రివ్యూ: 'అంటే..సుందరానికీ' ఫ్యామిలీ & కామెడీ ఎంటర్‌టైనర్

రివ్యూ: 'అంటే..సుందరానికీ' ఫ్యామిలీ & కామెడీ ఎంటర్‌టైనర్

తెలుగుటైమ్స్.నెట్ రేటింగ్ : 2.75/5

నిడివి: 2 ఘంటల 56 నిముషాలు
నిర్మాణ సంస్థ : మ్రైతీ మూవీ మేకర్స్‌
నటీనటులు : నాని, నజ్రియా నజీమ్‌, నరేశ్‌ హర్షవర్థన్‌, నదియా, రోహిణి తదితరులు
సంగీతం : వివేక్‌ సాగర్‌ సినిమాటోగ్రఫీ : నికేత్‌ బొమ్మి ఎడిటర్‌ :రవితేజ గిరిజాల
నిర్మాతలు:నవీన్‌ యెర్నేని, రవిశంకర్‌ వై. దర్శకత్వం : వివేక్‌ ఆత్రేయ

విడుదల తేది : 10.06.2022

తొలి చిత్రం నుండి క్లాస్, మాస్ అని తేడా లేకుండా వైవిధ్యమైన పాత్రలు చేస్తూ తనకంటూ ఓ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న హీరో నేచురల్ స్టార్ నాని. ‘శ్యామ్‌ సింగరాయ్‌’తో మళ్లీ హిట్‌ ట్రాక్‌ ఎక్కాడు ఈ హీరో. ఆ మూవీ ఇచ్చిన హిట్‌ కిక్‌తో వరుస సినిమాలు చేస్తున్నాడు. అయితే ఫలితాన్ని పట్టించుకోకుండా.. కొత్త జానర్స్‌ని ట్రై చేయడం నానికి అలవాటు. సినిమా సినిమాకి తన పాత్ర, కథలో వేరియేషన్‌ ఉండేలా చూసుకుంటాడు. వరసగా యాక్షన్‌ డ్రామా చిత్రాలు చేస్తూ వచ్చిన నాని.. ఈ సారి మాత్రం తనకు అచ్చొచ్చిన కామెడీ జానర్‌తో ‘అంటే.. సుందరానికీ’అంటూ ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ చిత్రంతో మలయాళ బ్యూటీ నజ్రియా నజీమ్‌ టాలీవుడ్‌కు పరిచయం అవుతుంది. ఇప్పటికే విడుదలైన టీజర్‌, పాటలకు పాజిటివ్‌ రెస్పాన్స్‌ రావడం.. దానికి తోడు మూవీ ప్రమోషన్స్‌ కూడా గ్రాండ్‌గా చేయడంతో ‘అంటే.. సుందరానికీ’పై హైప్‌ క్రియేట్‌ అయింది. భారీ అంచనాల మధ్య ఈ రోజు శుక్రవారం(జూన్‌ 10) విడుదలైన ఈ మూవీ బ్రాహ్మణ యువకుడు, క్రిస్టియన్ అమ్మాయి.. ప్రేమించుకుంటారు. పెళ్లి చేసుకోవాలనుకున్నప్పుడు వారికి ఎదురయ్యే సమస్యలు.. ఎలా ఉంటాయి. అనే విషయాన్ని ఎంటర్‌టైనింగ్‌గా చెప్పే ప్రయత్నం చేశారు. కథను అందరూ ఊహించవచ్చు. అయితే దాన్ని వివేక్ ఆత్రేయ ఎలా తెరకెక్కించారు. ప్రేక్షకులు ఏ మేరకు ఆదరించారో రివ్యూలో చూద్దాం.

కథ:

