నిజాం ఆగడాలకు ఆపరేషన్ పోలోతో ఫుల్ స్టాప్.. విమోచన దినోత్సవ ప్రసంగంలో అమిత్ షా

నిజాం ఆగడాలకు ఆపరేషన్ పోలోతో ఫుల్ స్టాప్.. విమోచన దినోత్సవ ప్రసంగంలో అమిత్ షా

విమోచన దినోత్సవాన్ని జరుపుకునేందుకు ఇప్పటి వరకు ఏ ప్రభుత్వం సాహసించలేదని కేంద్ర హోంమంత్రి అమిత్ షా అన్నారు. కానీ ఈ ఏడాది హైదరాబాద్ విమోచన దినోత్సవాన్ని పూర్తిస్థాయిలో నిర్వహించాలని ప్రధాని మోదీ ఆదేశించారని వెల్లడించారు. సికింద్రాబాద్‌లోని పరేడ్ గ్రౌండ్‌లో జరిగిన విమోచన దినోత్సవ వేడుకలకు ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. కేంద్ర సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన.. ముందుగా అమరవీరులకు నివాళులర్పించారు. అనంతరం సాయుధ బలగాల నుంచి గౌరవ వందనం అందుుకన్నారు. ఆ తర్వాత ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు.

హైదరాబాద్ రాష్ట్రానికి, కర్ణాటక, మహారాష్ట్రలోని కొన్ని ప్రాంతాలకు సెప్టెంబర్ 17న స్వాతంత్ర్యం వచ్చిందని, సర్దార్ వల్లభాయ్ పటేల్ కృషితో ఈ ప్రాంత ప్రజలు నిజాం పాలన నుంచి విముక్తి పొందారని చెప్పారు. ‘దేశం మొత్తానికి స్వాతంత్ర్యం వచ్చిన ఏడాదికి ఈ ప్రాంత వాసులకు స్వతంత్రం వచ్చింది. నిజాం, రజాకార్ల ఆగడాలను ఆపరేషన్ పోలోతో సర్దార్ పటేల్ ముగింపు పలికారు. ఈ పోరాటంలో ఎందరో ప్రాణాలు అర్పించారు’ అని అమిత్ షా వివరించారు. అలాగే హైదరాబాద్ సంస్థానంలో జరిగిన అకృత్యాలకు సంబంధించిన డాక్యుమెంటరీని దేశవ్యాప్తంగా ప్రదర్శిస్తామని, ఈ సంస్థానాన్ని దేశంలో కలపకుంటే గాంధీ కలలు కన్న స్వతంత్ర భారతం పూర్తయ్యేది కాదని అన్నారు. ప్రస్తుతం ఉన్న ప్రభుత్వం ఏ ఆకాంక్షల కోసం తెలంగాణ ఏర్పడిందో వాటిని గాలికి వదిలేసిందని టీఆర్ఎస్ ప్రభుత్వంపై పరోక్షంగా చురకలేశారు.

 

Tags :