144 ఆక్సిజన్ ప్లాంట్లను... జాతికి అంకితం : వైఎస్ జగన్

144 ఆక్సిజన్ ప్లాంట్లను... జాతికి అంకితం : వైఎస్ జగన్

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో కొవిడ్‌ వల్ల రాష్ట్ర ఆదాయం తగ్గినా ఆస్పత్రుల అభివృద్ధికి చర్యలు తీసుకుంటున్నట్లు  ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి తెలిపారు. రాష్ట్రంలో 50 పడకలు దాటిన 133 ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఆక్సిజన్‌ తయారీ ప్లాంట్లను  తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయం నుంచి జగన్‌ వర్చువల్‌ విధానంలో ప్రారంభించారు. అనంతరం ముఖ్యమంత్రి మీడియాతో మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా నిమిషానికి 44 వేల లీటర్ల మెడికల్‌ ఆక్సిజన్‌ ఉత్పత్తి చేసే 144 ఆక్సిజన్‌ ప్లాంట్లను  జాతికి అంకితం చేస్తున్నామని తెలిపారు. 50 పడకల ఆస్పత్రుల్లోనూ ఆక్సిజన్‌ ప్లాంట్లు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. 100 పడకలు ఉన్న ప్రైవేట్‌ ఆస్పత్రుల్లో ఆక్సిజన్‌ ప్లాంట్లపై 30 శాతం సబ్సిడీ అందిస్తున్నామని తెలిపారు.

సెకండ్‌ వేవ్‌ సమయంలో ఆక్సిజన్‌ ఎయిర్‌లిఫ్ట్‌ చేయాల్సి వచ్చిందన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 24,419 బెడ్‌లకు ఆక్సిజన్‌ పైప్‌ లైన్ల సౌకర్యం కల్పించనున్నామని తెలిపారు. 74 లిక్విడ్‌ మెడికల్‌ ఆక్సిజన్‌ ట్యాంకులు ఏర్పాటు చేశామన్నారు. 163 కమ్యూనిటీ హెల్త్‌ సెంటర్లలో పీడియాట్రిక్‌ కేర్‌ యూనిట్లు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. కనీసం ఒక్క వీఆర్‌డీఎల్‌ ల్యాబ్‌ కూడా లేని పరిస్థితి నుంచి 20 అత్యాధునిక ఆర్టీపీసీఆర్‌ వైరల్‌ ల్యాబ్‌లు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. రాష్ట్రంలో  18 ఏళ్లు పైబడిన వారికి  వ్యాక్సినేషన్‌ పూర్తి చేశామని తెలిపారు. 80 శాతం మందికి రెండు డోసులు ఇవ్వగలిగామని పేర్కొన్నారు.  ఇప్పటి వరకు 82 శాతం మంది టీనేజర్లకు వ్యాక్సినేషన్‌ పూర్తి చేసినట్లు తెలిపారు. 82 శాతం వ్యాక్సినేషన్‌తో దేశంలో అగ్రస్థానంలో ఉన్నామని పేర్కొన్నారు.

 

Tags :