సీఎం వైఎస్ జగన్ మరో కొత్త కార్యక్రమం

ప్రజలకు పార్టీ, ప్రభుత్వం మరింత దగ్గరయ్యేందుకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఈ కార్యక్రమానికి జగనన్నకు చెబుదాం అనే పేరుని ఖరారు చేశారు. ఈ కార్యక్రమం సన్నాహకాలపై ముఖ్యమంత్రి జగన్ క్యాంపు కార్యాలయంలో సమీక్ష నిర్వహించారు. ఈ కార్యక్రమం ప్రారంభానికి అధికారులు సన్నద్ధం కావాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. వినతులను సంతృప్తిస్థాయిలో పరిష్కరించడం ఈ కార్యక్రమం ప్రధాన లక్ష్యమని తెలిపారు. స్పందన కార్యక్రమంలో భాగంగా అత్యధిక ఆర్జీలు అందుకుంటున్న ప్రభుత్వ విభాగ అధిపతులతో సీఎం సమీక్షించారు. ఆర్జీల పరిష్కారంలో అనుసరించాల్సిన విధానాలపై సమగ్రంగా చర్చించారు. త్వరలో చేపట్టబోయే జగనన్నకు చెబుదాం కార్యక్రమ విధి విధానాలపై సుదీర్ఘంగా చర్చించారు. ఈ సమావేశంలో ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి, పురపాలక పట్టణాభివృద్ధి స్పెషల్ సీఎస్ వై శ్రీలక్ష్మి, పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ స్పెషల్ సీఎస్ బుడితి రాజశేఖర్, వైద్య ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి ఎం టీ కృష్ణబాబు, హోంశాఖ ముఖ్య కార్యదర్శి హరీష్ కుమార్ గుప్తా, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ కమిషనర్ ప్రవీణ్ కుమార్, సెర్ఫ్ సీఈవో ఏఎండి ఇంతియాజ్, ఇతర ఉన్నతాధికారులు హాజరయ్యారు.