కమ్మ, క్షత్రియ కార్పొరేషన్ ల వెనుక మతలబు ఏంటి?

కమ్మ, క్షత్రియ కార్పొరేషన్ ల వెనుక మతలబు ఏంటి?

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కొత్తగా మూడు కార్పొరేషన్లను ఏర్పాటు చేసింది. కమ్మ, రెడ్డి, క్షత్రియ కులాలకు ఒకేసారి కార్పొరేషన్లు తీసుకొచ్చారు సీఎం జగన్. ఎప్పటి నుంచో ఈ కులాల నేతలు కార్పొరేషన్ల కోసం డిమాండ్ చేస్తున్నారు. ఇప్పుడు వాటిని ఏర్పాటు చేసి వారి కోరికను నెరవేర్చారు సీఎం. ఐతే ఇంత పెద్ద నిర్ణయం వెనుక ఏదో ఉందనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి.

ఏపీలో ఇప్పటివరకూ ఓసీ కులాల్లో బ్రాహ్మణ, కాపు కార్పొరేషన్లు మాత్రమే ఉన్నాయి. చాలా రోజుల నుంచి రెడ్డి, కమ్మ, క్షత్రియ కులాలు తమకు కూడా ప్రత్యేక కార్పొరేషన్ కావాలని డిమాండ్ చేస్తున్నాయి. ఎప్పటి నుంచే వీటికి డిమాండ్లు ఉన్నా.. అనూహ్యంగా ఒకేసారి మూడు కులాలకూ కార్పొరేషన్లను ప్రకటించింది ఏపీ ప్రభుత్వం. దీంతో అందరూ ఆశ్చర్యపోయారు.

సీఎం జగన్ తన సామాజిక వర్గానికే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారని ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి. కీలక పదవుల్లో తన సామాజికవర్గం వారినే నియమించుకుంటున్నారన్న వాదనా ఉంది. అదే సమయంలో కమ్మ సామాజికవర్గాన్ని సీఎం టార్గెట్ చేశారని ఆ వర్గానికి చెందిన కొంతమంది ఆరోపిస్తున్నారు. ఇటీవల ఎంపీ రఘురామకృష్ణంరాజును అరెస్టు చేయడంతో క్షత్రియ సామాజికవర్గంలోని ఓ వర్గం ప్రభుత్వంపై గుర్రుగా ఉంటోంది. 

దీంతో అటు కమ్మ, ఇటు క్షత్రియ సామాజికవర్గాల నుంచి వస్తున్న విమర్శలకు ఒక్క జీవోతో సమాధానం చెప్పారు జగన్. ఒకేసారి కమ్మ, క్షత్రియ కార్పొరేషన్లతో పాటు రెడ్డి సామాజిక వర్గానికి కూడా కార్పొరేషన్ ఏర్పాటు చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. తనకు అన్ని కులాలు సమానమే అనే సంకేతాలిచ్చారు. అయితే.. దీని వెనుక రాజకీయ కోణం కూడా ఉందన్న టాక్ నడుస్తోంది. వైసీపీకి కాస్త వ్యతిరేకంగా ఉండే కమ్మ, క్షత్రియ వర్గాలను కార్పొరేషన్ల ఏర్పాటుతో అనుకూలంగా మార్చుకునే ప్రయత్నంలో భాగంగానే ఈ నిర్ణయం తీసుకున్నారన్న చర్చ సాగుతోంది. మరి ఆ రెండు సామాజికవర్గాలు ఎలా వ్యవహరిస్తాయన్నది చూడాలి మరి.

 

Tags :
ii). Please add in the header part of the home page.