మూడు రాజధానులపై ... సీఎం జగన్ కీలక ప్రకటన

మూడు రాజధానులపై ... సీఎం జగన్ కీలక ప్రకటన

ఆంధ్రప్రదేశ్‌ రాజధానిపై ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి అసెంబ్లీలో కీలక ప్రకటన చేశారు. మూడు రాజధానుల నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంటున్నామని ప్రకటించారు. ఈ సందర్భంగా జగన్‌ మాట్లాడుతూ మూడు రాజధానుల బిల్లును మెరుగుపరుస్తామని తెలిపారు. పూర్తి సమగ్రమైన వికేంద్రీకరణ బిల్లును తీసుకొస్తామని తెలిపారు. కనీస వసతుల కల్పనకు అంత డబ్బు లేనప్పుడు రాజధాని అనే ఊహా చిత్రం సాధ్యం అవుతుందా? రాష్ట్రం అభివృద్ధి చెందాలన్న లక్ష్యంతోనే గతంలో విశాఖను ఎగ్జిక్యూటివ్‌ క్యాపిటల్‌గా చేశాం. రాజధానిపై మా నిర్ణయాన్ని ఈ రెండేళ్లలో రకరకాలుగా వక్రీకరించారు. వికేంద్రీకరణ సరైన మార్గమని నమ్మి చర్యలు చేపట్టాం. అన్నీ అనుకున్నట్టు జరిగుంటే ఇప్పటికే మూడు ప్రాంతాలు అభివృద్ధి చెందేవి. సమగ్రమైన బిల్లుతో మళ్లీ సభ ముందుకు వస్తాం. అందరితో చర్చించి అవాంతరాలు లేకుండా ఈ సారి కొత్త బిల్లు పెడతాము అని జగన్‌ స్పష్టం చేశారు.

అమరావతి ప్రాంతమంటే నాకు ఎటువంటి వ్యతిరేకత లేదు. నా ఇల్లు ఇక్కడే ఉంది. ఈ ప్రాంతం అంటే నాకు ప్రేమ ఉంది. రాజధాని అటు విజయవాడ కాదు, ఇటు గుంటూరు కాదు. ఈ ప్రాంతంలో కనీస వసతుల కల్పనకే లక్ష కోట్లు అవుతుంది. ఈ రోజు లక్ష కోట్లు పదేళ్లకు 6 లక్షల కోట్లు అవుతుంది. గత ప్రభుత్వ లెక్కల ప్రకారమే లక్షల కోట్లు కనీస వసతులకు వెచ్చించాల్సి ఉంది. మన పిల్లలకు పెద్ద నగరాన్ని ఎప్పుడు అందిస్తాం? ఉద్యోగాలు ఎలా కల్పిస్తాం? రాష్ట్రంలో అతిపెద్ద సిటీ విశాఖ. అన్ని వసతులు ఉన్న నగరం విశాఖ. అక్కడ కొద్దిగా వసతులు పెంచితే హైదరాబాద్‌తో పోటీ పడుతుంది అని తెలిపారు.

 

Tags :