సురేష్ కాకర్ల సేవలకు ప్రశంస

సురేష్ కాకర్ల సేవలకు ప్రశంస

కొత్త ఊరికి వెళ్లినప్పుడు ఏదైనా ఎమర్జెన్సీ వస్తే ఏం చేస్తాం? తెగ కంగారు పడిపోతాం. ఫోన్ల మీద ఫోన్లు చేస్తాం. అదే మనం ఉన్నది విదేశంలో అయితే? ఏం చెయ్యాలో కూడా తెలియదు. అలాంటి సమయంలో తామున్నామంటూ అమెరికాలో సమస్యల్లో ఉన్న భారతీయులకు అండగా ఉండేందుకు అక్కడి తెలుగు సంఘాలు ఎప్పుడూ ముందుంటాయి. ముఖ్యంగా తానా (తెలుగు అసోసియేషన్‌ ఆఫ్‌ నార్త్‌ అమెరికా) ఇలాంటి సమస్యల గురించి తెలియగానే స్పందిస్తుంది. ఈ సంస్థలోని తానా టీం స్క్వేర్‌ విభాగానికి నేషనల్‌ లీడ్‌గా సురేష్‌ కాకర్ల ఉన్నారు. ఆయన జన్మదినం సందర్భంగా ఎంతోమంది శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంలోనే ఆయనతో కలిసి పనిచేసిన ఓ వలంటీర్‌ సురేష్‌ గురించి కొన్ని విషయాలను సామాజిక మాధ్యమాల్లో పంచుకున్నారు.

‘2017లో తొలిసారి సురేష్‌తో నాకు పరిచయం అయింది. ఆ మరుసటి ఏడాది ఒకసారి సమావేశం అయ్యాం. అప్పుడే భారతీయులకు అత్యవసర సమయాల్లో సహాయం చేసేందుకు ఒక టీం ఏర్పాటు చేయాలని ఆయన సలహా ఇచ్చారు. ఆయన నేతృత్వంలో ఒక టీం ఏర్పాటు చేశాం. ఇది ఏర్పాటు చేసిన నాలుగు రోజుల్లోనే అమెరికాలో చనిపోయిన ఒక తమిళ వ్యక్తి మృతదేహాన్ని ఆయన ఇంటికి చేర్చగలిగాం. ఈ సమయంలో సురేష్‌ చాలా సహకారం అందించారు. ఏమేం చేయాలో మార్గనిర్దేశం చేశారు. అలా ఒకరికి సాయం చేసిన తర్వాత కలిగే సంతృప్తి వేరుగా ఉంటుందని అర్థమైంది. అదే స్ఫూర్తితో రియాక్షన్‌ (రెస్పాన్స్‌ ఎమర్జెన్సీ యాక్సెస్‌ అండ్‌ కేర్‌ టు ఇండియన్‌ ఓవర్సీస్‌ నెట్‌వర్క్‌ టీమ్‌ ఇన్‌కార్పొరేటెడ్‌)గా మారింది. దీనిలో ఉన్న వాలంటీర్లు ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తున్నారు.

గడిచిన పదేళ్లలో సురేష్‌ సుమారు 650 కేసుల్లో బాధితులకు సహాయం చేశారు. ఇప్పుడు తానా టీమ్‌ స్క్వేర్‌ లీడ్‌గా ఉన్నారు. ఒకసారి ఒక తమిళ కుటుంబంలో సమస్య వచ్చింది. వాళ్లకు ఏం చెయ్యాలో తోచలేదు. అప్పుడు సురేష్‌ అక్కడకు వచ్చి నన్ను పిలిపించారు. ఆ కుటుంబానికి ఎలాంటి సాయం కావాలన్నా దగ్గరుండి చెయ్యాలని చెప్పారు. మాకు తెలుగు రాకపోయినా తానా టీంలో మేం కూడా సభ్యులుగా ఉన్న మేం.. ఇలాంటి ఎన్నో సమస్యల్లో పరిష్కారాల కోసం కృషి చేశాం. చాలా మంది దారిలో సురేష్‌ను చూస్తే గుడికి వెళ్లి దేవుడిని చూడాల్సిన అవసరం లేదని అన్న మాటలు కూడా నా చెవిన చాలాసార్లు పడ్డాయి. అసలు ఆయన గురించి పెద్ద కథే రాయాలని ఉందికానీ.. ఇప్పుడు ఆ సమయం కాదు. ఏమైనా ఈ సూపర్‌ హీరోకు జన్మదిన శుభాకాంక్షలు. ప్రతి పండుగలో మా కుటుంబాలను కూడా మీ కుటుంబంలాగే భావించే మీకు.. మీరు చేసే సమాజసేవకు ధన్యవాదాలు’ అని సదరు తమిళ సామాజిక కార్యకర్త ఒకరు ఫేస్‌బుక్‌ మీడియా వేదికగా పంచుకున్నారు.

 

Tags :