నిబంధనలు ఉల్లంఘించిన ప్రభుత్వ ఉద్యోగులకు ఏపీ సర్కార్ షోకాజ్ నోటీసులు

నిబంధనలు ఉల్లంఘించిన ప్రభుత్వ ఉద్యోగులకు ఏపీ సర్కార్ షోకాజ్ నోటీసులు

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సంఘానికి వైఎస్సార్‌సీపీ సర్కార్ ఊహించని షాకిచ్చింది. సంఘం గుర్తింపు కూడా రద్దు చేయడానికి సిద్ధమైనట్లు తెలుస్తోంది. గత వారం ఏపీ ప్రభుత్వ ఉద్యోగలకు రావల్సిన వేల కోట్ల బకాయిలను ప్రభుత్వం వెంటనే చెల్లించాలంటే సంఘం నేత కేఆర్ సూర్యనారాయణ నేతృత్వంలో కొందరు ప్రతినిధులు నేరుగా గవర్నర్‌ను కలిసి ఫిర్యాదుచేసిన విషయం తెలిసిందే. దీంతో నిబంధనలను ఉల్లంఘించి ప్రభుత్వంపైనే గవర్నర్‌కు ఫిర్యాదు చేయడంతో సీఎం జగన్మోహన్ రెడ్డి సదరు సంఘ నేతలపై చర్యలకు దిగారు. 

అందులో భాగంగానే ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా గవర్నర్ హరిచందన్‌తో భేటీ అయిన ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సంఘానికి ప్రభుత్వం ఇవాళ షోకాజ్ నోటీసు జారీ చేసింది. నిబంధనలు ఉల్లంఘించినందుకు సంఘం గుర్తింపు రద్దు చేయాలని అనుకుంటున్నామని, గుర్తింపు ఎందుకు రద్దు చేయకూడదో 7 రోజుల్లో సరైన సమాధానం ఇవ్వాలని సాధారణ పరిపాలనా శాఖ నోటీసు జారీ చేసింది. 

వేతనాలు, ఆర్ధిక ప్రయోజనాలపై ఉద్యోగులు గవర్నర్‌కు ఫిర్యాదు చేయటం రోసా నిబంధనలకు విరుద్ధమని నోటీసులో ప్రభుత్వం పేర్కొంది. సమస్యలపై ప్రభుత్వాన్ని సంప్రదించే ఇతర మార్గాలున్నా గవర్నర్‌ను ఎందుకు సంప్రదించాల్సిన అవసరం ఏంటని ప్రశ్నించింది. ఉద్యోగులు గవర్నర్‌కు ఫిర్యాదు చేయడం వెనుక రాజకీయ పార్టీలు, ముఖ్యంగా విపక్షాల పాత్ర ఉన్నట్లు ప్రభుత్వం భావిస్తోంది. ఒకవేళ అదే నిజమని తేలినా లేదా నోటీసులపై ఉద్యోగుల సంఘం నుంచి సంతృప్తికరమైన వివరణ రాకపోయినా గుర్తింపు రద్దు తప్పేలా లేదు. 

ఈ నేపథ్యంలో ఉద్యోగులంతా డైలమాలో పడ్డారు. ఎలాగోలా ప్రభుత్వం ఆగ్రహాన్ని తగ్గించి సంతృప్తికర వివరణ ఇచ్చేందుకు సిద్ధమవుతున్నట్లు సమాచారం.

 

 

Tags :