సుందర్‌ ప్రసాద్‌ (నాని)..సంప్రదాయ బ్రాహ్మణ కుటుంబానికి చెందిన యువకుడు. అతని తండ్రి (నరేశ్‌) కుటుంబ ఆచార వ్యవహారాలకు చాలా ప్రాధాన్యత ఇస్తుంటాడు.తన వంశంలో పుట్టిన ఏకైక కుమారుడు సుందర్‌ని కూడా తనలాగే పద్దతిగా పెంచాలనుకుంటాడు. సుందర్‌ చిన్నవయసులో చిరంజీవి సినిమాలో చైల్డ్‌ ఆర్టిస్ట్‌గా నటించే అవకాశం వచ్చినట్లే వచ్చి చేజారిపోతుంది. దీంతో కొడుకు జాతకంలో ఏదో దోషం ఉందని జ్యోతిష్యుడు జోగారావు(శ్రీకాంత్‌ అయ్యంగార్‌)ని సంప్రదిస్తుంది అతని ఫ్యామిలీ. అప్పటి నుంచి సుందర్‌ జీవితమే మారిపోతుంది. డబ్బు కోసం జోగారావు ఈ దోషం, ఆ దోషం అంటూ సుందర్‌తో రకరకాల హోమాలు చేయిస్తాడు. దీంతో సుందర్‌కి విసుగెత్తి ఇంట్లో అబద్దాలు చెప్పడం ప్రారంభిస్తాడు. సుంద‌ర్ స్కూల్ డేస్ నుంచి త‌న‌తో పాటు చ‌దువుకునే అమ్మాయి లీల (న‌జ్రియా న‌జీమ్‌)ను ఇష్ట‌ప‌డ‌తాడు. అది కాస్త ప్రేమ‌గా మారుతుంది. స్కూల్‌లో, స్నేహితుల ద‌గ్గ‌ర తన‌కు త‌గిన గుర్తింపు లేద‌ని బాధ‌ప‌డే లీల‌కి ఏదైనా డిఫ‌రెంట్‌గా చేస్తేనే అంద‌రిలో గుర్తింపు ద‌క్కుతుంద‌ని ఆమె తండ్రి (అలగం పెరుమాల్‌) చెబుతాడు. దాంతో ఆమె ఫొటోగ్రాఫ‌ర్ అవుతుంది. ఆమె తండ్రి హిందువులు పెట్టిన ప్రసాదం కూడా స్వీకరించడు. అలాంటి ఫ్యామిలీకి చెందిన సుందర్‌, లీలాలు..ప్రేమలో పడతారు. ఇరు కుటుంబాలను ఒప్పించడానికి రకరకాల అబద్దాలు ఆడతారు. ఆ అబద్దాలు వీరి జీవితంలో ఎలాంటి అల్లకల్లోలానికి దారి తీశాయి? సుందర్‌, లీలాలు చెప్పిన ఆబద్దాలు ఏంటి? ఇతర మతస్థులతో స్నేహం అంటేనే మండిపడే సుందర్‌, లీలాల కుటుంబ సభ్యులు వీరికి పెళ్లికి ఎలా ఒప్పుకున్నారు? అనేది తెలియాలంటే థియేటర్స్‌లో ‘అంటే సుందరానికీ’సినిమా చూడాల్సిందే.

నటీనటుల హావభావాలు:

ఈ చిత్రంలో కూడా అంతే.. సుందర్‌ ప్రసాద్‌ పాత్రలో నాని ఒదిగిపోయాడు. తనదైన కామెడీతో నవ్వించాడు. లీలా గా థామస్‌గా నజ్రియా ఆకట్టుకుంది. తెలుగులో ఇది ఆమెకు తొలి సినిమా అయినా.. చాలా బాగా నటించింది. పైగా తన పాత్రకు తానే డబ్బింగ్‌ చెప్పుకోవడం విశేషం. సుందర్‌ తండ్రిగా నరేశ్‌ మరోసారి తన అనుభవాన్ని తెరపై చూపించాడు. ఇక సంప్రదాయ బ్రాహ్మణ కుటుంబానికి చెందిన మహిళగా, భర్త మాటకు ఎదురు చెప్పలేని భార్యగా రోహిణి తనదైన నటనతో ఆకట్టుకుంది. హీరోయిన్‌ తల్లిగా నదియ, తండ్రిగా అలగం పెరుమాల్‌ తమ పాత్రలకు న్యాయం చేశారు. ఇక ఈ సినిమాలో అనుపమ పరమేశ్వరన్‌ కూడా ఉంది. ఈ విషయాన్ని చిత్ర యూనిట్‌ ఎందుకు దాచిపెట్టిందో తెలియదు కానీ.. ఆమె పాత్ర మాత్రం అందరిని ఆకట్టుకుంది. సుందర్‌ సహోద్యోగి సౌమ్య పాత్రలో అనుపమ మెరిసింది. ఇక సుందర్‌ బాస్‌గా హర్షవర్ధన్‌ తనదైన కామెడీతో నవ్వించాడు. మిగిలిన నటీనటులు తమ పాత్రల పరిధిమేర నటించారు.

