MKOne TeluguTimes-Youtube-Channel

శాసన మండలి ఎన్నికల్లో వైసీపీ జోరు

శాసన మండలి ఎన్నికల్లో వైసీపీ జోరు

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో శాసన మండలి ఎన్నికల్లో మరోసారి అధికార వైసీపీ తన సత్తాను చాటుకుంది. స్థానిక సంస్థల ఎమ్మెల్సీ స్థానాలకు సంబంధించి శ్రీకాకుళం, కర్నూలు, పశ్చిమ గోదావరి జిల్లాలో జరిగిన ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థులు ఘన విజయం సాధించారు. వాస్తవానికి నాలుగు స్థానాలు నామినేషన్‌ ప్రక్రియలోనే ఏకగ్రీవం కావాల్సి ఉన్నప్పటికీ ఇండిపెండెంట్‌ అభ్యర్థులు బరిలో నిలవడంతో ఎన్నికలు అనివార్యమయ్యాయి. 13వ తేదీన జరిగిన ఎన్నికలకు సంబంధించి కౌంటింగ్‌ ప్రక్రియ చేపట్టారు. ఏకపక్షంగా సాగిన ఎన్నికల్లో శ్రీకాకుళం నుండి స్థానిక సంస్థల ఎమ్మెల్సీ వైసీపీ అభ్యర్థిగా పోటీ చేసిన నర్తు రామారావు 632 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. ఇక్కడ ఇండిపెండెంట్‌గా పోటీ చేసిన అభ్యర్థికి 108 ఓట్లు వచ్చాయి. అలాగే కర్నూలు నుండి డాక్టర్‌ మదుసూథన రావు, పశ్చిమ గోదావరి  జిల్లాలో రెండు స్థానాలకు సంబంధించి కరువు శ్రీనివాస్‌, వంకా రవీంద్రనాథ్‌ విజయం సాధించారు. దీంతో స్థానిక సంస్థలకు సంబందించిన తొమ్మిది ఎమ్మెల్సీ స్థానాలను  వైసీపీ కైవశం చేసుకున్నట్లుయింది. నామినేషన్‌ సమయంలోనే ఐదు స్థానాలు ఏకగ్రీవం అయిన సంగతి తెలిసిందే.

 

 

Tags :