MKOne TeluguTimes-Youtube-Channel

అదానీ, రాహుల్ మధ్య నలుగుతున్న చట్టసభలు..!

అదానీ, రాహుల్ మధ్య నలుగుతున్న చట్టసభలు..!

పార్లమెంటు సమావేశాలు ప్రారంభమై వారమవుతోంది. కానీ ఇంతవరకూ సభా కార్యక్రమాలు మాత్రం జరగలేదు. ప్రతిరోజూ సభ ప్రారంభం కాగానే వాయిదా తీర్మానాలు, ఆందోళనలతో సభలు దద్దరిల్లుతున్నాయి. ఆ తర్వాత కాసేపటికే మరుసటిరోజుకు ఉభయసభలు వాయిదా పడుతున్నాయి. అధికార, విపక్షాల మధ్య రెండే అంశాలు ఈ వాయిదాలకు కారణమవుతోంది. రాహుల్ గాంధీ క్షమాపణ చెప్పాలని బీజేపీ... మోదానీపై చర్చకు అనుమతించాలని విపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి. ఇవే సభల ప్రతిష్టంభనకు కారణమవుతున్నాయి.

పార్లమెంటు ఉభయసభలు చర్చలేవీ లేకుండానే సాగిపోతున్నాయి. అదానీ సంస్థల ఆర్థిక అవకతవకలపై హిండెన్ బర్గ్ ఇచ్చిన నివేదికపై చర్చకు అనుమతించాలని కాంగ్రెస్ సహా పలు విపక్ష పార్టీలు డిమాండ్ చేస్తున్నాయి. స్నేహితుడికి మేలు చేసేందుకే ప్రధాని మోదీ వ్యవహరిస్తున్నారని, అందుకే చర్చకు అంగీకరించడం లేదని విమర్శిస్తున్నాయి. అదాని వ్యవహారంపై చర్చకు అనుమతించే వరకూ తమ పోరాటం ఆగదని కాంగ్రెస్ పార్టీ స్పష్టం చేసింది. వన్ నేషన్ – వన్ దోస్త్ పేరుతో బీఆర్ఎస్ కూడా బీజేపీని టార్గెట్ చేసింది.

అయితే రాహుల్ గాంధీ బ్రిటన్ పర్యటన సందర్భంగా దేశాన్ని కించపరిచేలా మాట్లాడారని.. దానికి ముందు క్షమాపణ చెప్పాలని బీజేపీ డిమాండ్ చేస్తోంది. భారత చట్టసభల్లో ప్రతిపక్షాల ఫోన్లు, మైకులు మూగబోతాయని, అక్కడ స్వేచ్ఛ లేదని ఇటీవల బ్రిటన్ లో జరిగిన సమావేశంలో రాహుల్ గాంధీ వ్యాఖ్యానించారు. ఇది దేశ ప్రతిష్టకు భంగం కలిగించడమేనని బీజేపీ అంటోంది. అందుకే దేశ పరువు ప్రతిష్టలను విదేశీ గడ్డపై మంటగలిపిన రాహుల్ గాంధీ క్షమాపణ చెప్పాల్సిందేనని బీజేపీ డిమాండ్ చేస్తోంది. అవసరమైతే రాహుల్ గాంధీపై ప్రివిలేజ్ మోషన్ మూవ్ చేసేందుకు కూడా సిద్ధమవుతోంది. రాహుల్ గాంధీని సభ నుంచి బహిష్కరించేందుకే బీజేపీ వ్యూహం రచిస్తోందని కాంగ్రెస్ ఆరోపిస్తోంది.

అయితే ఆదానీ వ్యవహారంపై చర్చకు అనుమతిస్తే అన్నింటికీ తాను సభలోనే సమాధానం చెప్తానంటున్నారు రాహుల్ గాంధీ. జాయిట్ పార్లమెంటరీ కమిటీ వేస్తే అన్ని అంశాలు వెలుగులోకి వస్తాయని రాహుల్ సూచిస్తున్నారు. కానీ అధికార బీజేపీ ఇందుకు సిద్ధంగా లేదు. కాబట్టి ఇప్పట్లో ఈ చిక్కుముడి వీడకపోవచ్చు.

 

 

Tags :