సాంకేతికవర్గం పనితీరు:

ఇక సాంకేతిక పరంగా చూస్తే ఇంత‌కు ముందు ప్ర‌స్తావించిన‌ట్లు డైరెక్ట‌ర్ వివేక్ ఆత్రేయ‌.. తెలిసిన క‌థే అయినా దాన్ని హ్యాండిల్ చేసిన తీరు.. ముఖ్యంగా ఎంటర్‌టైనింగ్‌గా ఉంటూనే ఎమోష‌న‌ల్‌గా తెర‌కెక్కించారు. అయితే సినిమా వ్య‌వ‌ధి మూడు గంట‌లు నిడివి కాకుండా కాస్త త‌గ్గించి ఉంటే బావుండేద‌నిపించింది. కొన్ని సంద‌ర్భాల్లో సినిమా ముందుకు సాగ‌లేద‌నే ఫీలింగ్ క‌లుగుతుంది. వివేక్ సాగ‌ర్ సంగీతంలోని పాట‌లు విన‌గానే హ‌మ్ చేసుకునేలా లేక‌పోయినా.. క‌థ‌లో భాగంగానే ఉన్నాయి. నేప‌థ్య సంగీతం బావుంది. నికేత్ బొమ్మి సినిమాటోగ్రఫీ బావుంది.ఎడిటర్‌ రవితేజ గిరిజాల తన కత్తెరకు ఇంకాస్త పనిచెప్పాల్సింది.ముఖ్యంగా ఫస్టాఫ్‌లో కొన్ని సీన్స్‌ని మరింత క్రిస్పీగా కట్‌ చేయాల్సిన అవసరం వుంది. మైత్రీ మూవీ మేకర్స్ ప్రొడక్షన్ వ్యాల్యూస్‌ రిచ్‌గా ఉన్నాయి.

విశ్లేషణ:

వేరు వేరు మతాలకు చెందిన అబ్బాయి, అమ్మాయి ప్రేమించుకోవడం.. వారి పెళ్లికి పెద్దలు నిరాకరించడం.. పేరెంట్స్‌ని ఎదురించి, అష్టకష్టాలు పడి వారు పెళ్లి చేసుకోవడం..ఈ కాన్సెఫ్ట్‌తో గతంలో చాలా సినిమాలే వచ్చాయి.‘అంటే సుందరానికీ’ కథ కూడా ఇంచుమించు ఇలానే ఉంటుంది..అయితే పాత కథకు కొత్త ట్రీట్‌మెంట్‌ ఇచ్చి, కాస్త కామెడీగా చిత్రాన్ని మలిచాడు దర్శకుడు వివేక్‌ ఆత్రేయ. ప్రేమ‌, కుటుంబ బంధాలు, బాంధ‌వ్యాలు మిళిత‌మైన క‌థ‌ల‌తో సినిమాలను రూపొందించే స‌మ‌యంలో క‌థ‌లో కొత్త‌ద‌నం లేక‌పోయినా.. దాన్ని ప్రేక్ష‌కుల‌కు న‌చ్చేలా ఎలా చేశామనేది చాలా ముఖ్యం. ఈ కోవ‌లో సినిమాల‌ను తెర‌కెక్కించే ద‌ర్శ‌కుల్లో వివేక్ ఆత్రేయ ఒక‌రు. ఆయ‌న తొలి రెండు చిత్రాలు మెంట‌ల్ మ‌దిలో, బ్రోచెవారెవ‌రురా సినిమాల‌ను గ‌మ‌నిస్తే ఈ విష‌యాల‌ను మ‌నం అర్థం చేసుకోవ‌చ్చు. ఎలాంటి అశ్లీలతకు తావివ్వకుండా..కంప్లీట్‌ క్లీన్‌ ఎంటర్‌టైనర్‌గా సినిమాను తెరకెక్కించినా.. కథనం మాత్రం సాదాసీదాగా సాగుతుంది. చివర్లో చిన్న సందేశం ఇచ్చి ప్రేక్షకులను థియేటర్స్‌ నుంచి బయటకు పంపాడు దర్శకుడు.

 

 

Tags :
ii). Please add in the header part of the home page.