ఏపీలో క్యాన్సర్ రోగుల చికిత్సకు ఆసరాగా చర్యలు

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి వైద్యరంగంలో రాష్ట్రాన్ని అగ్రభాగాన ఉంచేందుకు అవసరమైన అన్నీ చర్యలను చేపట్టారు. అలాగే రాష్ట్రంలో క్యాన్సర్‌ను సమర్థంగా నియంత్రించేందుకు అవసరమైన చర్యలను చేపట్టారు. ఇందుకోసం జాతీయంగా, అంతర్జాతీయంగా గుర్తింపు పొందిన సంస్థలను భాగస్వామ్యం చేస్తున్నారు. మరోవైపు ప్రభుత్వం ఆయా సంస్థల సలహాలు, సూచనలు, సహకారం తీసుకుంటూ క్యాన్సర్‌పై యుద్ధానికి ప్రణాళికలు రచిస్తోంది. ఇందులో భాగంగా క్యాన్సర్ చికిత్సకు ప్రసిద్ధి చెందిన టాటా మెమోరియల్ సెంటర్‌కు చెందిన విశాఖలోని హోమీ బాబా క్యాన్సర్ హాస్పిటల్‌తో రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ ఎంవోయూ చేసుకునేందుకు ప్రభుత్వం అంగీకారం తెలిపింది. రాష్ట్రంలో ప్రతి లక్ష మంది జనాభాలో సుమారు 120 మంది క్యాన్సర్‌తో బాధపడుతున్నట్టు ఓ అంచనా. ఈ సంఖ్య భవిష్యత్‌లో మరింత పెరిగే అవకాశం ఉంది. దీంతో భవిష్యత్ అవసరాలను దృష్టిలో ఉంచుకుని అధునాతన వైద్య విధానాలతో రాష్ట్రంలో క్యాన్సర్ చికిత్స వనరులను సమకూర్చేందుకు ప్రణాళికలు రచించారు. ఈ క్రమంలో వైద్య, ఆరోగ్య శాఖ విశాఖపట్నం హోమీ బాబా ఆస్పత్రి నుంచి సాంకేతిక సహకారం పొందనుంది. వ్యాధి గుర్తింపునకు స్క్రీనింగ్, పలు రకాల క్యాన్సర్ ప్రమాదాల గుర్తింపు, జిల్లాల్లో ప్రివెంటివ్ అంకాలజీ, క్యాన్సర్ డే కేర్ సేవలు అందుబాటులోకి తేవడం, రిజిస్ట్రీ, ప్రభుత్వాస్పత్రుల్లో వైద్యులు, వైద్య సిబ్బందికి నైపుణ్యాల పెంపునకు శిక్షణ అందించడం వంటివి హోమీ బాబా ఆస్పత్రి అందించనుంది.
ప్రభుత్వాస్ప త్రుల్లో పొగాకు విరమణ కేంద్రాల ఏర్పాటు, స్క్రీనింగ్‌లో నిర్ధారించిన క్యాన్సర్ రోగులు, హైరిస్క్ రోగులకు మెరుగైన వైద్యం అందించేందుకు రెఫరల్ విధానం రూపకల్పనకు సంబంధించి హోమీ బాబా ఆస్పత్రి సహకారం అందించనుంది. విభజన అనంతరం క్యాన్సర్ చికిత్స వనరులను ఏపీ కోల్పోయిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో క్యాన్సర్ వ్యాధి కట్టడి, ప్రభుత్వ రంగంలో చికిత్స వనరులను మెరుగుపరచడంపై సీఎం వైఎస్ జగన్ సర్కార్ దృష్టి సారించింది. భవిష్యత్‌లో క్యాన్సర్ చికిత్స కోసం ఇతర రాష్ట్రాలకు ప్రజలు వెళ్లకుండా రాష్ట్రంలోనే చికిత్స వనరులను మెరుగుపరచనున్నారు.