బాలయ్య లుక్స్ కానీ పవర్ ఫుల్ డైలాగ్స్ కానీ సూపర్బ్ గా అనిపిస్తాయి.. అలాగే వీటితో పాటు పలు ఎమోషనల్ సీన్స్ లో బాలయ్య హావభావాలు హత్తుకునేలా కనిపిస్తాయి. ఇంకా సాంగ్స్ లో కానీ యాక్షన్ సీన్స్ లో కానీ తన ఎనర్జిటిక్ పెర్ఫామెన్స్ సాలిడ్ ట్రీట్ ని ఇస్తుంది. జిల్లా కలెక్టర్‌గా, మురళీకృష్ణ భార్యగా ప్రగ్యా జైశ్వాల్‌ ఆకట్టుకుంది. అటవి శాఖ ప్రిన్సిపల్‌ సెక్రటరీ పద్మావతి పాత్రలో పూర్ణ అద్భుత నటనను కనబరిచింది. ఇక ఈ సినిమాలో విలన్‌గా నటించిన శ్రీకాంత్‌.. తెరపై కొత్తగా కనిపించాడు. వరద రాజులు అనే క్రూరమైన పాత్రకు ఆయన న్యాయం చేశాడు. బాలకృష్ణ, శ్రీకాంత్‌ మధ్య వచ్చే సీన్స్‌ అదరిపోతాయి. సన్యాసిగా జగపతిబాబు, నెగెటివ్‌ షేడ్స్‌ ఉండే పోలీసు అధికారి రాజన్‌గా కాలకేయ ప్రభాకర్‌, శ‌క్తిస్వరూపానందగా కనిపించిన నటుడితో పాటు మిగిలిన నటీనటులు తమ పాత్రల పరిధిమేర నటించారు.

సాంకేతిక వర్గం పనితీరు:

బాలయ్య కెరీర్ లోనే అధిక బడ్జెట్ తో తెరకెక్కించిన మరో సినిమా. ద్వారకా క్రియేషన్స్ వారి నిర్మాణ విలువలు ఈ చిత్రంలో ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా ఉన్నట్టు కనిపిస్తాయి. భారీ సెట్టింగ్స్ కానీ విజువల్స్ లో కానీ వారి రాజీ పడని తీరు కనిపిస్తుంది. ఇక దర్శకుడు బోయపాటి విషయానికి వస్తే తన హీరోని ప్రెజెంట్ చేసే విధానంలో బోయపాటి స్టైల్ సెపరేట్ గా ఉంటుంది. ఇక అది బాలయ్య విషయంలో అయితే ఏ లెవెల్లో ఉంటుందో కొత్తగా చెప్పక్కర్లేదు. కానీ ఈ సినిమాకి మాత్రం మళ్ళీ రెండు కొత్త వేరియేషన్స్ లో బాలయ్యని సరికొత్తగా ప్రెజెంట్ చేసి బోయపాటి డెఫినెట్ ట్రీట్ ఇచ్చారు. ఈ సినిమాకు ప్రధాన బలం తమన్‌ సంగీతం. జైబాల‌య్య‌, అఖండ, అడిగా అడిగా.. పాట‌లతో పాటు నేపథ్య సంగీతం అదరొట్టేశాడు. ముఖ్యంగా అఘోరా నేప‌థ్యంలో వ‌చ్చే ప్రతి సీన్‌ని తనదైన బీజీఎంతో మరోస్థాయికి తీసుకెళ్లాడు. సినిమా స్టార్టింగ్‌ మొదలు.. ఎండింగ్‌ వరకు బ్యాక్‌గ్రౌండ్‌ స్కోర్‌ అదిరిపోతుంది. రామ్‌ప్రసాద్ సినిమాటోగ్రఫీ బాగుంది. ఎం.ర‌త్నం డైలాగ్స్‌ చిత్రానికి ప్రధాన బ‌లాలుగా నిలిచాయి. కోటగిరి వెంకటేశ్వరరావు ఎడిటింగ్‌ బాగుంది. ద్వారకా క్రియేషన్స్‌ నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగినట్లుగా ఉన్నాయి.

విశ్లేషణ:

ఇక మొత్తంగా చూసుకున్నట్టయితే చాలా కాలం తర్వాత టాలీవుడ్ బాక్సాఫీస్ దగ్గరకి వచ్చిన ఈ బిగ్ రిలీజ్ “అఖండ”. ఆ హైప్ ని నిలుపుకుంటుందని చెప్పొచ్చు. బాలయ్య, బోయపాటి కాంబోపై ఉన్న అంచనాలకు తగ్గట్టుగానే వీరి నుంచి ఎక్కడా తగ్గని ట్రీట్ కనిపిస్తుంది. ఫస్టాఫ్‌ అంతా ముర‌ళీకృష్ణ - శ‌ర‌ణ్యల మ‌ధ్య ప్రేమాయ‌ణం, మైనింగ్ మాఫియా చేసే ఆకృత్యాల నేపథ్యంలో సాగుతుంది. ఇంటర్వెల్‌కి ముందు అఖండ ఆగమనం జరుగుతుంది. ఇక అక్కడి నుంచి బాలయ్య రెచ్చిపోతాడు. అఖండగా ఆయన చేసే ప్రతి ఫైట్‌ సీన్‌ బాలయ్య అభిమానులను ఈలలు వేయిస్తుంది. అయితే  సెకండాఫ్‌లో విపరీతమైన హింసకు తావిచ్చేరనే అభిప్రాయం సగటు ప్రేక్షకుడికి కలుగుతుంది. పోరాట ఘట్టాలు, డైలాగ్స్‌తోనే సినిమాను లాక్కొచ్చాడు దర్శకుడు బోయపాటి. కథను పట్టించుకోకుండా హీరోయిజంపైనే ఎక్కువ దృష్టి పెట్టినట్లు కనిపిస్తుంది. బాలయ్య కనిపించే ప్రతి సీన్‌.. ఎంట్రీ సీన్‌లాగే ఉంటుంది. ఆయన చేసే ప్రతి ఫైట్‌.. క్లైమాక్స్‌ సీన్‌ని తలపించేలా ఉంటుంది. మొత్తంగా  బాలయ్య అభిమానులకు అయితే బోయపాటి మంచి విందు భోజనం పెట్టడనిపిస్తుంది. 

 

Tags :